logo

భాజపాను గెలిపిస్తే పెనుముప్పు

‘భాజపా ఈసారి 400సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ పార్టీని గెలిపిస్తే ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ రిజర్వేషన్‌ కోల్పోయినట్లే’నని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలను హెచ్చరించారు.

Published : 30 Apr 2024 01:38 IST

సేడం సభలో రేవంత్‌రెడ్డి ధ్వజం

ప్రసంగిస్తున్న ప్రియాంకా గాంధీ

ఈనాడు, బెంగళూరు : ‘భాజపా ఈసారి 400సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ పార్టీని గెలిపిస్తే ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ రిజర్వేషన్‌ కోల్పోయినట్లే’నని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలను హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కర్ణాటకలోని కలబురగి జిల్లా సేడంలో ఆయన మాట్లాడారు. భాజపా నేతలకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ సర్కారు వస్తేనే రాజ్యాంగ, రిజర్వేషన్‌ వ్యవస్థలకు రక్షణ సాధ్యమన్నారు. కాంగ్రెస్‌లో ఓ సాధారణ కార్యకర్తను కూడా ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టవచ్చని మల్లికార్జున ఖర్గే నిరూపించారని వివరించారు. గుజరాత్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌ షాలకు ఇచ్చిన మద్దతే ఇక్కడా మల్లికార్జున ఖర్గేకు దక్కాలని రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. కర్ణాటకలో గత లోక్‌సభ ఎన్నికల్లో భాజపా సభ్యులు 25 మంది గెలిచినా వారికి దక్కింది ఒక కేబినెట్‌ మంత్రి పదవి మాత్రమేనన్నారు. గుజరాత్‌లో 26 మంది ఎంపీల్లో ఏడుగురికి మంత్రి పదవులు దక్కాయని తప్పుపట్టారు. ఇది కర్ణాటకకు జరిగిన అన్యాయమని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ రాష్ట్రానికి కరవు పరిహారం, తాగునీటి కోసం ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వని భాజపా మళ్లీ ఓట్లడిగేందుకు మీ ముందుకు వస్తుందన్నారు.

ఎవరికీ భయపడను

గతంలో నాపై ఈడీ, ఐటీ అధికారులను పంపిన కేంద్రం ఇప్పుడు దిల్లీ పోలీసులతో నోటీసులు ఇప్పించే ప్రయత్నం చేస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సామాజిక మాధ్యమంలో ఏదో పోస్ట్‌ చేశారన్న నెపంతో నాపై దిల్లీ పోలీసులను పంపారని తప్పుపట్టారు. మోదీ గారూ.. నేను ఇలాంటి బెదిరింపులకు భయపడనంటూ సవాలు చేశారు. గతంలో తెలంగాణ కాంగ్రెస్‌ కార్యకర్తలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాడులు చేస్తే ఇక్కడి కాంగ్రెస్‌ కార్యకర్తలు అండగా ఉన్నారని వివరించారు. ‘నేను మీ పక్కనే ఉంటాను. మీకేదైనా అవసరం వస్తే ఓ ఫోను చేయండి వచ్చి వాలుతాను. లేదా హైదరాబాద్‌కు వచ్చిన నన్ను కలవండి’ అంటూ రేవంత్‌ భరోసా ఇచ్చారు.

సేడం సభలో మాట్లాడుతున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. చిత్రంలో రేవంత్‌రెడ్డి, ప్రియాంక తదితరులు

‘దేశానికి ఎంతో మంది ప్రధానులు వచ్చారు. వారంతా సత్యమార్గంలో నడిచారు. మోదీ మాత్రం ఏమీ చేయలేదు’ అంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ తప్పుపట్టారు. సేడం సభలో ఆమె ప్రసంగిస్తూ మహిళల మంగళసూత్రాల గురించి పదేపదే మాట్లాడే ప్రధాని మోదీ ఎన్‌డీఏ నేత ప్రజ్వల్‌ రేవణ్ణ పలువురు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఆ వ్యక్తి తరఫున ప్రచారం చేసిన మోదీ, అమిత్‌ షాలు నేడు ఏం బదులిస్తారని ప్రశ్నించారు. ఒలింపిక్స్‌ క్రీడాకారులను వేధించినా, మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడినా మోదీ మౌనంగా ఉంటారని నిప్పులు చెరిగారు. రాజ్యాంగాన్ని రద్దు చేయటం, రైతుల రుణమాఫీకి నిధులు లేవని చెప్పే కేంద్ర సర్కారు రూ.16 లక్షల కోట్ల పెట్టుబడిదారుల రుణాలు మాఫీ చేసిందని ఆరోపించారు. ఇదే సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కాంగ్రెస్‌ రాజ్యాంగాన్ని అమలు చేయకుంటే మోదీ ప్రధాని, అమిత్‌ షా కేంద్ర మంత్రి అయ్యేవారు కాదన్నారు. వీరు నిత్యం కాంగ్రెస్‌ను విమర్శించటం తప్ప ప్రజలకు ఏం చేశారో వివరించరని అసహనం వ్యక్తం చేశారు. మేము అధికారంలోనికి వస్తే నారీ, యువ, రైతులు, శ్రామికులు, జాతులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. కలబురగి అభ్యర్థి రాధాకృష్ణ దొడ్డమని తరఫున ప్రచారం చేపట్టిన ఈ సభలో రాష్ట్ర కాంగ్రెస్‌ బాధ్యుడు రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా, పలువురు రాష్ట్రమంత్రులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని