logo

గెలిపించాల్సిందే.. గులాబీ వికసించాల్సిందే

లోక్‌సభ ఎన్నికలు ప్రతిపక్ష భారాస ఎమ్మెల్యేలకు కత్తిమీద సాములా మారాయి. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో వారికి వచ్చిన ఓట్ల కంటే అధికంగా వచ్చేలా చూడాలంటూ భారాస అధినేత కేసీఆర్‌ ఆయా ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు.

Updated : 30 Apr 2024 05:48 IST

భారాస ఎమ్మెల్యేలపై అధిష్ఠానం ఒత్తిడి
బాధ్యతల భారంతో సతమతం

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: లోక్‌సభ ఎన్నికలు ప్రతిపక్ష భారాస ఎమ్మెల్యేలకు కత్తిమీద సాములా మారాయి. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో వారికి వచ్చిన ఓట్ల కంటే అధికంగా వచ్చేలా చూడాలంటూ భారాస అధినేత కేసీఆర్‌ ఆయా ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నగర పరిధిలోని గులాబీ ఎమ్మెల్యేలు ఇప్పటికే కొందరు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి రావడంతో వారి తీరుపై అనుమానంతో ఉన్నట్లు తెలిసింది. దీంతో వారి సొంత నియోజకవర్గాల్లో అధిక ఓట్లు పడేలా కష్టపడాల్సి వస్తోందని ఓ ఎమ్మెల్యే ‘ఈనాడు’కు తెలిపారు. అనుమానాలు తొలగాలంటే ఎంపీ అభ్యర్థుల విజయం కోసం పని చేయాల్సిందేనని చెబుతున్నారు.

మెజారిటీ ఎమ్మెల్యేలున్నా..

రాజధాని పరిధిలోకి వచ్చే నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో భారాసకు 17 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇందులో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేస్తున్నారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకుని.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. మరికొందరు కూడా హస్తం గూటికి చేరుతారనే ప్రచారం జరిగింది. దీంతో అప్రమత్తమైన భారాస అగ్రనేతలు సంబంధిత ఎమ్మెల్యేలతో మాట్లాడి పార్టీ వీడకుండా నిరోధించారు. వారితో కేసీఆర్‌ స్వయంగా మాట్లాడారు. మల్కాజిగిరి పరిధిలో ఏడుగురు, చేవెళ్లలో నలుగురు, సికింద్రాబాద్‌ పరిధిలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.


బలహీనపరుస్తూ.. బలం పెంచుకుంటూ..

మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కాంగ్రెస్‌ పార్టీ దృష్టిపెట్టి అనేకమంది నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆయనకు దూరం చేసింది. గత ఎన్నికల్లో జవహర్‌నగర్‌, బోడుప్పల్‌, ఫిర్జాదిగూడ నగరపాలక సంస్థల పాలకవర్గాలు మల్లారెడ్డికి అండగా ఉన్నాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో జవహర్‌నగర్‌ పాలకవర్గం గులాబీ గూటిని వీడింది. మిగిలిన రెండు నగరపాలక సంస్థల్లోనూ సగంమంది కార్పొరేటర్లు హస్తం కండువా కప్పుకున్నారు. మిగిలిన వారూ రేపోమాపో అన్నట్లుగా ఉంది. ఇదే నియోజకవర్గం పరిధిలోని ఘట్‌కేసర్‌, పోచారం, నాగారం, గుండ్లపోచంపల్లి, దమ్మాయిగూడ, మేడ్చల్‌, కొంపల్లి పురపాలక సంఘాలున్నాయి. ఇప్పటికే ఘట్‌కేసర్‌ ఛైర్మన్‌, గుండ్లపోచంపల్లిలో 13 మంది కౌన్సిలర్లు, కొంపల్లిలో సగం మంది కాంగ్రెస్‌లోకి వెళ్లారు. మిగిలిన చోట్ల ఆ పార్టీ నాయకులు మంతనాలు చేస్తున్నారు. ఇదే తరహాలో మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ భారాస ప్రజాప్రతినిధులను, స్థానిక నేతలను చేర్చుకున్నారు. ఎల్బీనగర్‌లో కీలక నేతలు కారు దిగారు. ఈ సమస్యలన్నింటినీ అధిగమించి భారాస ఎమ్మెల్యే పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సిన అవసరం ఏర్పడింది. మొన్నటివరకు పెద్దగా ప్రచారంలో కనిపించని ఎమ్మెల్యేలు.. అధినేత ఆదేశాలతో రంగంలోకి దిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు