logo

చిత్రం.. దారితప్పితే చేటే!

నగరానికి చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ రీల్స్‌ చేస్తుంటుంది. ఫాలోవర్లు వేల సంఖ్యలో ఉన్నారు. కొత్త సినిమా పాటలపై డ్యాన్సులు, డబ్‌స్మాశ్‌లు చేస్తూ ఓ వీడియో తన ఖాతాలో పోస్టు చేసింది.

Published : 26 Jul 2023 05:37 IST

లైకుల మోజులో యువత తప్పటడుగులు
పోస్టులకు ముందే జాగ్రత్తలు తప్పనిసరి

నగరానికి చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ రీల్స్‌ చేస్తుంటుంది. ఫాలోవర్లు వేల సంఖ్యలో ఉన్నారు. కొత్త సినిమా పాటలపై డ్యాన్సులు, డబ్‌స్మాశ్‌లు చేస్తూ ఓ వీడియో తన ఖాతాలో పోస్టు చేసింది. అందులో ఆమె పారదర్శకంగా ఉండే దుస్తులు ధరించింది. తొలుత ఈ విషయాన్ని గమనించలేదు. సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్‌గా మారాక పొరపాటు గుర్తించి వీడియో తొలగించినా ప్రయోజనం లేకుండా పోయింది.

* ఒక మధ్య వయస్కురాలు సినిమా పాటలను అనునయిస్తూ రీల్స్‌ చేస్తుంటారు. ఈమె వీడియోలు బాగా పాపులర్‌ అయ్యి.. ఫాలోవర్ల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలోనే ఆమెకు కొందరు ఫోన్‌ చేసి వేధించడం మొదలుపెట్టారు. మరికొందరు అసభ్యంగా మాట్లాడడంతో ఆమె ఫోన్‌ నంబరు మార్చి.. ఖాతాను తొలగించారు.

లైకులు రావాలి.. ఫాలోవర్లు పెరిగిపోవాలి.. ఏదేమైనా ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోవాలి..! ప్రస్తుతం ఎంతోమంది యువత ఈ దిశగా ఆలోచిస్తున్నారు. రీల్స్‌ చేసే క్రమంలో చేసిన పొరపాట్లను ఏ మాత్రం గమనించకుండా సామాజిక మాధ్యమాల్లో ఖాతాల్లో పోస్టు చేస్తున్నారు. ఇవి నెట్టింట వైరల్‌గా మారి.. ట్రోల్‌ అయ్యాక చేసిన తప్పు గుర్తించి తలబాదుకుంటున్నారు. కొన్నిసార్లు దుస్తులు సక్రమంగా లేని ఫొటోలు, వీడియోలు వెలుగులోకి వస్తుంటే.. ఇంకొన్నిసార్లు అర్ధనగ్న చిత్రాలు బయటకొస్తున్నాయి. ఈ పరిణామాలు అటు యువతను, కుటుంబ సభ్యుల్ని తలదించుకునేలా చేస్తున్నాయి.

చేటు చేస్తోన్న క్రేజు..: ఇంకొందరు సామాజిక మాధ్యమ సంస్థల్లో వీడియోలు చేస్తూ డబ్బు సంపాదించవచ్చనే తాపత్రయంతోనూ రీల్స్‌, ఇతరత్రా పోస్టులు పెడుతుంటారు. తొలుత చాలామంది టిక్‌టాక్‌ చేసేవారు. ఆ తర్వాత ఆ యాప్‌ నిషేధంతో యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర యాప్‌ల ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే వారూ దీన్నో అవకాశంగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు తప్పటడుగువేస్తున్నారని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

ఆన్‌లైన్‌ స్టేటస్‌తో నష్టం

తరచూ వీడియోలు, చిత్రాలతో పాటు ఆన్‌లైన్‌ స్టేటస్‌లూ యువతను ముఖ్యంగా అమ్మాయిల్ని వెంటాడుతున్నాయి. తాము చేసే పని.. ఎక్కడికెళ్తున్నామో చిత్రాలతో సహా స్టేటస్‌లు పెట్టడం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తోంది. యువతుల్ని అనుసరించే ఉన్మాదులకు ఇదో పెద్ద అవకాశంగా మారుతోంది. ఎల్బీనగర్‌కు చెందిన ఓ యువతి స్నేహితులతో కలిసి ఇటీవల పర్యాటక ప్రాంతానికి వెళ్లింది. ఆమె స్టేటస్‌ చూసి తెలుసుకున్న యువకుడు గంటలో అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే యువకుని నుంచి వేధింపులు ఎదుర్కొన్న విద్యార్థిని గట్టిగా కేకలు వేస్తూ పోలీసులకు ఫోన్‌ చేస్తానని చెప్పడంతో భయపడి పారిపోయాడు. ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. ఫాలోవర్ల ముసుగులో సమాచారం తస్కరించే సైబర్‌ నేరగాళ్ల బారినపడుతున్నారు.

ఈనాడు- హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని