logo

మల్కాజిగిరి ఎంపీగా రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదు

రేవంత్‌రెడ్డిని ఎంపీగా చేసింది, టీపీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది, చివరికి ముఖ్యమంత్రిని చేసింది సైతం మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలే అనీ.. అలాంటి నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని మాజీమంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.

Updated : 30 Apr 2024 05:55 IST

సమావేశంలో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌

కార్ఖానా, కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: రేవంత్‌రెడ్డిని ఎంపీగా చేసింది, టీపీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది, చివరికి ముఖ్యమంత్రిని చేసింది సైతం మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలే అనీ.. అలాంటి నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని మాజీమంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ సోషల్‌ మీడియా వారియర్స్‌ సమావేశం మల్లారెడ్డి గార్డెన్‌లో సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్‌ మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో భారాస కొంత వెనుకబడి ఉన్న కారణంగానే.. గత ఎన్నికల్లో 1.8 శాతం ఓట్ల తేడాతో రాష్ట్రంలో ఓటమి పాలైందన్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల ముందు చేసిన అసత్య ప్రచారాన్ని నమ్మి ప్రజలు వారికి అవకాశం కల్పించారన్నారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ భాజపాలు ఒకటై తమను దెబ్బతీశాయని, ఈసారి ఆ రెండు పార్టీల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, కేంద్రంలో భాజపా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి కార్యకర్త సోషల్‌ మీడియాలో పొందుపరచాలన్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వం దాదాపు 36 ఫ్లైఓవర్లను నిర్మించగా.. కేంద్ర ప్రభుత్వం రెండు ఫ్లైఓవర్లను నిర్మించడానికి ఆపసోపాలు పడుతోందన్నారు. రానున్న రోజుల్లో కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసే బాధ్యత తాను తీసుకుంటానని మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, దయానంద్‌, ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, ఇతర నేతలు పాల్గొన్నారు.


కేటీఆర్‌ను సీఎం చేసే వరకు విశ్రమించను: మల్లారెడ్డి

మల్లారెడ్డి ఏం మాట్లాడినా సోషల్‌ మీడియాలో సంచలనమే అని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవారం కంటోన్మెంట్‌ బోయినపల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్‌లో మల్కాజిగిరి యువత, సోషల్‌మీడియా వారియర్స్‌ సమావేశం నిర్వహించారు. దీనిలో కేటీఆర్‌ మాట్లాడుతూ పాలమ్మిన.. పూలమ్మిన డైలాగ్‌తో రాష్ట్రవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో మల్లారెడ్డి పేరు మార్మోగిందన్నారు. రానున్న రోజుల్లో సోషల్‌ మీడియాది కీలకపాత్ర అని, దీన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఎనిమిది స్థానాలు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని, ఆయనను ముఖ్యమంత్రిని చేసేవరకు తాను విశ్రమించేది లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని