logo

బరిలో ఉండేదెవరు?

లోక్‌సభ ఎన్నికల్లో పోటీలో ఉండేదెవరో సోమవారం తేలిపోనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 3 గంటల వరకే సమయం ఉండటంతో ఎవరు బరిలో ఉంటారు..? ఎవరు నామపత్రాలు వెనక్కి తీసుకుంటారో నేడు వెల్లడి కానుంది.

Updated : 29 Apr 2024 06:13 IST

ఉపసంహరణలకు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు
ఈనాడు, కరీంనగర్‌

లోక్‌సభ ఎన్నికల్లో పోటీలో ఉండేదెవరో సోమవారం తేలిపోనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 3 గంటల వరకే సమయం ఉండటంతో ఎవరు బరిలో ఉంటారు..? ఎవరు నామపత్రాలు వెనక్కి తీసుకుంటారో నేడు వెల్లడి కానుంది. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ స్థానాలకు దండిగానే అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు గుర్తింపు పొందిన ఇతర పార్టీలు, స్వతంత్రులు కూడా పోటీకి ఉత్సాహం చూపించారు. కరీంనగర్‌లో 53 మంది నామినేషన్లు వేయగా అందులో 20  తిరస్కరించారు. పెద్దపల్లిలో 63 మంది నామినేషన్లు వేయగా అక్కడ 14 తిరస్కరణకు గురయ్యాయి. నిజామాబాద్‌లో 42 మంది నామపత్రాలు దాఖలు చేయగా అందులో 10  తిరస్కరించారు. మూడు చోట్ల మిగిలిన 114 మందిలో ఎంతమంది తుది పోటీలో ఉంటారో మరికొద్ది గంటల్లో తేలనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తరువాత ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు గుర్తింపు పొందిన పార్టీలు, స్వతంత్రులకు గుర్తులను కేటాయిస్తారు.

ఓట్లు చీలకుండా...

దాదాపుగా అన్ని చోట్లా ఇప్పుడున్న అభ్యర్థుల సంఖ్యను బట్టి రెండు చొప్పున ఈవీఎంలను ప్రతి పోలింగ్‌ బూత్‌లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందుకనే ప్రధాన పార్టీలు స్వతంత్రులుగా బరిలోకి దిగిన వ్యక్తుల గురించి ఆరా తీస్తూ పోటీకి దూరంగా ఉండాలనే ప్రతిపాదనను వారి ముందుంచుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థికి ఉండే గుర్తులను పోలిన గుర్తులు స్వతంత్ర అభ్యర్థులకు వస్తే ఓట్లు వారికి పడే అవకాశముంటుందన్న ఆందోళనతో బేరసారాలు నిర్వహిస్తున్నారు. మూడు లోక్‌సభ స్థానాల పరిధిలో ఈ తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుర్తింపు పొందిన పార్టీలు.. స్వతంత్రులుగా రంగంలో ఉన్నవారెవరు.. వారి వెనుక ఎవరున్నారో కూపీ లాగిన ప్రధాన పార్టీలు ఎవరు చెబితే వారు పోటీ నుంచి తప్పుకొంటారనే విషయం తెలుసుకుని వారి ద్వారా ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. నామినేషన్‌ వేసే క్రమంలో చెల్లించిన రుసుముతోపాటు అదనంగా వారు ఎన్నికల్లో చూపించే ప్రభావాన్ని బట్టి ఎంతో కొంత ముట్టజెప్పడానికి కూడా వెనుకడుగేయడం లేదు. ఈ క్రమంలో ఎవరు వైదొలుగతారు.. ఎవరు బరిలో ఉంటారోనని రాజకీయవర్గాల్లో ఆసక్తి ఉంది.

ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో గుబులు

ఈనాడు, పెద్దపల్లి: ఓవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు ఎన్నికలు.. గతంలో కంటే అధికంగా నమోదైన నామినేషన్లు.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుబులు పుట్టిస్తున్నాయి. ప్రచార వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా స్వతంత్రులు నామినేషన్ల దాఖలుకు మాత్రమే పరిమితమవుతూ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. అయితే ఎక్కువ మంది బరిలో ఉంటే ఈవీఎంలు పెరిగి ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుందని పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

ఉపసంహరణపై ఆసక్తి అంతంతే

2019లో పెద్దపల్లిలో 17 మంది, కరీంనగర్‌లో 15 మంది, నిజామాబాద్‌లో 183 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాధారణంగా స్థానిక సంస్థలు, శాసనసభ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్లు వేసే అభ్యర్థులు ఉపసంహరించుకోవడానికి ఆసక్తి చూపరు. వివిధ నియోజకవర్గాల నుంచి వివిధ పార్టీలకు చెందిన వారితో పాటు స్వతంత్రులు నామినేషన్‌ వేస్తారు. వీరిలో చాలా మంది ప్రధాన పార్టీల అభ్యర్థులకు తెలియని వారే ఉంటారు. ఈ కారణంగా 2019 ఎన్నికల్లో కరీంనగర్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి ఎంపీ స్థానాల్లో అన్ని చోట్లా కలిపి దాదాపు 20 మంది వరకు మాత్రమే నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నిజామాబాద్‌లో అప్పట్లో 219 నామినేషన్లు వేయగా 26 మందివి తిరస్కరణకు గురయ్యాయి. 183 మంది  బరిలో నిలవడం దేశంలోనే చర్చనీయాంశమైంది.

సంఖ్య పెరిగితే గందరగోళం

ఈవీఎంలో 15 మంది అభ్యర్థులు, నోటాతో కలిపి మొత్తం 16 మీటలుంటాయి. గత ఎన్నికల సమయంలో నిజామాబాద్‌లో ఏకంగా 22 ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. పెద్దపల్లిలో రెండు, కరీంనగర్‌లో ఒకటి చొప్పన ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఎక్కువ యంత్రాలుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వృద్ధులు, నిరక్షరాస్యులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రధాన పార్టీ అభ్యర్థులకు వేయాల్సిన ఓట్లు పొరపాటున స్వతంత్ర అభ్యర్థులకు వేస్తే ఫలితం తారుమారయ్యే పరిస్థితి. గతంలో ఇలాగే ప్రధాన పార్టీలు సైతం వేల సంఖ్యలో ఓట్ల ఆధిక్యం తగ్గి ఓడిపోయిన ఘటనలు జరిగాయి. ఈ క్రమంలో స్వతంత్రులను బుజ్జగించడానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని