logo

ప్లాట్ల అభివృద్ధి పేరుతో మోసం

ఫోర్జరీ, నకిలీ పత్రాలతో రియల్టర్‌ను మోసగించి రూ.3.13 కోట్లు వసూలు చేసిన ముగ్గురిని సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 30 Apr 2024 05:59 IST

నకిలీ పత్రాలతో రియల్టర్‌ నుంచి రూ.3.13 కోట్లు వసూలు

ఈనాడు, హైదరాబాద్‌: ఫోర్జరీ, నకిలీ పత్రాలతో రియల్టర్‌ను మోసగించి రూ.3.13 కోట్లు వసూలు చేసిన ముగ్గురిని సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. నార్సింగి పరిధిలో 30 ప్లాట్లను అభివృద్ధి చేయిస్తామని చెప్పి రియల్టర్‌ నుంచి ఈ సొమ్ము వసూలు చేసిన వీరిని రిమాండ్‌కు  తరలించినట్లు సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రంగారెడ్డి జిల్లా గండిపేట నెక్నాంపూర్‌ గ్రామానికి చెందిన చిలకల శ్రీనివాసరావు(45) సూర్య డెవలపర్స్‌ పేరుతో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. శ్రీనివాసరావును మోసగించాలని గండిపేటకు చెందిన పత్తి శ్రీకాంతరావు(54), పత్తి ప్రేమలత(38) దంపతులు, దర్శనం శివరాజ్‌(45) పథకం వేశారు. నార్సింగిలోని 298 సర్వే నంబరులో 30 ప్లాట్ల అభివృద్ధికి డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌తో పాటు జీపీఏ చేయిస్తామని నమ్మించారు. వాస్తవానికి ఈ సర్వే నంబరులో భూమిని 1982లో పౌల్ట్రీ ఫాంల ఏర్పాటుకు కేటాయించారు. దీన్నే రిజిస్టర్‌ చేయిస్తామంటూ ఈ ముగ్గురూ శ్రీనివాసరావును నమ్మించి రూ.3.13 కోట్లు వసూలు చేశారు. ముందు చెప్పినట్లు వారు డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌, జీపీఏ చేయించలేకపోయారు. శ్రీనివాసరావు తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా శ్రీకాంతరావు రెండు చెక్కులిచ్చారు. వీటిని డ్రా చేయడానికి బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో డబ్బులు లేకపోవడంతో నార్సింగి ఠాణాలో ఫిర్యాదు చేశారు. మోసపోయిన సొమ్ము రూ.75 లక్షలకు మించి ఉండటంతో ఈ కేసును సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ ఠాణాకు బదిలీ చేశారు. శ్రీకాంతరావు, ప్రేమలత, శివరాజ్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు