logo

సామాజిక సమర భూమిక

మలివిడత ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతలంతా మాటల తూటాలు పేలుస్తున్నారు.

Published : 30 Apr 2024 01:39 IST

బాగల్‌కోటె సభలో అభివాదం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా నేతలు

ఈనాడు, బెంగళూరు : మలివిడత ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతలంతా మాటల తూటాలు పేలుస్తున్నారు. ఆది, సోమవారాల్లో ఉత్తర ప్రాంతంలోని 10 నియోజకవర్గాలను చుట్టేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మలివిడత ప్రచారానికి దాదాపు విరామం పలికినట్లే. పార్టీ వ్యూహాలు మారితే ఎన్నికల ముందు మిగిలిన నాలుగు చోట్ల పర్యటించే వీలుంది. మరోవైపు.. మూడు రోజులుగా రాష్ట్రంలోనే ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రచార రథాలను ఉరకలెత్తించారు. కల్యాణ కర్ణాటకలో పర్యటించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తమ అభ్యర్థుల కోసం ఓట్ల వేట సాగించారు.

మాటల తూటాలు

ఆదివారం నాలుగు చోట్ల సుడిగాలి పర్యటన చేసిన ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. సోమవారం బాగల్‌కోటెలోనూ ఇదే వాడిని కొనసాగించారు. కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలు దేశానికి ప్రమాదానికి సంకేతాలంటూ పదేపదే హెచ్చరించారు. ఈసారి బెంగళూరు తాగునీటి సమస్యను ప్రధానంగా ప్రస్తావించారు. హిందువులకు ప్రార్థన స్వేచ్ఛ లేదంటూ ఆరోపించారు. రాష్ట్ర సర్కారు ఆర్థిక పరిస్థితి విశ్లేషించారు. ఇక్కడ అతిపెద్ద అవినీతి వ్యవస్థ నడుస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరులోని ట్యాంకర్‌ మాఫియాను ఉటంకిస్తూ మాట్లాడారు. ఎప్పటిలాగానే అల్ప సంఖ్యాకుల రిజర్వేషన్ల గురించి మాట్లాడిన ఆయన ఎస్‌సీ, ఎస్‌టీలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు. హుబ్బళ్లిలో విద్యార్థిని హత్య, బెంగళూరు బాంబు పేలుడు, హనుమాన్‌ చాలీసా వంటి సంఘటనలను గుర్తు చేశారు. మరోసారి రాష్ట్రంలోని శాంతిభద్రతలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్‌ సర్కారుపై విమర్శలు గుప్పించారు. దేశంలో నిర్దోషులను శిక్షిస్తుంటే తాను చూస్తూ ఊరుకోనంటూ భరోసా.. తన వీడియోలను మార్ఫింగ్‌ చేస్తూ ప్రచారం చేస్తున్న అంశాలను ప్రస్తావించారు. సామాజిక మాధ్యమంలో వస్తున్న నకిలీ వీడియోల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. విజయపురతో పాటు రాష్ట్రంలో పలు విమానాశ్రయాలు కేంద్రం నిర్మించగా, జాతీయ రహదారులు, ప్రతి గ్రామానికి తాగునీటి వ్యవస్థను అందించినట్లు ప్రగతి అంశాలను ప్రస్తావించారు. దేశాన్ని కౌశల్య భారత్‌గా మార్చి ఉత్పాదన రంగంలో పరుగులు పెట్టిస్తామని భరోసా ఇచ్చారు. దేశ ప్రజల స్వప్నాలకు సంకల్పంగా మారతానని భరోసా ఇచ్చారు. ఎప్పటిలాగానే మరోసారి మోదీ సర్కారు నినాదాన్ని ప్రజలతో చెప్పించారు. ఆదివారం అర్ధరాత్రి మరణించిన ఎంపీ శ్రీనివాసప్రసాద్‌ను బాగల్‌కోటె వేదికపై స్మరించుకున్నారు. ఈ సభలో విజయపుర అభ్యర్థి రమేశ్‌ జిగజిణగి, బాగల్‌కోటె అభ్యర్థి పి.సి.గద్దేగౌడర్‌ పాల్గొనగా, రాష్ట్ర అధ్యక్షులు బి.వై.విజయేంద్ర, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తదితరులు హాజరయ్యారు.

సభావేదికపై మోదీ- యడియూరప్ప మాటామంతీ

విమర్శల హారం..

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందం కలబురగి జిల్లాలో పర్యటించగా.. పార్టీ ప్రచారంలో జోడెద్దుల్లా శ్రమిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ విజయనగర జిల్లా కూడ్లిగి, కొప్పళ్ల జిల్లా కుష్టగిని చుట్టేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సర్కారు అందించిన గ్యారంటీలు, కేంద్రంలో అధికారంలోకి వస్తే మహిళలకు ఏటా రూ.లక్షల ఆర్థిక సాయం గురించి ప్రస్తావించారు.


స్వచ్ఛభారత నాయకి!

ఈనాడు ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న ప్రధాని మోదీ కర్ణాటకలో వీధి వ్యాపారి అయిన మోహినీ గౌడ అనే మహిళతో కాసేపు ముచ్చటించారు. ఉత్తర కన్నడ జిల్లా అంకోలా బస్టాండు వద్ద మోహిని బుట్టలో పండ్లు పెట్టుకొని అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నారు. అందరిలా కవర్లలో ఇవ్వకుండా ఆకుల్లో పెట్టి ఈమె పండ్లను అమ్ముతున్నారు. పండ్లను కొన్న కొందరు ఆకులను అక్కడే పడేసి వెళ్లిపోవడం ఆమె చాలాసార్లు గమనించారు. ఎవరికో చెప్పడం ఎందుకని ఆ వ్యర్థాలను తానే సేకరించి చెత్తబుట్టలో వేయడం మొదలుపెట్టారు. పనిలో పనిగా అక్కడున్న చెట్ల నుంచి రాలిన ఆకులనూ ఊడ్చి శుభ్రం చేస్తున్నారు. ఆదర్శ్‌ హెగ్డే అనే వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఆ వీడియోను రీపోస్ట్‌ చేస్తూ మోహినిని ‘నిశ్శబ్ద హీరో’ అంటూ ప్రశంసించారు. మోహిని గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ ఆదివారం సిరసి పర్యటనలో హెలిప్యాడ్‌ వద్ద ఆమెను కలిశారు. స్వచ్ఛభారత్‌ కోసం మోహిని చేస్తున్న కృషి నేటితరానికి స్ఫూర్తిదాయకమని అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని