logo

కరీంనగర్‌లో 6.. పెద్దపల్లిలో 4

దేశంలో 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన సార్వత్రిక, ఉప ఎన్నికల్లో కరీంనగర్‌, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్లు జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులను ఆదరించారు.

Published : 28 Apr 2024 05:40 IST

లోక్‌సభ ఎన్నికల్లో భిన్న పార్టీలకు ప్రజాదరణ 

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం : దేశంలో 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన సార్వత్రిక, ఉప ఎన్నికల్లో కరీంనగర్‌, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్లు జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులను ఆదరించారు. కరీంనగర్‌ నుంచి ఆరు, పెద్దపల్లిలో నాలుగు పార్టీలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం దక్కింది. మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఎక్కువ సార్లు విజయం సాధించింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌, భారాస, భాజపాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.


కాంగ్రెస్‌.. 11 పర్యాయాలు

కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి 1952 నుంచి ఇప్పటివరకు సార్వత్రిక, ఉప ఎన్నికలు కలిసి 19 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 11 సార్లు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండగా కాంగ్రెస్‌ మద్దతుతో ఎన్‌.సి.ఎఫ్‌. అభ్యర్థి ఎం.ఆర్‌.కృష్ణ గెలిచారు. అనంతరం 1957(ద్విసభ్య), 1962, 1967, 1977, 1980, 1984, 1989, 1991లలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఆ తర్వాత వెనుకబడిన హస్తం పార్టీ 2009లో మరోసారి గెలిచింది. మధ్యలో రెండు సార్లు ఓడిన కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో పూర్వ వైభవం సంతరించుకోవాలని ప్రయత్నిస్తోంది.


పీడీఎఫ్‌, తెదేపా.. ఒక్కోసారి

విద్యాసాగర్‌రావు

1952లో జరిగిన మొదటి ఎన్నికల్లో ద్విసభ్య నియోజకవర్గం నుంచి కమ్యూనిస్టుల మద్దతుతో బరిలోకి దిగిన పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీఎఫ్‌) అభ్యర్థి బద్దం ఎల్లారెడ్డి గెలిచారు. అనంతరం ఆ పార్టీకి మరోసారి అవకాశం దక్కలేదు. 1996 సాధారణ ఎన్నికల్లో తెదేపా నుంచి పోటీ చేసిన ఎల్‌.రమణ విజయ కేతనం ఎగురవేశారు. ఆ పార్టీకి కూడా మరోసారి అవకాశం రాలేదు.


టీపీఎస్‌.. ఎమ్మెస్సార్‌

కేసీఆర్‌

1971 ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి(ప్రాంతీయ పార్టీ) పక్షాన ఎం.సత్యనారాయణరావు పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరి 1977, 1980లలో గెలిచారు.


నాడు చెన్నమనేని.. నేడు బండి

భారతీయ జనతా పార్టీ కరీంనగర్‌లో మూడు సార్లు జెండా ఎగురవేసింది. 1998, 1999లలో గెలిచిన పార్టీ అభ్యర్థి చెన్నమనేని విద్యాసాగర్‌రావు కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. అనంతరం రెండు దశాబ్దాల తర్వాత 2019లో పార్టీ నేత బండి సంజయ్‌ గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి ఆయన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

కేసీఆర్‌.. వినోద్‌కుమార్‌

2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టిన తెరాస(ప్రస్తుత భారాస) గెలిచింది. పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మొదటిసారి లోక్‌సభలో అడుగుపెట్టి కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌తో విభేదించి రాజీనామా చేయడంతో 2006, 2008లలో ఉప ఎన్నికలు వచ్చాయి. రెండు పర్యాయాలు ఆయన సొంతంగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో ఆ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ గెలుపొందారు. ఉప ఎన్నికలతో కలిసి మొత్తం నాలుగు సార్లు ఈ స్థానాన్ని భారాస తన ఖాతాలో వేసుకొంది. పార్టీ అభ్యర్థిగా వినోద్‌కుమార్‌ మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు.

హస్తం.. సగానికంటే అధికం

పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటివరకు 15 సాధారణ, ఒక ఉప ఎన్నికతో కలిపి మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 1962 నుంచి 9 సార్లు కాంగ్రెస్‌ గెలుపొందింది. 1962, 1977, 1980, 1989, 1991, 1996, 2004, 2009 ఎన్నికల్లో ఆ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. జి.వెంకటస్వామి నాలుగు సార్లు ఎన్నికై కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ఆయన తనయుడు వివేక్‌ 2009లో గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో వెంకçËస్వామి మనవడు వంశీ కాంగ్రెస్‌ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

తెదేపా నాలుగుసార్లు

పెద్దపల్లిలో తెలుగుదేశం పార్టీ 1983, 1984, 1998, 1999లలో గెలుపొందింది. 1998, 1999లలో వరుసగా రెండు సార్లు పార్టీ అభ్యర్థి డా.సుగుణకుమారి విజయం సాధించడం విశేషం.

భారాస హ్యాట్రిక్‌ కొట్టేనా!

తెరాస(ప్రస్తుత భారాస) 2014, 2019లలో గెలుపొందింది. 2014లో బాల్క సుమన్‌, 2019లో వెంకటేశ్‌నేత ఆ పార్టీ నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం భారాస అభ్యర్థిగా, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ బరిలోకి దిగారు.

తెప్రసకూ ఆదరణ

1971 ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థి వి.తులసీరాం ఎన్నికయ్యారు. ఆయన తర్వాత కాంగ్రెస్‌లో చేరి 1977లో రెండోసారి గెలిచారు.

బోణీ కొట్టని భాజపా

పెద్దపల్లి నుంచి ఇప్పటివరకు భాజపా గెలవలేదు. గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం దక్కలేదు. ఈసారి ఆ పార్టీ అభ్యర్థిగా గోమాసె శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు