logo

ఇక సమరమే..!

చేవెళ్ల లోక్‌సభ ఎన్నికలకు బరిలో దిగే అభ్యర్థుల  లెక్క తేలింది. సోమవారం ఉపసంహరణల అంకం ముగియడంతో ఇక ప్రచారం హోరెత్తించేందుకు వారంతా వ్యూహాలకు పదునెక్కించే పనిలో పడ్డారు.

Updated : 30 Apr 2024 05:56 IST

తేలిన అభ్యర్థుల లెక్క
న్యూస్‌టుడే, తాండూరు

చేవెళ్ల లోక్‌సభ ఎన్నికలకు బరిలో దిగే అభ్యర్థుల  లెక్క తేలింది. సోమవారం ఉపసంహరణల అంకం ముగియడంతో ఇక ప్రచారం హోరెత్తించేందుకు వారంతా వ్యూహాలకు పదునెక్కించే పనిలో పడ్డారు.

జిల్లా నుంచి 3 నియోజక వర్గాలు: చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాలుండగా జిల్లాలోని తాండూరు, వికారాబాద్‌, పరిగి శాసన సభ నియోజకవర్గాలు వస్తాయి.(మిగతా వాటిలో శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, చేవెళ్ల ఉన్నాయి). వీటిలో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, భారాస నుంచి మాజీ ఎమ్మెల్యేలకు తోడు నేతలున్నారు. భాజపాకు ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు లేక పోవడంతో కొంత కాలం నుంచి కింది స్థాయి కేడర్‌ను అప్రమత్తం చేస్తూ వస్తోంది. తరచూ సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేసింది. అభ్యర్థులు ఇప్పటికే అడపా దడపా గ్రామాలకు వెళ్లి ఓటర్లను కలిశారు. తాజాగా ముఖ్య నాయకులు, అభ్యర్థులు గ్రామాలకు వెళ్లి తేదీలను ఖరారు చేసుకుంటున్నారు.

రంజిత్‌ రెడ్డి (కాంగ్రెస్‌), కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (భాజపా), కాసాని జ్ఞానేశ్వర్‌ (భారాస)

మెజారిటీ ఓట్లపై దృష్టి సారించారు

పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు మెజారిటీ ఓట్లపై దృష్టి సారించారు. ఇందుకోసం అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఓ ప్రధాన పార్టీ అల్ప సంఖ్యాకుల ఓట్లన్నీ తమకే పడేలా మంత్రాంగం నెరుపుతోంది. ఇంకో పార్టీ యువ ఓటర్లకు తోడు వారి కుటుంబ సభ్యుల ఓట్లపై గురి పెట్టింది. మరో ప్రధాన పార్టీ జిల్లాలో ఎక్కువగా ఉన్న సామాజిక వర్గం ఓట్లు తమకే వస్తాయనే దీమాతో ఉంది.


ప్రధాన పోటీ ఆ ముగ్గురి మధ్యే..

కాంగ్రెస్‌ నుంచి రంజిత్‌రెడ్డి, భాజపా నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, భారాస నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ ప్రధాన పార్టీల అభ్యర్థులుగా నిలిచారు. స్వతంత్రులుగా మరి కొందరు పోటీ చేస్తున్నారు.


సీఎం, పీఎంలతో బహిరంగ సభలకు ప్రణాళిక

ఎన్నికల్లో అగ్రనేతలను రప్పించి భారీ బహిరంగ సభలను నిర్వహించేందుకు అభ్యర్థులు ప్రణాళికను రూపొందిస్తున్నారు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్‌, పరిగిలో ఎక్కడ సభలు నిర్వహిస్తారనే విషయం ఇంకా ఖరారు కాలేదు.

  • భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ రానున్నారని నాయకులు ప్రచారం చేస్తున్నారు.
  • కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి విజయాన్ని కోరుతూ వికారాబాద్‌ లేదా తాండూరులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో బహిరంగ సభ ఏర్పాటుచేసే అవకాశం ఉంది.  
  • భారాస అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బస్సు యాత్రలో భాగంగా జిల్లాలో పర్యటించ బోతున్నారు. ఇందుకు సంబంధించి తేదీ, సమయం ఖరారు కావాల్సి ఉంది

నేతలతో ఫోన్లలో మంతనాలు

జిల్లాలో పట్టున్న నేతలతో ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున ముఖ్య నాయకులు ఫోన్లలో అంతర్గతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. తమ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. అనుబంధ పార్టీల నాయకులతో కూడా మంతనాలు చేపడుతూ మద్దతు కూడగట్టేందుకు యత్నిస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని