logo

సొంతవారికే పంపకాల అప్పగింతలు

ప్రచారం తుది అంకానికి చేరుకోవడంతో అభ్యర్థులకు ‘పంపకాల’ తలనొప్పులు మొదలయ్యాయి.

Published : 11 May 2024 03:22 IST

కిందిస్థాయి నాయకుల్ని నమ్మేదేలే అంటున్న అభ్యర్థులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రచారం తుది అంకానికి చేరుకోవడంతో అభ్యర్థులకు ‘పంపకాల’ తలనొప్పులు మొదలయ్యాయి. ఆ బాధ్యతలు తమకే అప్పజెప్పాలంటూ డివిజన్‌, బూత్‌స్థాయి నాయకులు ఉదయాన్నే నేతల ఇంటి వద్ద తిష్ఠ వేస్తున్నారు. బూత్‌స్థాయి బాధ్యతలు అప్పగించాలని కొందరు.. డివిజన్‌ స్థాయి బాధ్యతలు ఇవ్వాలని మరికొందరు.. సామాజికవర్గాల వారీగా ఓట్లేయిస్తామని,  చివరిరోజు ర్యాలీలకు జనాలను తీసుకొస్తామని ఇంకొందరు వస్తుండటంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన కొన్ని నెలలకే పార్లమెంట్‌ ఎన్నికలు రావడంతో ‘ఖర్సయిపోతున్నామ’ంటూ కొందరు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కింది స్థాయి నాయకుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో వారి నుంచి తప్పించుకునేందుకు ప్రచారం ఉందంటూ ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. మరికొందరు ఇళ్లలో ఉన్నా లేరంటూ చెబుతుండటంతో కేడర్‌ నిరాశతో వెనుదిరుగుతోంది.

వాళ్లు అలా.. వీళ్లు ఇలా..

ఈ ఎన్నికల్లో అందినకాడికి సర్దేద్దామని కిందిస్థాయి నాయకులు భావిస్తుంటే ఆచితూచి అడుగేయాలని అభ్యర్థులు అనుకుంటున్నారు. ఓటేసేవారికి రూ.500, పంపిణీలో కీలకంగా ఉండే వారికి రూ.1000-2000 వరకు పంచాలనే ప్రతిపాదనలను నాయకులు అభ్యర్థుల ముందు ఉంచుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికలను విశ్లేషించుకుంటున్న నేతలు ఆ స్థాయిలో ఖర్చు అవసరమా అని వెనకడుగు వేస్తున్నారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో లక్షలాది ఓటర్లు ఉండగా.. విజయం కోసం డబ్బు  ఏ స్థాయిలో పంచాలోనని తర్జన భర్జన పడుతున్నారు. బూత్‌, డివిజన్‌ స్థాయి బాధ్యతలు అప్పగించి డబ్బు చేతిలో పెట్టాలని నాయకులు ఒత్తిడి తెస్తుంటే ‘డబ్బు ఇవ్వలేను. దేవుడిపై భారం వేశా.. అదృష్టం ఉంటే గెలుస్తా. లేదంటే లేద’ని కొందరు చేతులెత్తేస్తున్నారు. ఇంకొందరు ఎంతో కొంత చేతిలో పెట్టి ఇంతే ఇవ్వగలను..సర్దుకోవాలని బుజ్జగిస్తున్నారు.

గుర్రుగా ఉన్న ఇతర నేతలు..

ప్రచారం చివరిలో బలప్రదర్శనపై దృష్టిపెడితేనే ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంటుందనే భావన అభ్యర్థుల్లో ఉంది. ఇందుకోసం ర్యాలీలకు జనాలను తీసుకురావడంలో క్షేత్రస్థాయి నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరికి కాకుండా పంపకాల బాధ్యత వేరే వారికి అప్పగించడంపై కొన్ని పార్టీల కేడర్‌ గుర్రుగా ఉంది. అన్నిచోట్లా కిందిస్థాయి నాయకులను నమ్మే పరిస్థితి లేకపోవడం, పంపకాలపై పర్యవేక్షణ సాధ్యంకాని పరిస్థితి.. ఇచ్చిన మొత్తం ఓటర్లకు చేరుతుందో లేదో అనే అనుమానంతో అభ్యర్థులు సొంత మనుషులకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని