logo

ఆమె పరుగెడితే పతకమే

ఆమె వయసు 70 ఏళ్లు. అయినప్పటికీ తనకన్నా చిన్న వయసు వారితో పరుగులో పోటీపడుతోంది. బతికుంటే వందేళ్ల వరకు పరుగెడుతూనే ఉంటానని చెబుతోంది.

Published : 21 Sep 2023 05:24 IST

70 ఏళ్లలోనూ అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తున్న బామ్మ

మలేసియాలో కాంస్య పతకం సాధించిన రామానుజమ్మ

న్యూస్‌టుడే, సిరిసిల్ల (విద్యానగర్‌): ఆమె వయసు 70 ఏళ్లు. అయినప్పటికీ తనకన్నా చిన్న వయసు వారితో పరుగులో పోటీపడుతోంది. బతికుంటే వందేళ్ల వరకు పరుగెడుతూనే ఉంటానని చెబుతోంది. ఆమె సిరిసిల్లకు చెందిన టమటం రామానుజమ్మ. గత 35 ఏళ్లుగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరుగు పోటీల్లో పాల్గొని వందల పతకాలు సాధించింది. పరుగుతో పాటు యోగా, కరాటేలోనూ సత్తా చాటుతోంది. ఇటీవల మలేసియాలో 35వ ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో 50 కిలోల విభాగంలో 55 ఏళ్ల వయసు వారితో పోటీ పడి మరీ కాంస్య పతకం సాధించి ఔరా అనిపించింది.
రామానుజమ్మ భర్త టమటం భాషయ్య వైద్య, ఆరోగ్యశాఖలో సూపర్‌వైజర్‌గా పని చేసేవారు. ఆయన ప్రోత్సాహంతోనే అథ్లెట్గా మారింది. ఆయన 15 సంవత్సరాల క్రితం మరణించినప్పటికీ పరుగెడుతూనే భర్త ఆశయాలను నెరవేరుస్తుంది. ఆమెకు ఇద్దరు కుమారులు. రామానుజమ్మకు చిన్ననాటి నుంచి క్రీడలంటే ఆసక్తి ఎక్కువ. అయినప్పటికీ పోటీల్లో పాల్గొనలేదు. భర్త ప్రోత్సాహంతో పరుగు పోటీల్లో తొలిసారిగా 45 ఏళ్ల వయసులో పాల్గొంది. అప్పుడు ప్రారంభించిన పరుగును ఇప్పటివరకూ ఆపలేదు. రాష్ట్ర స్థాయిలో 200 పతకాలు, జాతీయ స్థాయిలో 10 స్వర్ణం, 5 రజత పతకాలు, జిల్లా స్థాయిలో అనేక పతకాలు సాధించింది. క్రీడలతో పాటు రామానుజమ్మకు సేవాభావం ఎక్కువ. వృద్ధులకు కంటి ఆపరేషన్లు చేయించి సేవ చేసేవారు. అందుకు వయోశ్రేష్ఠ సమ్మాన్‌ పురస్కారం అందుకున్నారు. భక్తిభావం కూడా ఎక్కువే. మహిళలందరినీ ఒకేచోట చేర్చి తులసి, కుంకుమ, కోటి శివార్చన పూజలు నిర్వహించింది. తిరుమల శ్రీవారి సేవకు తీసుకెళ్లింది. అనేకసార్లు రక్తదానం చేసింది. ఆర్థిక ఇబ్బందులతో అనేకసార్లు అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు దూరమైంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడకుండా ధైర్యంగా ముందుకెళ్లాలని పేర్కొంది.

పాస్‌పోర్టులో పొరపాటు వల్ల...

పాస్‌పోర్టులో చిన్న పొరపాటు వల్ల తన వయసు 55 అని పడటంతో 55 ఏళ్ల వారితో పరుగు పందెంలో పాల్గొంది. అయినా బెదరకుండా ధైర్యంగా తన కన్నా 15 ఏళ్లు చిన్న వారితో పోటీ పడి 200 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని తృతీయస్థానంలో నిలిచి.. కాంస్య పతకం సాధించి అందరి ప్రశంసలు అందుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని