logo

ఓయూలో నీటి సెగలు.. విద్యుత్తు వెతలు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నీటికొరత సెగలు.. విద్యుత్తు కోతల వెతలతో సోమవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

Updated : 30 Apr 2024 05:51 IST

మే 1 నుంచి హాస్టళ్ల మూత అంటూ చీఫ్‌ వార్డెన్‌ లేఖ వైరల్‌
వార్డెన్‌కు సర్కారు షోకాజు నోటీసు

శనివారం రాత్రి ఓయూ రోడ్డులో నిరసన తెలిపిన విద్యార్థినులు

ఈనాడు, హైదరాబాద్‌, లాలాపేట, న్యూస్‌టుడే: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నీటికొరత సెగలు.. విద్యుత్తు కోతల వెతలతో సోమవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. నీరు, విద్యుత్తు కొరత కారణంగా మే 1 నుంచి విద్యార్థుల వసతి గృహాలను మూసేస్తామంటూ చీఫ్‌ వార్డెన్‌ కొమరెల్లి శ్రీనివాస్‌ గతంలో జారీ చేసిన ఉత్తర్వు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వార్డెన్‌ ఉత్తర్వును ఎక్స్‌లో పోస్ట్‌ చేయడంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. ఒకవైపు విద్యార్థులు, మరోవైపు భారాస నేతలు ఈ ఉత్తర్వులపై మండిపడ్డారు. వసతి గృహాలను మూసేస్తే ఆందోళన చేపడతామని విద్యార్థి సంఘాల ప్రతినిధులు నెల్లి సత్య, జీవన్‌లు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.  ్టదీనిపై ప్రభుత్వం సత్వరమే స్పందించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హుటాహుటిన రంగంలో దిగిన విద్యుత్తు శాఖ, జలమండలి ఇంజినీర్లు ఓయూలో పరిస్థితిని పరిశీలించారు. ఓయూ అంతర్గత సమస్య అని తేల్చారు. నీటికొరత, కరెంట్‌ సమస్య లేదని ప్రభుత్వానికి తెలిపారు. తప్పుడు ప్రకటన ఇచ్చిన చీఫ్‌ వార్డెన్‌కు షోకాజు నోటీసు ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. విద్యార్థులు సెలవుల్లోనూ ఇక్కడే ఉండి చదువుకోవచ్చని ప్రకటించారు.

నీళ్లు లేవ్‌.. కరెంట్‌ కట్‌  

మహిళా హాస్టల్లో నీటి సమస్యపై సోమవారం నిరసన చేపట్టామని ఏఐఎఫ్‌ఎస్‌ కార్యదర్శి నెల్లి సత్య తెలిపారు.  ఓయూలో కరెంట్‌ కొరత, నీళ్ల కొరత ఉందని హాస్టళ్ల నుంచి విద్యార్థులను ఖాళీ చేసిన చరిత్ర గతంలో లేదని, కాంగ్రెస్‌ పాలనలో చూస్తున్నామని మాజీ మంత్రి, భారాస నేత హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో కరెంట్‌ కోతలే లేవని దబాయించిన సీఎం ఓయూలో పరిస్థితులకు ఏం సమాధానం చెబుతారని అన్నారు.


అదనంగా తాగునీటి సరఫరా
సుదర్శన్‌ రెడ్డి, జలమండలి ఎండీ

ఓయూకు ఒప్పందం చేసుకున్న దానికంటే అదనంగా జలమండలి నీటిని సరఫరా చేస్తోంది. అక్కడి అంతర్గత పైపులైన్ల నిర్వహణ వారి చేతుల్లోనే ఉంటుంది. నీటికొరతకు జలమండలికి సంబంధం లేదు. ఓయూ అభ్యర్థన మేరకు నీటి సరఫరా పెంచేందుకు సిద్ధంగా ఉన్నాం.


కరెంట్‌ కోత లేనేలేదు
రవి కుమార్‌, ఎస్‌ఈ, సికింద్రాబాద్‌ సర్కిల్‌

క్యాంపస్‌కు ఓయూ 33 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం నుంచి ప్రత్యేకంగా రెండు 11 కేవీ ఫీడర్ల ద్వారా విద్యుత్తు సరఫరా చేస్తున్నాం. ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్‌ మీటర్ల రికార్డులు పరిశీలించగా సరఫరాలో అంతరాయం ఏర్పడలేదు. క్యాంపస్‌కు నిరంతరాయ కరెంట్‌ సరఫరా అందుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని