logo

పుడమికి బలం.. జగతికి జీవాధారం

తాగునీటి ఎద్దడి నివారణకు, భూగర్భ జలాల పెంపుదలకు ‘ఇంకుడు గుంతలకు’ మించిన చక్కటి మార్గం మరొకటి లేదు.

Published : 29 Apr 2024 04:29 IST

ఇంకుడుగుంతల నిర్మాణం అత్యవసరం  

పొలంలో తవ్విన ఇంకుడుగుంతలో నిలిచిన నీరు

న్యూస్‌టుడే, తాండూరు, పరిగి: తాగునీటి ఎద్దడి నివారణకు, భూగర్భ జలాల పెంపుదలకు ‘ఇంకుడు గుంతలకు’ మించిన చక్కటి మార్గం మరొకటి లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నేళ్ల క్రితం వరకు వీటి తవ్వకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించాయి. కరవు పరిస్థితులను అధిగమించేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతానికి ప్రధానంగా మున్సిపాలిటీల్లో ప్రజలు సైతం చొరవ చూపారు. తరువాత దీనిపై అటు ప్రభుత్వం ఇటు ప్రజలు ఆసక్తి చూపక పోవడంతో ఉన్నవన్నీ పూడుకుపోయి ఆనవాళ్లే కానరాకుండా పోయాయి. ప్రస్తుతం ఎండలు భరించలేని స్థితిలో ఉన్నాయి. చెరువులు, కుంటలు అడుగంటి పోతున్నాయి. ఇలాంటి తరుణంలో మళ్లీ కరవు పరిస్థితులు తలెత్తకుండా పట్టణాల్లో అందరూ ‘ఇంకుడు గుంతల’ తవ్వకానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో వీటి అవసరం, గత పరిస్థితులపై ‘న్యూస్‌టుడే’ కథనం.

నిబంధనల అమలు ఎక్కడ..

జిల్లాలో పరిగి, తాండూరు, కొడంగల్‌, వికారాబాద్‌ మున్సిపాలిటీలున్నాయి. వీటిలో కొత్తగా భవనాల నిర్మాణాలు చేసే వారు ఇంకుడు గుంతను విధిగా నిర్మించుకోవాలనే నిబంధన ఉంది. అధికారులు మాత్రం ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చి చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో పారుతున్న వరద వృథాగా పోతుంది. దీనికి తోడు గృహాల్లో వివిధ అవసరాలకు వినియోగించిన నీరు కూడా కాలువల ద్వారా వెళ్లి పోతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో గతంలో నిర్మించిన ఇంకుడు గుంతల నిర్వహణ సవ్యంగా లేక భూమికి సమాంతరంగా మారి పోయాయి.

2019లోనే లక్ష్య నిర్దేశం

నిర్ణీత పరిమాణాల్లో తవ్విన గుంతల్లో కంకర, ఇసుక, గులకరాళ్లను పొరలుగా పోస్తారు. వీటిలోకి వచ్చిన వరద నీరు, వృథా నీరు భూమిలోకి ఇంకి పోయి జల మట్టం పెరుగుతుంది. ఈ అంచనాతో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి 2019-20 ఆర్థిక సంవత్సరంలో 2,560 ఇంకుడు గుంతలు నిర్మించాలనే లక్ష్యాన్ని మున్సిపాలిటీలు పెట్టుకున్నాయి. ఒక్కో ఇంకుడు నిర్మాణ స్థితిని బట్టి రూ.6వేల నుంచి రూ.8వేల వరకు చెల్లించేందుకు నిర్ణయించింది. అయితే ఈ విషయంలో అవగాహన కల్పించక పోవడంతో నిర్ణీత లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదు.

  • ఒక్కో మున్సిపాలిటీలో ఇవి పరిమిత సంఖ్యలోనే పూర్తవడం విశేషం.

ప్రత్యేక శిలాఫలకం ఆవిష్కరించినా..

తాండూరులో ఇంకుడు గుంతల నిర్మాణానికి 2017లో అప్పటి ప్రభుత్వం రూ.4లక్షలను మంజూరు చేసింది. అదే ఏడాది జనవరి 30న అప్పట్లో రవాణా శాఖ మంత్రిగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ నిధుల ఆధారంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ఆవరణల్లో దాదాపు 67 ఇంకుడు గుంతలను నిర్మించాల్సి ఉండగా పట్టించుకోలేదు. నిధులు వెనక్కి వెళ్లి పోయాయి. శిలాఫలకం మాత్రం వెక్కిరిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని