logo

బిల్లుల వరద!

2020, నవంబరులో వచ్చిన నివర్‌ తుపాను సహాయ పునరావాస చర్యలకు చేసిన వ్యయం రూ.56,11,222... గతేడాది నవంబరులో వచ్చిన జవద్‌ తుపాను సహాయ పునరావాస చర్యలకు అయిన ఖర్చు రూ.29,08,042. తుపాన్లు వచ్చినపుడు యుద్ధప్రాతిపదికన

Published : 27 May 2022 06:07 IST

తుపాన్ల సమయంలో సహాయక చర్యలు

ప్రజాప్రతినిధులు చెప్పిన వారికే పనులు

ఇష్టానుసారంగా చేపట్టినట్లు ఆరోపణలు

సాధారణ నిధుల నుంచి చెల్లింపులకు ఆదేశం

- న్యూస్‌టుడే, కడప నగరపాలక


బుగ్గవంక వంతెనపై పనులు చేస్తున్న జేసీబీ యంత్రం (పాత చిత్రం)

2020, నవంబరులో వచ్చిన నివర్‌ తుపాను సహాయ పునరావాస చర్యలకు చేసిన వ్యయం రూ.56,11,222... గతేడాది నవంబరులో వచ్చిన జవద్‌ తుపాను సహాయ పునరావాస చర్యలకు అయిన ఖర్చు రూ.29,08,042. తుపాన్లు వచ్చినపుడు యుద్ధప్రాతిపదికన వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సాయం అందించాలని, పునరావాస చర్యలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగం కడప నగరపాలక సంస్థను ఆదేశించింది. సహాయ చర్యలు చేపట్టిన అనంతరం ఆ పనులకు చేసిన ఖర్చులకు నగరపాలక సంస్థ ఇంజినీరింగ్‌ విభాగం లెక్కలు కట్టింది. ఈ బిల్లులను జిల్లా అధికార యంత్రాంగానికి పంపగా, తుపాన్లలో చేసిన ఖర్చును నగరపాలక సాధారణ నిధుల నుంచి చెల్లించుకోవాలని ఆదేశించారు! తుపాను సహాయ చర్యలకు చేసిన ఖర్చులు అసాధారణంగా ఉన్నందునే నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుంచి బిల్లులు చెల్లించాలని జిల్లా అధికారులు ఆదేశించినట్లు ప్రచారం సాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు చేసిన వ్యయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

వరద ప్రభావిత ప్రాంతాల్లోని నాయకులు చెప్పిన వారికి పనులు అప్పగించారని విమర్శలు వెల్లువెత్తాయి. చాలా పనులను రాజకీయ నాయకుల బంధువులు, అనుచరులకే అప్పజెప్పడం గమనార్హం. అధికారులు దిగువ స్థాయిలోని రాజకీయ నాయకులు చేతులు కలిపి పనుల బిల్లులు రూపొందించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నివర్‌, జవద్‌ తుపానుల సందర్భంగా నగరపాలక సంస్థ చేసిన ఖర్చును చెల్లించడానికి విముఖత చూపింది. వరద సహాయ చర్యలకు నిధులు కేటాయించకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఇంజినీరింగ్‌ అధికారులు- గుత్తేదారులతో వరద భారం నగర పాలక సంస్థపై పడిందని పలువురు పేర్కొంటున్నారు. అసలే అంతంత మాత్రం ఆదాయం ఉన్న నగరపాలక రూ.85 లక్షల వరద బిల్లులను ఎప్పుడు చెల్లిస్తుందన్న అంశంపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగు తున్నాయి.

రవీంద్రనగర్‌లో వీధులను శుభ్రం చేస్తున్న కార్మికులు (పాత చిత్రం)

పాలకవర్గం ఆమోదం మేరకు చర్యలు...

నివర్‌, జవద్‌ తుపాన్ల సందర్భంగా రూ.56,11,222, రూ.29,08,042 వరద సహాయ చర్యలకు నగరపాలక ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ఖర్చు చేశాం. పనుల వివరాలను ఇంజినీరింగ్‌ అధికారులు నమోదు చేశారు. ఆ వివరాల ప్రకారం నిధులు కేటాయించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరగా నగరపాలక సాధారణ నిధుల నుంచి బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. రూ.59 లక్షల బిల్లుల చెల్లింపు అంశాన్ని నగరపాలక సర్వసభ్య సమావేశంలో చర్చించి ఆమోదించారు. నిధుల లభ్యతను బట్టి గుత్తేదారులకు బిల్లులు ఇస్తాం. జవద్‌ తుపాను ఖర్చులను స్వల్పంగా మార్పులు చేసి తిరిగి జిల్లా అధికారుల ఆమోదానికి పంపించాం. - రమణారెడ్డి, అదనపు కమిషనర్‌, నగరపాలక సంస్థ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని