logo

‘పశ్చిమ’ రైతుకు జగన్‌ ఉరి

నిత్యం కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రాంత పల్లెలను సస్యశ్యామలం చేసేందుకు 2003లో తెదేపా ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి బీవీ మోహన్‌రెడ్డి రూ.177 కోట్లతో గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.

Updated : 28 Apr 2024 03:04 IST

గురురాఘవేంద్రకు నిధులివ్వని ప్రభుత్వం
‘ఎత్తిపోయిన’ పథకాలు
న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు, కర్నూలు జలమండలి


తెదేపా తెచ్చింది

నిత్యం కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రాంత పల్లెలను సస్యశ్యామలం చేసేందుకు 2003లో తెదేపా ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి బీవీ మోహన్‌రెడ్డి రూ.177 కోట్లతో గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వృథాగా పోతున్న జలాలను 11 ఎత్తిపోతల పథకాలతోపాటూ సూగూరు జలాశయం ద్వారా నీటిని తోడి ఆయకట్టుకు పారించడం దీని ప్రధాన లక్ష్యం.

వైకాపా ఎండబెట్టింది

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు, నిర్వహణకు బిల్లులు మంజూరు చేయడం లేదు.. అడిగితే అరకొరగా కేటాయిస్తున్నారు.. నిర్వహణ లేక మోటార్లు మూలన పడ్డాయి. పొలాలకు నీళ్లు అందకపోవడంతో గత ఐదేళ్లలో ఆయకట్టు రైతులు రూ.350 కోట్ల వరకు నష్టపోయారు.


మూడు నియోజకవర్గాలు
45,790 ఎకరాలు

గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు ద్వారా 5.373 టీఎంసీల తుంగభద్ర వరద జలాల(5.373 టీఎంసీలు)ను ఎత్తిపోసి 45,790 ఎకరాలకు సాగునీరు అందించాలి. కోసిగి, మంత్రాలయం, నందవరం, ఎమ్మిగనూరు, పెద్దకడబూరు, కోడుమూరు, సి.బెళగల్‌, కల్లూరు, గూడూరు మండలాల పరిధిలోని ఎల్లెల్సీ ఆయకట్టు పరిధిలో సాగునీరందించాలి. ఈ నేపథ్యంలో మూగలదొడ్డి, పూలచింత, చిలకలడొణ, సోగనూరు, కృష్ణదొడ్డి, రేమట, మునగాల, చింతమాన్‌పల్లె, దుద్ది, మాధవరం, బసలదొడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మించారు. నదీలో నీళ్లు ఉన్న సమయంతోపాటు పొలాలకు నీటిని తరలించాలి.

కేటాయింపులకే పరిమితం

విద్యుత్తు సమస్యతోపాటు, బిల్లుల బకాయిలపై జగన్‌ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదు. నిర్వహణ లేక విద్యుత్తు మోటార్లు సక్రమంగా పని చేయడం లేదు. సుమారు రూ.150 కోట్ల విద్యుత్తు బకాయిలు ఉన్నాయని 2023లో ఎమ్మిగనూరు గురురాఘవేంద్ర ప్రాజెక్టు కార్యాలయాలకు కరెంటు నిలిపివేశారు. ప్రాజెక్టు నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తదితర ప్రజాప్రతినిధులు నేరుగా ఐఏబీ సమావేశంలో నిధుల కోసం గొడవ పడ్డారు. దీంతో గురురాఘవేంద్ర ప్రాజెక్టు నిర్వహణకు గతేడాది అరకొరగా రూ.15 కోట్లు నుంచి రూ.20 కోట్ల వరకు నిధులు కేటాయించినట్లు అధికారులు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఈ నిధులు విడుదలైంది లేదు.

చుక్కనీరు రాలేదు  - తిక్కన్న, మాచాపురం

నాకు చిలకలడొణ ఎత్తిపోతల పథకం కింద ఐదెకరాల పొలం ఉంది. ఐదేళ్లలో పంట చేతికొచ్చే సమయానికి పంట దిగుబడులకు సాగునీరు పారడం లేదు. ఏటా నష్టపోతున్నాం. పంట దిగుబడి వచ్చే సమయానికి నీళ్లు సరిగా రావు. పంపుహౌస్‌లో నీళ్లు సరిగా ఎత్తిపోయడం లేదు. ఐదేళ్లలో సాగునీరు సక్రమంగా రాకపోవడంతో సుమారు రూ.15 లక్షలకుపైగా నష్టపోయాను.

ఏడు వేల ఎకరాలు ప్రశ్నార్థకం

ఎమ్మిగనూరు పరిధిలో పూలచింత, చిలకలడొణ, సోగనూరు ఎత్తిపోతల పథకాల ద్వారా 13,131 ఎకరాలకు సాగునీరు పారించాలి. ఇందుకు రూ.45.89 కోట్లు ఖర్చు చేశారు. వీటికి రెండుచోట్ల పంప్‌హౌస్‌ ద్వారా నీటిని తోడేస్తున్నారు. ఇక్కడ విద్యుత్తు సరఫరా సక్రమంగా ఉండదు. మోటార్లు కాలిపోతే రూ.లక్షలు ఖర్చును రైతులు భరించాల్సి వస్తోంది.

ఐదేళ్లలో అరకొరగా నిధులు విడుదల చేయడంతో రైతులు మూడు ఎత్తిపోతల పథకాల పరిధిలో సుమారు రూ.35 లక్షలు సొంతంగా వసూళ్లు చేసుకుని ఖర్చు పెట్టుకున్నారు. దీని పరిధిలో సుమారు 7 వేల ఎకరాలకు సాగునీరందడం లేదు. ఐదేళ్లలో రూ.250 కోట్లకుపైగా రైతులు నష్టపోయారు. మూడింటిలో పూలచింత ఎత్తిపోతలకు నిర్మించిన రాతి కట్ట కిందకు జారిపోయింది. కాల్వలో నీరు వచ్చిన జలచౌర్యం చేస్తున్నారు. కట్ట పొడవునా ముళ్లపొదలు నిండిపోయాయి. సోగనూరు ఎత్తిపోతల పథకం ద్వారా అరకొరగా నీటిని పంపింగ్‌ చేస్తారు.  పంప్‌హౌస్‌ వద్ద రాతి మట్టికట్ట సక్రమంగా నిర్మించలేదు. కాలువలు తీయకపోవడంతో చెరువులోకి నీరు పారడం లేదు. కట్ట కింది భాగంలో రాళ్లు ఊడి నీటిలో కలిశాయి. రాతికట్ట పొడవునా ముళ్ల పొదలతో నిండిపోయాయి.

రైతులకు రూ.550 కోట్ల నష్టం

మంత్రాలయం పరిధిలో దుద్ది, మూగలదొడ్డి, సూగూరు, బసలదొడ్డి, మాధవరం పథకాల కింద 35,065 ఎకరాల ఆయకట్టు సాగునీరు పారించాలి. ఇందుకు అప్పట్లో గత ప్రభుత్వం రూ.70 కోట్లు ఖర్చు పెట్టింది. వీటి ఎత్తిపోతల పథకాల నిర్వహణ అధ్వానంగా ఉంది. విద్యుత్తు బిల్లులు, మోటార్లు కాలిపోవడం, పథకాల్లో నిండిపోయిన ముళ్లపొదలు, రాతిపరుపు కుంగిపోవడం వంటి సమస్యలతో సాగునీరు అందడం లేదు. ఐదేళ్లలో రైతులు సుమారు రూ.350 కోట్లకుపైగా నష్టపోయారు. మాధవరం, దుద్ది, బసలదొడ్డి ఎత్తిపోతల పథకాలకు నిధులు విడుదల చేయకపోవడంతో కొన్ని నెలలుగా సాగునీటిని ఎత్తిపోయక చెరువులు వెలవెలబోయాయి.

కోడుమూరు పరిధిలో చింతమాన్‌పల్లె, రేమట, మునగాల, కృష్ణదొడ్డి ఎత్తిపోతల పథకాల్ని రూ.56 కోట్లతో నిర్మించి 16,080 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పారించాలన్నది లక్ష్యం. వీటి పరిధిలో ఎత్తిపోతల పథకంలో భాగంగా మోటార్ల మరమ్మతులు, పూడికతో నిండిన కాలువలు, పథకం నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడంతో సాగునీరు సక్రమంగా పారడం లేదు. 7 వేల ఆయకట్టుకు సాగునీరు పారక రూ.200 కోట్లకుపైగా నష్టపోతున్నారు.

పనిచేయని మోటార్లు
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని