logo

జిల్లా అభివృద్ధి చెందాలంటే వినోద్‌ గెలవాలి

కరీంనగర్‌ అభివృద్ధి చెందాలంటే ప్రజలు భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ను గెలిపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు కోరారు.

Published : 28 Apr 2024 05:49 IST

ఇంటింటి ప్రచారంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు 

ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు,  భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే కమలాకర్‌

రాంపూర్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: కరీంనగర్‌ అభివృద్ధి చెందాలంటే ప్రజలు భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ను గెలిపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు కోరారు. శనివారం సాయంత్రం కరీంనగర్‌ కోతిరాంపూర్‌లోని 9వ డివిజన్‌లో భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కరీంనగర్‌ను అభివృద్ధి చేసిన ఘనత వినోద్‌కుమార్‌దని, అభివృద్ధి మరింత పరుగు తీయాలంటే ఆయన గెలవాల్సిన అవసరముందన్నారు. ఎంపీగా వినోద్‌కుమార్‌ పార్లమెంట్‌లో పలు అంశాలపై మాట్లాడిన దాంట్లో పది శాతం కూడా ఎంపీ సంజయ్‌ మాట్లాడలేదని తెలిపారు. కరీంనగర్‌లో గతంలో ఎప్పుడూ తాగునీటికి ఇబ్బందులు లేవని, ఇప్పుడు కరవు వచ్చిందన్నారు. ప్రచారానికి వచ్చిన ఆయనకు కోతిరాంపూర్‌ చౌరస్తాలో పార్టీ శ్రేణులు, ప్రజలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి భారాసను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మేయర్‌ వై.సునీల్‌ రావు, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, భారాస జిల్లా, నగర అధ్యక్షులు జి.వి.రామకృష్ణారావు, చల్ల హరిశంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

సీఎం ముఖంలో భయం..

అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీకి తక్కువ సీట్లు వస్తే దించేస్తారనే భయం సీఎం రేవంత్‌రెడ్డి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుందని.. అందుకే ఆయన ప్రసంగాల్లో దేవుళ్ల మీద ఒట్టు పెట్టుకోవడం, లేదా రిజర్వేషన్ల విషయంలో సెంటిమెంట్‌ మాటలు మాట్లాడటం కనిపిస్తోందన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల ప్రస్తావన ఎక్కడా ప్రజలకు చెప్పడం లేదన్నారు. అటు మోదీకి ఇటు రేవంత్‌రెడ్డికి ప్రజల ఎజెండా, పేదల ఎజెండా లేదని.. వారిద్దరు కుమ్మక్కై ప్రజలను  మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మోదీని పొగడటం, అదానీని ఆలింగనం చేసుకోవడంతోనే సీఎం వైఖరి ఏంటనేది తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు. వారి కుట్రలను తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో తిప్పికొడతారని.. భారాసకు అనుకూలంగా ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయన్నారు.  అంతకుముందు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ స్వగృహంలో వినోద్‌కుమార్‌తో కలిసి భారాస కార్పొరేటర్ల సమావేశం నిర్వహించారు.

జమ్మికుంటలో వాకర్లను కలిసి..

జమ్మికుంట : జమ్మికుంటలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, నాయకులతో కలిసి ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ మార్నింగ్‌ వాక్‌, జిమ్‌ చేస్తూ ప్రచారం నిర్వహించారు. వాకర్లతో మాట్లాడారు. 2004లో అయిదుగురు తెరాస ఎంపీలే గెలిచినా అన్ని పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలత తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు