logo

ధరావతు.. ప్రజాదరణకు గుర్తు

మీ పార్టీ అభ్యర్థి కనీసం డిపాజిట్‌ కూడా తెచ్చుకోలేదు. ప్రజల మద్దతు లేని వ్యక్తిని పోటీలో నిలబెట్టారంటూ తరచూ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల్లో వినిపించే మాటలు.

Updated : 15 Nov 2023 12:34 IST

ఎన్నికల్లో ఇదే కీలకాంశం

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల : మీ పార్టీ అభ్యర్థి కనీసం డిపాజిట్‌ కూడా తెచ్చుకోలేదు. ప్రజల మద్దతు లేని వ్యక్తిని పోటీలో నిలబెట్టారంటూ తరచూ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల్లో వినిపించే మాటలు. డిపాజిట్‌కు అంత ప్రాముఖ్యం ఉంటుంది మరి. కేవలం అభ్యర్థి కట్టిన డబ్బు తిరిగి రావడమే కాదు, అతడికి, పార్టీకి ఉన్న ప్రజాదరణ, నియోజకవర్గంలో అభ్యర్థికి ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. అసలేంటీ డిపాజిట్‌? ఉమ్మడి జిల్లాలో గత ఎన్నికల్లో పోటీలో నిలిచినవారు, డిపాజిట్‌ కోల్పోయారనే విషయాలు ఒకసారి గుర్తు చేసుకుందాం.

నియోజకవర్గ ఓట్ల లెక్కింపు సమయంలో నోటాకు వేసినవి, పోస్టల్‌ ఓట్లలో చెల్లకుండా పోయిన ఓట్లను తొలగిస్తారు. ఆ తర్వాత ఉన్న చెల్లుబాటైన ఓట్లలో 1/6 వంతు సాధించిన వారికి డిపాజిట్‌ తిరిగి చెల్లిస్తారు. అంతకంటే తక్కువ మొత్తంలో ఓట్లు సాధించిన వారి డిపాజిట్‌ను జప్తు చేస్తారు. 2018 ఎన్నికల్లో అత్యధికంగా కరీంనగర్‌ నియోజకవర్గం నుంచి 26 మంది పోటీ పడ్డారు. వీరిలో డిపాజిట్‌ దక్కింది ముగ్గురికి మాత్రమే. మిగతా 23 మంది డిపాజిట్‌ కోల్పోయారు. హుజూరాబాద్‌, మంథని నియోజకవర్గాల్లో తక్కువగా 11 మంది చొప్పున పోటీలో నిలవగా రెండు చోట్లా 9 మంది చొప్పున డిపాజిట్‌ కోల్పోయారు. 2014లో రామగుండంలో 27 మంది పోటీలో ఉండగా 25 మందికి డిపాజిట్‌ రాలేదు.

ప్రజాపాతినిధ్య చట్టం 1961 నిబంధనల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ వేసే సమయంలో సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లిస్తారు. ఆ నియోజకవర్గంలో పోలింగ్‌ జరిగి చెల్లుబాటైన ఓట్లలో ఎన్నికల సంఘం నిర్ణయించిన మేరకు ఓట్లు సాధిస్తే వారి డిపాజిట్‌ను తిరిగి ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.5,000, మిగతా సామాజిక వర్గాల వారు రూ.10 వేలు డిపాజిట్‌గా చేశారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 2018 ఎన్నికల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 193 మంది జాతీయ, ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడ్డారు. ఫలితాల తర్వాత 154 మంది డిపాజిట్‌ కోల్పోయారు. 2014 ఎన్నికల్లోనూ 168 మందికి 140 మంది డిపాజిట్‌ గల్లంతైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని