logo

విదేశాల్లో ఉన్నా వదిలేదే లే!

కరీంనగర్‌ భూ దందాలో భాగమై కేసులు నమోదైన వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే కొందరు  అరెస్టై జైలుకెళ్లగా ఇంకొందరు తప్పించుకు తిరుగుతున్నారు.

Published : 28 Apr 2024 05:41 IST

భూ దందారాయుళ్లపై పోలీసుల నజర్‌

ఈనాడు, కరీంనగర్‌ : కరీంనగర్‌ భూ దందాలో భాగమై కేసులు నమోదైన వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే కొందరు  అరెస్టై జైలుకెళ్లగా ఇంకొందరు తప్పించుకు తిరుగుతున్నారు. ఇలా కేసు నమోదై కొన్నాళ్లుగా అందుబాటులో లేని వారి వివరాలు పోలీసులు ఆరా తీస్తున్నారు. అమాయక ప్రజలను మోసం చేయడంతోపాటు డబ్బుల వసూళ్లకు పాల్పడిన తీరుతో వరుసగా కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో కేసులు నమోదవుతున్నాయి. దాదాపుగా 1,800 మంది వరకు భూ బాధితులు వేర్వేరుగా తమ సమస్యల్ని సీపీ దృష్టికి వివరిస్తూ ఫిర్యాదులు అందజేశారు. దీంతో ఎకనామిక్‌ అఫెన్స్‌ వింగ్‌ (ఈఓడబ్ల్యూ) ఏర్పాటు చేసి భూ మాఫియా ఆగడాలపై సీపీ అభిషేక్‌ మహంతి ప్రత్యేక నిఘా పెట్టించారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, ఆధారాలు సేకరించి కొందరు కార్పొరేటర్లతోపాటు కీలకమైన నాయకుల్ని కటకటాల్లోకి నెట్టారు. ఈ సందర్భంలోనే నమోదైన కొన్ని కేసుల్లో నిందితులుగా ఉన్న కొందరు పరారీలో ఉన్నారు. వీరిలో ఇద్దరు, ముగ్గురు విదేశాల్లో తలదాచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. పలుమార్లు వారి ఇళ్లకు వెళ్లి చెప్పి చూశారు. అయినా వారు స్వదేశానికి రాకపోవడంతో వారికి లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేయడంపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా దాదాపు 10కిపైగా ఫిర్యాదులు వచ్చిన ఓ నాయకుడు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ఈ తరహా చర్యలకు సిద్ధమవుతున్నారు. రెండ్రోజుల కిందట కూడా మరో నేతపై మూడో ఠాణాలో ఫిర్యాదు అందింది. గతంలోనూ భూ దందాలో భాగమయ్యాడని కేసు నమోదైన ఆయన కూడా దుబాయిలో తలదాచుకుంటున్నారనే సమాచారంతో పోలీసులు వారి ఇంటికి వెళ్లి విచారించినట్లు తెలిసింది. ఇక కరీంనగర్‌ నియోజకవర్గ స్థాయిలోని ఓ కీలక నాయకుడి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనను ఏ క్షణాన్నైనా అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని