logo

పోలీసుల అదుపులో ద్విచక్ర వాహనాల దొంగ

తాండూరు పట్టణంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

Published : 29 Apr 2024 04:13 IST

న్యూస్‌టుడే, తాండూరు: తాండూరు పట్టణంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. తాండూరు పట్టణ సీఐ సంతోష్‌ కుమార్‌, స్థానికులు తెలిపిన ప్రకారం.. శుక్రవారం రాత్రి తాండూరులోని జిల్లా ఆసుపత్రిలో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఒప్పంద ఉద్యోగి తన ద్విచక్రవాహనాన్ని ఆసుపత్రి ఆవరణలో పార్కు చేసి విధుల్లోకి వెళ్లారు. శనివారం ఉదయం విధులు ముగించుకుని ద్విచక్ర వాహనం వద్దకు వస్తే కనిపించలేదు. వాహనం చోరీకి గురైందని నిర్ధారించుకుని అదే రోజు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కొన్ని ఆధారాల ప్రకారం యాలాల మండలం హాజిపూర్‌ గ్రామంలోని ఓ వ్యక్తి ఇంటికి వెళ్లారు. చోరికి గురైన వాహనం అక్కడే ఉండడంతో నిందితున్ని అదుపులోకి తీసుకుని తాండూరు ఠాణాకు తరలించారు. అయితే సదరు వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని తస్కరించాడా? ఇంతకు ముందు అతను ద్విచక్ర వాహనాల దొంగతనాలకు సంబంధించి ఏదైనా కేసులో ఉన్నాడా  వంటి విషయాలపై దర్యాప్తు జరుపుతున్నారు. ఈ విషయమై తాండూరు పట్టణ సీఐ సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ చోరికి గురైన ద్విచక్ర వాహనం విషయంలో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నది వాస్తవమే అని తెలిపారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని