logo

ప్రజ్వల్‌ రాజకీయ భవితపై నీలినీడలు

లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్‌, మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని సొంతపార్టీ జనతాదళ్‌ నేతల నుంచే డిమాండ్లు వెల్లువెత్తడం అనూహ్య పరిణామంగా మారింది.

Published : 30 Apr 2024 01:37 IST

ప్రజ్వల్‌ రేవణ్ణను భాజపా నేతలు ఉపేక్షించారంటూ బెంగళూరు పీసీసీ కార్యాలయంలో వివరిస్తున్న మహిళా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు అల్క లంబా, రాష్ట్ర అధ్యక్షురాలు పుష్పా అమర్నాథ్‌

హాసన, న్యూస్‌టుడే : లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్‌, మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని సొంతపార్టీ జనతాదళ్‌ నేతల నుంచే డిమాండ్లు వెల్లువెత్తడం అనూహ్య పరిణామంగా మారింది. ఈ అంశంపై దళపతులు హెచ్‌.డి.దేవేగౌడ, కుమారస్వామి ఓ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారన్న సమాచారం రాష్ట్రాన్ని కుదిపేసే అంశం. మరోవైపు.. ప్రజ్వల్‌ రేవణ్ణ అశ్లీల వీడియోల కేసుకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించేందుకు ‘సిట్’ అధికారులు సాంకేతికంగా ముందడుగు వేశారు. బీకే సింగ్‌ నేతృత్వంలోని సుమన్‌ పన్నేకర్‌, సీమాలాట్కర్‌లతో కూడిన దర్యాప్తు బృంద అధికారులు హొళెనరసీపుర ఠాణాలో కేసు నమోదు చేసిన బాధితురాలి నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. లైంగిక దౌర్జన్యం జరిగిన రేవణ్ణ నివాసంలోనూ మహజరు నిర్వహించిన అనంతరం రేవణ్ణ, ప్రజ్వల్‌ను విచారిస్తారు. సిట్ అధికారులు పెన్‌డ్రైవ్‌లు, ఇతర సాక్ష్యాలను సేకరించి, దర్యాప్తు చేస్తున్నట్లు హోం మంత్రి డాక్టర్‌ జీ పరమేశ్వర్‌ తెలిపారు. అదే సమయంలో.. తమను అరెస్టు చేయకుండా విచారణ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హెచ్‌డీ రేవణ్ణ న్యాయస్థానంలో అర్జీ వేసుకునేందుకు సన్నాహాలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ అనంతరం విదేశాలకు వెళ్లాలని ప్రజ్వల్‌ ముందుగా నిర్ణయించుకున్నారని, కేసు నమోదు కావడంతోనే పరారయ్యాడనేది అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. దర్యాప్తునకు భయపడడం లేదని స్పష్టం చేశారు. ఐదేళ్ల కిందటి సంఘటనపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం వెనుక రాజకీయాలు, కుట్ర కోణం ఉన్నట్లు ఆరోపించారు.

ఉపేక్షించనేల?

ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని జనతాదళ్‌ నేత, గురుమఠ్‌కల్‌ ఎమ్మెల్యే శరణగౌడ కందకూర డిమాండు చేశారు. మాజీ ప్రధాని దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి ఆయన ఓ లేఖ రాశారు. వరికంకి తలపై పెట్టుకున్న మహిళ చిహ్నం ఉన్న మన పార్టీలో ఇలా మహిళలపై లోక్‌సభ సభ్యుడు లైంగిక దౌర్జన్యానికి పాల్పడడం సిగ్గు చేటని ఆక్రోశించారు. అశ్లీల వీడియోలు బయటకు వచ్చిన తర్వాత మేమంతా ఓటర్లకు ముఖం చూపించేందుకు సిగ్గు పడవలసి వస్తోందని మరో ఎమ్మెల్యే సమృద్ధి మంజునాథ్‌ వ్యాఖ్యానించారు. విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇంటి నుంచి బయటకు రావడం లేదని ఆయన ఒక ట్వీట్లో పేర్కొన్నారు.

ప్రియాంక నిప్పులు

ప్రజ్వల్‌పై కాంగ్రెస్‌ పార్టీ నేతలు నిరసన జ్వాల రగిలించారు. పీసీసీ తన ఎక్స్‌ కార్ప్‌ ఖాతాలో మోదీ తీరును విమర్శించింది. ప్రజ్వల్‌ వ్యవహార శైలిని గత ఏడాది డిసెంబరులోనే అధిష్ఠానం దృష్టికి భాజపా నాయకుడు దేవరాజేగౌడ తీసుకువెళ్లినా, ఆ విషయాన్ని ఎందుకు విస్మరించారని ప్రశ్నించింది. ఎన్నికలకు పది రోజుల ముందుగా ప్రజ్వల్‌ను పొగుడుతూ చేసిన ప్రసంగాలు మర్చిపోయారా అంటూ మోదీపై ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. ఈ వ్యవహారానికి దూరంగా ఉండాలని భాజపా నేతలు ఇప్పటికే తీర్మానించారు.

ఇన్నేళ్లూ మిన్నకున్నారే?

రేవణ్ణ, ప్రజ్వల్‌ లైంగిక దౌర్జన్యాలకు పాల్పడుతూ వస్తే.. ఇన్నేళ్లు ఎందుకు మాట్లాడలేదని బాధితురాలి అత్త, ఇతర కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ కుటుంబ సభ్యులు, భవానీ రేవణ్ణ తమకు పలు సందర్భాల్లో అండగా నిలిచారని చెప్పారు. హాసనలో వారు విలేకరులతో సోమవారం మాట్లాడారు. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసిన బాధితురాలికి ఆర్థిక సాయం చేస్తామని ఎవరో వెనుక నిలబడి కేసు పెట్టించారని ఆరోపించారు. ఎన్నికల సమయం కావడంతోనే ఈ ఆరోపణలు చేయించారని విమర్శలు గుప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని