logo

బెట్టింగ్‌ భూతం.. దా‘రుణాలు’ అనంతం

బెట్టింగ్‌ వ్యసనం ప్రాణాలు తీస్తోంది. అప్పులపాలై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇంకొందరు బరితెగించి చోరీలు, హత్యలు చేస్తున్నారు.

Updated : 29 Apr 2024 07:07 IST

ఆశతో మొదలై ఆత్మహత్యల వరకు..
యువత నేరాల బాట.. జీవితం పతనం

ఈనాడు- హైదరాబాద్‌: బెట్టింగ్‌ వ్యసనం ప్రాణాలు తీస్తోంది. అప్పులపాలై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇంకొందరు బరితెగించి చోరీలు, హత్యలు చేస్తున్నారు. స్నేహితులతో కలిసి రూ.వందలతో మొదలయ్యే పందేలు.. రూ.లక్షల వరకూ వెళుతున్నాయి. పెట్టిన సొమ్ముకు రెట్టింపు సొమ్ము వస్తుందనే ఆశతో అడ్డగోలుగా అప్పులు చేస్తూ నేరాల బాట పడుతున్నారు. బెట్టింగ్‌ మోజులో కన్నబిడ్డలు చేసిన అప్పులు కట్టలేక కొన్ని కుటుంబాలు ఆర్థికంగా నలిగిపోతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో బెట్టింగ్‌కు అలవాటుపడి ఇంజినీరింగ్‌ విద్యార్థి అప్పుల బాధలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.25లక్షల అప్పు చేసి ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో పందెం కాశాడు. ఈ ఒత్తిడి తట్టుకోలేక చివరికి ఉరేసుకున్నాడు.

ఆన్‌లైన్‌ యాప్‌లతో చేటు

బెట్టింగ్‌ ఒకప్పుడు ఖరీదైన వ్యవహారంగా, గుట్టుగా నడిచేది. ఆన్‌లైన్‌ యాప్‌లు, వెబ్‌సైట్లు అందుబాటులోకి వచ్చాక స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ పందెం కాసేలా పరిస్థితులు మారాయి. ప్రారంభంలో స్వల్ప పెట్టుబడికి రూ.వందలు, రూ.వేలు లాభాలు రావడంతో ఆశపడుతున్న కొందరు రూ.లక్షల్లో పందెం కాస్తున్నారు. ఈ క్రమంలో అప్పులు చేస్తున్నారు. చివరికి వాటిని తీర్చలేక మానసిక ఒత్తిడికి గురై క్షణికావేశంలో దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. బెట్టింగ్‌ గ్యాంగ్‌లు డబ్బు ఇవ్వకపోతే సెక్స్‌టార్షన్‌, బ్లాక్‌ మెయిల్‌కు దిగుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక కొందరు నేరాల బాట పట్టడం లేదా ఆత్మహత్యకు యత్నిస్తున్నారు.
రూ.10 వేలకు యాప్‌లు: పోలీసులు బెట్టింగ్‌ యాప్‌లు, వెబ్‌సైట్లను గుర్తించి వాటిని పనిచేయకుండా చేస్తున్నా.. కొత్త పేర్లతో మళ్లీ వస్తున్నాయి. రూ.10 వేలిస్తే కొత్త యాప్‌లు తయారుచేసిచ్చే సాంకేతికత అందుబాటులోకి రావడం గమనార్హం.
పంటర్లపైనా కేసులు: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఆర్గనైజర్లు, బుకీలతో పాటు పందెం కాసే పంటర్లపైనా కేసుల నమోదుకు నిర్ణయించారు. ఇటీవల సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఐదు ముఠాలకు చెందిన 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి సమాచారం ఆధారంగా సుమారు 581 పంటర్లు ఈ గ్యాంగ్‌ల వెబ్‌సైట్లు, యాప్‌లతో పందెం కాస్తున్నట్లు గుర్తించారు.


ఇవీ ఉదాహరణలు..

  • బెట్టింగ్‌కు అలవాటుపడిన రత్నకిశోర్‌ లోన్‌ యాప్‌లో రుణం తీసుకుని పందెం కాసేవాడు. గతేడాది ప్రపంచకప్‌ సందర్భంగా భారీగా డబ్బు పోగొట్టుకున్నాడు. డ్రైవరుగా పనిచేస్తున్న అతడు.. తన యజమాని తల్లి ఒంటిపై బంగారు ఆభరణాలు కొట్టేశాడు.  చివరికి ఆదిభట్ల పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
  • గత నెలలో కేపీహెచ్‌బీ పోలీసులు ఓ దొంగను అరెస్టుచేశారు. చోరీలు ఎందుకు చేస్తున్నావని పోలీసులు ప్రశ్నించగా బెట్టింగ్‌కు రూ.లక్షల కోసం చేస్తున్నట్లు చెప్పాడు.
  • కీసర పోలీసులకు ఇటీవల బైకుల దొంగ దొరికాడు. విచారణలో.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, జల్సాలకు అలవాటుపడి డబ్బు కోసం చేస్తున్నట్లు అంగీకరించాడు.

గుర్తించండి ఇలా..

  • ఖర్చుల కోసం రూ.వందలు అడిగేవారు అకస్మాత్తుగా రూ.వేలు కావాలని తల్లిదండ్రుల్ని వేధిస్తారు.
  • ఎక్కువ మొత్తంలో డబ్బెందుకని కారణాలడిగితే చెప్పరు. గట్టిగా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతారు.
  • డబ్బు కోసం తల్లిదండ్రుల్ని అడగలేక ద్విచక్ర వాహనాలు, మెడలోని చైన్లు కుదువ పెడతారు.
  • బెట్టింగ్‌కు అలవాటుపడ్డవారు క్రికెట్‌ మ్యాచ్‌లప్పుడు ఇంట్లో కాకుండా ఏకాంతంగా ఇతర ప్రాంతాల్లో ఉండేందుకు ఇష్టపడతారు.
  • మ్యాచ్‌ జరిగేప్పుడు విపరీతంగా ఫోన్లు మాట్లాడుతుంటారు. అనవసరమైన అప్పులు చేస్తుంటారు.
  • కొన్నిసార్లు వాళ్ల స్థోమతకు మించిన వస్తువులు కొనుగోలు చేస్తే కచ్చితంగా అనుమానించాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని