logo

డీజే కిల్లు..!

చింతకాని మండలం సీతంపేటలో ఈ నెల 16న జరిగిన వివాహ వేడుకకు ఖమ్మం నగరంలోని అల్లీపురానికి చెందిన పెనుగూరి రాణి(30) హాజరయ్యారు.

Updated : 26 Mar 2023 05:07 IST

* చింతకాని మండలం సీతంపేటలో ఈ నెల 16న జరిగిన వివాహ వేడుకకు ఖమ్మం నగరంలోని అల్లీపురానికి చెందిన పెనుగూరి రాణి(30) హాజరయ్యారు. పెళ్లి కొడుకుతో తిరిగి ఇంటికొస్తూ అల్లీపురంలో జరిగిన ఊరేగింపులో ఉత్సాహంగా నృత్యం చేశారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. డీజే శబ్దాల ధాటికి ఆమె బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైనట్లు వైద్యులు గుర్తించారు.

* రెండేళ్ల క్రితం తన బాబాయి పెళ్లి బారాత్‌లో నృత్యం చేస్తూ కామేపల్లి మండలం ముచ్చర్లకు చెందిన ఓ ఇంటర్‌ విద్యార్థిని కుప్పకూలింది. కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతిచెందింది. చిన్నతనంలో ఆ బాలిక హృద్రోగంతో బాధపడగా.. శస్త్రచికిత్సలూ చేయించారు. వేడుక వేళ డీజే శబ్దాలకు తోడు బాగా అలసిపోవడంతో గుండె విఫలమై ఉండొచ్చని వైద్యులు నిర్ధారించారు.

లయబద్ధంగా పనిచేసే గుప్పెడు గుండెకు శ్రుతి మించుతున్న శబ్దాల మోత సంకటంగా మారుతోంది. వివాహ వేడుకలు, శుభకార్యాలు, ఆఖరికి దేవుడి ఊరేగింపుల్లోనూ కొందరు డీజేల మోత మోగిస్తున్నారు. భారత కార్మిక పరిశ్రమ మంత్రిత్వ శాఖ చట్టం నిబంధనలు ఉభయ జిల్లాల్లో మృగ్యమవుతున్నాయి. ఫలితంగా మనుషుల ప్రాణాలు శబ్ద తరంగాల్లో కలిసిపోతున్నాయి.

కొత్తగూడెం వైద్యవిభాగం, ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే


పరిమితి మించితే ప్రమాదమే
డాక్టర్‌ రామ్మూర్తి, ఈఎన్‌టీ నిపుణుడు, ఖమ్మం

శబ్దం తీవ్రత 80 డెసిబుల్స్‌ కంటే తక్కువుంటే చెవికి మేలు. 130 డెసిబుల్స్‌ వరకు డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లే. 130 డెసిబుల్స్‌కు మించితే అప్పటికప్పుడే వినికిడి శక్తి కోల్పోతారు. డీజే సౌండ్‌ ప్రారంభ దశలోనే 100 డెసిబుల్స్‌ ఉంటుంది. చరవాణి హెడ్‌ఫోన్లను వినియోగించేటపుడు గరిష్ఠ వాల్యూమ్‌ 60శాతానికి మించొద్దు. అధిక శబ్దాన్ని తట్టుకోలేని వారికి గుండె దడ వస్తుంది. తీవ్రమైన ఒత్తిడి పెరిగి ప్రాణాపాయ స్థితి నెలకొంటుంది.


ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

* ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు, శుభకార్యాల్లో డీజేలకు అనుమతులను నిషేధించాలి.
* నివాసిత ప్రాంతాలు, వ్యాపార సముదాయాల్లో శబ్ద వినికిడి సామర్థ్యాన్ని నిబంధనల మేరకు అధికారులు అమలుచేయాలి.
* పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు అవసరమైతే ఇయర్‌ మార్క్స్‌, బడ్స్‌ వాడాలి.
* గుండె సంబంధిత సమస్యలున్న వారు డీజే శబ్దాలున్న ప్రదేశాలకు వెళ్లొద్దు.
* అసౌకర్యాన్ని కలిగించే శబ్దాలు వినిపించకుండా చెవుల్లో బడ్స్‌, దూది లాంటివి పెట్టుకోవాలి.


స్ట్రెస్‌ హార్మోన్ల పెరుగుదలతో గుండెపోటు
డాక్టర్‌ పుష్పలత, జనరల్‌ ఫిజీషియన్‌ (ఎండీ), కొత్తగూడెం

ఓ వ్యక్తి ఉలిక్కి పడేలా దేన్నైనా వింటే గుండె లయ తప్పుతుంది. దీన్నే టసాస్టిక్‌ ట్రామా అంటారు. ఆసమయంలో మెదడులో స్ట్రెస్‌ హార్మోన్స్‌ పెరుగుతాయి. ఆ భయానికి గుండెపోటు వస్తుంది. సాధారణ వ్యక్తుల కంటే హృదయ సంబంధిత సమస్యలున్న వారికి డీజే శబ్దాల వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువ.


నిబంధనలు అతిక్రమిస్తే కేసులు: వినీత్‌, ఎస్పీ

జిల్లా వ్యాప్తంగా డీజేల ఏర్పాటుకు అనుమతులివ్వడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వాడితే కేసులు నమోదు చేస్తాం. శుభకార్యాలు, ఇతర వేడుకల్లో సాధారణ డెసిబుల్స్‌ శబ్దం వినిపించే మైకులు వినియోగించాలి.


ప్రభుత్వ నిబంధనల ప్రకారం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని