logo

ఈత కొలనులో అవినీతి మేత

ప్రజాధనాన్ని ప్రణాళికాబద్ధంగా దోచేయడంలో జీహెచ్‌ఎంసీలోని కొందరు అధికారులు సిద్ధహస్తులు. ఒకే ప్రణాళికను కొన్నేళ్లుగా అమలు చేస్తూ.. ఏటా రూ.3 కోట్లకు పైగా నిధులను దోచేస్తున్నారు.

Published : 30 Apr 2024 02:47 IST

ఏటా సుమారు రూ.3 కోట్ల నిధులు పక్కదారి

మొదటి చిత్రంలోని ఈతకొలను సికింద్రాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కిడ్స్‌ పూల్‌. ఈత కోసం సిద్ధం చేయకపోవడంతో పెద్దల కోసం ఏర్పాటు చేసిన స్విమ్మింగ్‌ పూల్‌లోనే చిన్నారులు సాధన చేయాల్సి వస్తోంది. రెండోది ఆ చిత్రమే.

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజాధనాన్ని ప్రణాళికాబద్ధంగా దోచేయడంలో జీహెచ్‌ఎంసీలోని కొందరు అధికారులు సిద్ధహస్తులు. ఒకే ప్రణాళికను కొన్నేళ్లుగా అమలు చేస్తూ.. ఏటా రూ.3 కోట్లకు పైగా నిధులను దోచేస్తున్నారు. బల్దియా క్రీడల విభాగంలోని కొందరు గేమ్‌ ఇన్‌స్పెక్టర్లు, కొందరు కార్యనిర్వాహక ఇంజినీర్ల ఆధ్వర్యంలో ఈ దోపిడీ జరుగుతోంది. నగరంలోని ఈత కొలనుల నిర్వహణ పనులకు టెండర్లు పిలుస్తున్నామని, గుత్తేదారులు ముందుకు రావట్లేదని నాలుగు నెలలపాటు తాత్సారం చేయడం, ప్రారంభోత్సవం జరిగాక.. పనులు పూర్తయినట్లు బిల్లులు తీసుకోవడం అధికారులకు పరిపాటిగా మారింది.

వ్యూహాత్మకంగా అడుగులు..

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ప్రస్తుతం 13 స్విమ్మింగ్‌పూల్స్‌ నడుస్తున్నాయి. గ్రేటర్‌లో ఆరు జోన్లు ఉండగా, జోన్లవారీగా గేమ్‌ ఇన్‌స్పెక్టర్లు వాటికి బాధ్యులుగా ఉంటారు. ఏడాదిలో డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో చలి ఎక్కువగా ఉంటుందని, ఆ మూడు నెలలపాటు ఈత కొలనులను జీహెచ్‌ఎంసీ మూసేస్తుంది. అదే సమయంలో అవసరమైన మరమ్మతులను పూర్తి చేసుకోవాలని కేంద్ర కార్యాలయం అధికారులను ఆదేశిస్తుంది. ఇదే అదనుగా కొందరు గేమ్‌ ఇన్‌స్పెక్టర్లు, కార్యనిర్వాహక ఇంజినీర్లు, బినామీ గుత్తేదారు ఒక్కటవుతున్నారు. మరమ్మతుల కోసం రెండు, మూడు వారాలకోసారి ఇంజినీర్లు టెండరు నోటిఫికేషన్‌ ఇస్తుంటారు. ప్రభుత్వ, జీహెచ్‌ఎంసీ టెండరు వెబ్‌సైట్‌లో ప్రకటనను మధ్యాహ్నం అప్‌లోడ్‌ చేసి, సాయంత్రానికి తొలగిస్తారు. తిరిగే గుత్తేదారులెవరూ ముందుకు రావడం లేదని నాటకానికి తెర తీస్తారు. ఇలా నాలుగు నెలల పాటు గడిపేస్తారు. మార్చిలో ప్రారంభం కావాల్సిన ఈత కొలనులు ఏప్రిల్‌ వచ్చినా తెరచుకోవు. కేంద్ర కార్యాలయం ఒత్తిడి చేస్తోందంటూ చివరి నిమిషంలో గుత్తేదారులకు పని అప్పగిస్తారు. పని మాత్రం జరగదు. హడావుడిగా ఈత కొలనులో నీరు నింపేసి సేవలు ప్రారంభిస్తారు. మరమ్మతుల బిల్లులు ఆమోదింపజేసుకుంటారు. ఈ తంతు కొన్నేళ్లుగా సాగుతోంది.

ఈతకొలను ప్రాంగణంలో ప్రమాదకరంగా విద్యుత్తు వైర్లు


బిల్లులు ఆపేయాలని ఆదేశాలు

ఈత కొలనుల ప్రారంభోత్సవం రోజున ఓ వ్యక్తికి గేమ్‌ ఇన్‌స్పెక్టర్లతో వాగ్వాదం జరిగింది. మరమ్మతులు చేపట్టకుండా ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులను విచారించడంతో ఇదంతా ఎప్పుడూ జరుగుతున్నదేనని, ఏడాదికోసారి రూ.25లక్షల బిల్లులు పెట్టుకుని ఇంజినీర్లు, గుత్తేదారు, క్రీడల విభాగంలోని కొందరు అధికారులు పంచుకుంటారని తేలింది. ఈ ఏడాదీ రూ.3.25 కోట్ల బిల్లులు రూపొందించారని వెల్లడైంది. వెంటనే కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ స్పందించి బిల్లులను ఆపేయాలని ఇంజినీర్లను హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని