logo

కారులోనే పెళ్లి.. ఠాణాకు చేరిన పంచాయితీ

నటుడు యాష్‌, నటి ఓవియా నటించిన కిరాకత అనే కన్నడ సినిమా మాదిరిగా ఓ ప్రేమ జంట కారు వెనుక సీటునే పెళ్లి పందిరిగా..ఆడియో నుంచి వచ్చే మంగళ వాయిద్యాలు..వేదమంత్రాలుగా భావించి దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు.

Updated : 04 Jan 2024 07:50 IST

తెక్కల కోటలో సంఘటన

కారులోనే పెళ్లి చేసుకున్న ప్రేమ జంట

బళ్లారి, న్యూస్‌టుడే: నటుడు యాష్‌, నటి ఓవియా నటించిన కిరాకత అనే కన్నడ సినిమా మాదిరిగా ఓ ప్రేమ జంట కారు వెనుక సీటునే పెళ్లి పందిరిగా..ఆడియో నుంచి వచ్చే మంగళ వాయిద్యాలు..వేదమంత్రాలుగా భావించి దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. యువతి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో పోలీసులను సంప్రదించారు. తెక్కలకోట పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని సిరుగుప్ప తాలూకా తెక్కలకోటెకు చెందిన శివప్రసాద్‌ డిప్లొమా చదువుకున్నారు. కొప్పళ జిల్లాకు చెందిన అమృత డిగ్రీ చేసింది. ఇద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారైనా వారి పరిచయం ప్రేమకు దారితీసింది. అక్కడితో ఆగిపోకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు అడ్డుకుంటున్నారని కిరాకత సినిమా మాదిరిగానే కారు వెనుక సీటులో దండలు మార్చుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. చివరికి వారు మంగళవారం సాయంత్రం సిరుగుప్ప తాలూకా తెక్కలకోటె పోలీసులను సంప్రదించారు. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులను కూర్చోబెట్టి యువతిని అభిప్రాయాలు కోరడంతో మొదట భర్త శివప్రసాద్‌ కావాలి. కొద్ది సేపటికే తల్లిదండ్రులు కావాలని సమాధానం చెప్పడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. అప్పటికే రాత్రి కావడంతో పోలీస్‌ స్టేషన్‌లో ఉంచుకోవడం మంచిది కాదని మహిళా పోలీసుల సహకారంతో మంగళవారం రాత్రి కంటోన్మెంట్‌లోని స్త్రీసేవా నికేతన్‌ సాంత్వన కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా భర్త శివప్రసాద్‌ వాహనానికి అడ్డంగా కూర్చుని అమృతను ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నా. దండలు మార్చుకోవడమే కాదు. మెడలో నల్లపూసల దండ కూడా ఉంది. తన భార్యను  వెంట పంపించాలని వేడుకున్నాడు. యువతి అభిప్రాయం మేరకు బుధవారం నిర్ణయం తీసుకుంటామని పోలీసులు ఆమెను తీసుకెళ్లారు. బుధవారం తెక్కలకోటె పోలీసులు అమృతను వాహనంలో తెక్కలకోటె పోలీస్‌ స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు. ఇద్దరూ మేజర్లు కావడంతో యువతి తీసుకునే నిర్ణయంపై పోలీసులు ముందుకు వెళ్తారు. మొదట పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి అనంతరం యువతి అభిప్రాయాలను వీడియో రికార్డ్‌ చేసి వారి వెంట పంపుతామని తెక్కలకోటె పోలీసులు తెలిపారు.

ప్రేమించి కారులోనే పెళ్లి చేసుకున్న యువ జంట ఒక్కటయ్యారు. యువతి మనసు గందరగోళంగా ఉండటంతో మంగళవారం రాత్రి బళ్లారి సాంత్వన కేంద్రంలో ఉంచారు. బుధవారం సాయంత్రం తెక్కలకోటె పోలీస్‌ స్టేషన్‌లో అమృత తల్లిదండ్రులు, శివప్రసాద్‌ తల్లిదండ్రుల మధ్య పోలీసులు పంచాయితీ చేశారు. చివరికి యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్న శివప్రసాద్‌ ఇంటికే వెళ్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరువర్గాల నుంచి వీడియోరికార్డ్‌ చేసుకుని అమృతను శివప్రసాద్‌ వెంట పంపారు. ఆద్యంతం సాగిన ఈ కథ చివరికి సుఖాంతమైంది. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

తెక్కలకోటె పోలీస్‌ స్టేషన్‌ వద్ద అడ్డుకుంటున్న యువకుడు, స్నేహితులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని