logo

కాంగ్రెస్‌లో నాయకత్వం ద్విగుణీకృతం

కాంగ్రెస్‌లో నాయకులు, నాయకత్వం లేదంటూ ప్రధాని మోదీ ప్రచారం పచ్చి అబద్ధమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.

Published : 30 Apr 2024 01:33 IST

కుష్ఠగిలో సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్‌లను గజమాలతో సత్కరిస్తున్న అభిమానులు

గంగావతి,న్యూస్‌టుడే: కాంగ్రెస్‌లో నాయకులు, నాయకత్వం లేదంటూ ప్రధాని మోదీ ప్రచారం పచ్చి అబద్ధమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కొప్పళ జిల్లా కుష్ఠగిలో సోమవారం ప్రజాధ్వని యాత్రలో పాల్గొని మాట్లాడారు. పదేళ్లలో అబద్ధాలు చెప్పే ప్రజలను ఆయన తప్పుదోవ పట్టించి అధికారంలోకి వస్తున్నారన్నారు. ప్రస్తుతం నాయకత్వం లేదనే కొత్త అబద్ధాన్ని తెరపైకి తెచ్చారన్నారు. తమ పార్టీలో రాహుల్‌, ఖర్గే వంటి అనుభవజ్ఞులు ఉన్నారన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏడాదికొకరు ప్రధాని అవుతారన్నదీ అబద్ధమే అన్నారు. రాష్ట్రంలో 2008 నుంచి 2013 దాకా అధికారంలో ఉన్న భాజపా ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చలేదా అని ప్రశ్నించారు. తరువాత తాను ఐదేళ్ల సుస్థిర పాలన అందించినట్లు చెప్పారు. ఆరు దశాబ్దాలు దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌కు నాయకత్వ కొరత దుర్గతి పట్టలేదన్నారు. భాజపా అబద్ధాల కార్ఖానా అంటూ అదే వారి ఇంటిదేవుడు అన్నారు. పదేళ్లలో మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగానే నడిచారన్నారు. భాజపా నలభైశాతం అవినీతి దర్యాప్తునకు కమిషన్‌ వేశామంటూ దోషులుగా తేలితే కఠినచర్యలు తప్పవన్నారు. మోదీకి ఎన్నికలపుడే రాష్ట్రం గుర్తుకొస్తుందంటూ అతివృష్టి, కరవు సందర్భాల్లో తిరిగి చూడలేదన్నారు. పారిశ్రామికవేత్తలకు రూ.16వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఆయనకు రైతుల కష్టాలు తెలియవన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌, మంత్రులు శివరాజ్‌ తంగడిగి, భైరతి బసవరాజ్‌, బసవరాజ్‌ రాయరెడ్డి, అభ్యర్థి రాజశేఖర్‌ హిట్నాళ, అమరేగౌడ, రాఘవేంద్ర హిట్నాళ సంగణ్ణ కరడి పాల్గొన్నారు.

భాజపాకు మరోసారి అధికారం అసాధ్యం

కూడ్లిగిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వేదికపై ఐక్యత భావం ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌, మంత్రి జమీర్‌ అహ్మద్‌ఖాన్‌

హొసపేటె : కేంద్రంలో మరోసారి భాజపా అధికారంలోకి రాదన్న నిజం ప్రధాని మోదీకి అర్థమైంది. వారిలో ఇప్పటినుంచే నిరాశ, నిస్పృహలు చోటుచేసుకుంటున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. విజయనగర జిల్లా కూడ్లిగిలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజాధ్వని-2 ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.  మోదీ మరోసారి ప్రధాని కాబోరని పలు సంస్థల సమీక్షల ద్వారా తేలింది. కాని వాటి వివరాలను మాధ్యమాల్లో ప్రకటించకుండా మోదీ అడ్డుకుంటున్నారని దెప్పిపొడిచారు. ఓటమి భయంతో మాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, దీనిపై ఓటర్ల జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.భాజపా కూటమికి 200 స్థానాలు దక్కితే అదే గగనమని వ్యంగమాడారు. మతాలు, కులాల నడుమ ఏదో ఓ సాకుతో చిచ్చు పెట్టడం భాజపాకు వెన్నతో పెట్టిన విద్యఅని ధ్వజమెత్తారు. పదేళ్లలో మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన కానుక శూన్యం. భాజపా అభ్యర్థి బి.శ్రీరాములు పెద్ద అబద్ధాల కోరు. ఆయనతో ఏదీ సాధ్యంకాదని ఎద్దేవాచేశారు. రైతులు, మహిళలు, యువకుల సంక్షేమం పట్టని మోదీ మరో సారి ప్రధాని కావడం అవసరమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళలు, నిరుద్యోగుల జీవితాలు బాగుపడతాయని తేల్చిచెప్పారు. ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అభ్యర్థి ఇ.తుకారాం ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా తనకి ఓ అవకాశం ఇవ్వండని భాజపా అభ్యర్థి శ్రీరాములు ఓటర్లను ప్రాధేయపడటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. మంత్రులు జమీర్‌ అహ్మద్‌ఖాన్‌, రామలింగారెడ్డి మాట్లాడారు. వేదికపైన అఖండ బళ్లారి జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు ప్రముఖులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు