logo

స్వతంత్రులు నామమాత్రమేనా..?

ప్రతి ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థులు కనీస ప్రభావం చూపలేక పోతున్నారు. అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్‌ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నా కొందరికి నోటాకు వచ్చిన ఓట్లు కూడా రావడం లేదు.

Published : 03 May 2024 03:48 IST

పెద్ద సంఖ్యలో బరిలో దిగినా ఓట్లు తక్కువే
ప్రజా సమస్యలపై గళమెత్తేందుకేనంటున్న అభ్యర్థులు
పార్టీ ఎత్తుగడలతోనే కొందరు పోటీ
ఈనాడు, హైదరాబాద్‌

ప్రతి ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థులు కనీస ప్రభావం చూపలేక పోతున్నారు. అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్‌ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నా కొందరికి నోటాకు వచ్చిన ఓట్లు కూడా రావడం లేదు. ఎక్కువ మంది డిపాజిట్లు కోల్పోతున్నారు. ఈసారి కూడా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి నియోజవర్గాల పరిధిలో పెద్ద సంఖ్యలో స్వతంత్రులు పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్‌లో 45 మంది, మల్కాజిగిరిలో 22 మంది, చేవెళ్లలో 43 మంది, హైదరాబాద్‌లో 30 మంది పోటీలో ఉండగా..ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు ఎక్కువ మంది బరిలో నిలిచారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల పరిధిలో 78 మంది పోటీ చేయగా వీరిలో 38 మంది స్వతంత్రులు కావడం విశేషం. ప్రధాన పార్టీల నుంచి టిక్కెట్లు రాని వారు స్వతంత్రులుగా నామినేషన్లు వేస్తున్నా చివరకు పార్టీల బుజ్జగింపులతో పోటీ నుంచి తప్పుకుంటున్నారు. చివరి నిమిషంలో నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు పోటీలో ఉంటున్న మరికొందరు ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీంతో వారు రెండు వేలలోపు ఓట్లకే పరిమితం అవుతున్నారు. ప్రధాన పార్టీల ఎత్తుగడల్లో భాగంగా..ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య నువ్వా..?నేనా..? అన్నట్లు పోటీ ఉన్న దశలో ఆయా పార్టీలు రకరకాల వ్యుహాలు పన్నుతూ స్వతంత్రులను పోటీ చేయిస్తున్నాయి. అవతల పార్టీల అభ్యర్థుల సామాజిక వర్గం ఓట్లు చీలిపోయేలా చేసి తమ గెలుపు సులువయ్యేలా ప్రయత్నిస్తున్నాయి. కొన్నిసార్లు ప్రధాన పార్టీలకు చెందిన గుర్తులకు దగ్గరగా పోలిన గుర్తులను ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. దీంతో నిరక్షరాస్యులు, వృద్ధులు కొంత అయోమయానికి గురై సంబంధిత పార్టీకి కాకుండా స్వతంత్రులకు కేటాయించిన గుర్తుకు ఓటు వేస్తుంటారు. దీంతో అవతవల పార్టీ అభ్యర్థి గెలుపునకు ఇదో ఎత్తుగడగా వ్యహాత్మకంగా స్వతంత్రులను బరిలో నిలుపుతున్నారు. గతంలోనూ ఇలాంటి వ్యుహాం వల్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓడిపోయిన ఉదంతాలున్నాయి.

పెరిగిన ఖర్చులు తట్టుకోలేక..

కొందరు స్వతంత్రులుగా బరిలో నిలిచినా ప్రధాన పార్టీల అభ్యర్థులతో పోటీపడేంత వనరులు సమకూర్చోవడం కష్టమవుతోంది. ఎంపీగా పోటీ చేయాలంటే రూ.కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ తరుణంలో సాధారణ వ్యక్తులు స్వతంత్రులుగా పోటీ చేసి తట్టుకోవడం కష్టంగా మారుతోంది. క్షేత్రస్థాయిలో సమస్యల పట్ల అవగాహన, ప్రజలతో మమేకమవడం..పక్కా ప్రణాళికతో స్వతంత్రులుగా పోటీ చేసి  గెలుపొంది తమదైన ముద్రవేసిన నేతలూ గతంలో ఎంతోమంది ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని