logo

మూడు నెలలు ముహూర్తాలే లేవు!

రానున్న మూడు నెలల పాటు శుభ ముహూర్తాలు లేవని వేద పండితులు చెబుతున్నారు. మూఢాల కారణంగా వివాహాది శుభకార్యాలు, నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు, శంకుస్థాపనలు వంటి శుభ కార్యక్రమాలను జరపడం కుదరదని చెబుతున్నారు.

Updated : 29 Apr 2024 07:22 IST

ఖమ్మం సాంస్కృతికం, న్యూస్‌టుడే: రానున్న మూడు నెలల పాటు శుభ ముహూర్తాలు లేవని వేద పండితులు చెబుతున్నారు. మూఢాల కారణంగా వివాహాది శుభకార్యాలు, నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు, శంకుస్థాపనలు వంటి శుభ కార్యక్రమాలను జరపడం కుదరదని చెబుతున్నారు. ఈనెల 29 నుంచి మూడు నెలల పాటు వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో గురు, శుక్ర మౌఢ్యమి వల్ల ముహూర్తాలు లేవు. మౌఢ్యమి అంటే సూర్యుని కాంతి గురు గ్రహంపై పడినప్పుడు గురు మౌఢ్యమి, శుక్ర గ్రహంపై పడినప్పుడు శుక్ర మౌఢ్యమి సంక్రమిస్తుందని, దీని వల్ల ఆయా గ్రహాల గమనం తెలియకపోవడం వల్ల శుభ ముహూర్తాలు పెట్టడం కుదరని పండితులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్ర పౌఢ్యమి ఈనెల 28 చైత్ర బహుళ చవితి ఆదివారం నుంచి జులై 8 ఆషాఢ శుద్ధ తదియ సోమవారం వరకు, గురు పౌఢ్యమి మే 7 చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం నుంచి జూన్‌ 7 జ్యేష్ఠ శుక్ల పాడ్యమి గురువారం వరకు కొనసాగుతాయని తెలిపారు. జులై 6 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ఆషాఢ మాసం ఉండటంతో వివాహాది శుభకార్యాలు చేయకూడదని స్పష్టం చేశారు. గురు, శుక్ర మూఢాల్లో నూతన శుభకార్యక్రమాలు చేయడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు.

మూగబోనున్న భాజాభజంత్రీలు

వేసవి కాలం వచ్చిందంటే సాధారణంగా వివాహాది శుభకార్యాల సందడి ఎక్కువగా ఉంటుంది. మే, జూన్‌, జులై నెలలతో పాటు ఆగస్టు 4వ తేదీ వరకు మూఢాల కారణంగా శుభ ముహూర్తాలు లేకపోవడంతో వివాహాలు, పూలుపండ్లు వంటివి చేసుకునే అవకాశం లేదు. దీంతో భాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాల చప్పుళ్లు, డీజే శబ్దాలు వంటి సందడి కన్పించదు. దీంతో వేద పురోహితులతో పాటు వ్యాపార వర్గాలు సైతం ఉపాధిని కోల్పోయే అవకాశం ఉంది. నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాల కొనుగోళ్లు, మేళతాళాల బృందాలు, ఫంక్షన్‌ హాళ్లు, ఇతర వివాహాలకు సంబంధించిన కొనుగోళ్లు మందగించిపోనున్నాయి.


గురు, శుక్ర మౌఢ్యమిలే కారణం...

ఆమంచి సురేశ్‌శర్మ, వేద పండితులు, ఖమ్మం

ఈ నెల 29 నుంచి మూడు నెలల పాటు శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. గురు, శుక్ర మౌఢ్యమి కారణంగా గ్రహాల గమనం తెలియకపోవడం వల్ల శుభ ముహూర్తాలు పెట్టే అవకాశం ఉండదు. వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో మంచి ముహూర్తాలు లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని