logo

సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధిచెబుదాం: బీసీ

సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధిచెప్పి ఇంటికి పంపిద్దామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని పెండేకంటి నగర్‌, శివనందినగర్‌లో ‘ప్రజాగళం’లో భాగంగా రాష్ట్ర కార్యదర్శి కాటసాని చంద్రశేఖరరెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు.

Published : 29 Apr 2024 02:32 IST

సూపర్‌ సిక్స్‌ పథకాల కరపత్రాలను ఇస్తున్న జనార్దన్‌రెడ్డి, పక్కన రాష్ట్ర కార్యదర్శి కాటసాని

బనగానపల్లి, న్యూస్‌టుడే: సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధిచెప్పి ఇంటికి పంపిద్దామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని పెండేకంటి నగర్‌, శివనందినగర్‌లో ‘ప్రజాగళం’లో భాగంగా రాష్ట్ర కార్యదర్శి కాటసాని చంద్రశేఖరరెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. బీసీ మాట్లాడుతూ ఐదేళ్ల పాటు అబద్ధాలు చెప్పి వైకాపా పాలన సాగించిందని అన్నారు. మద్యం వ్యాపారంతో జగన్‌మోహన్‌రెడ్డి అక్రమంగా రూ.కోట్లు సంపాదించారని అన్నారు. అంతకుముందు జగనాసుర రక్త చరిత్ర చార్జ్‌షీట్‌ను విడుదల చేశారు. వంగల పరమేశ్వరరెడ్డి, కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, టంగుటూరి శీనయ్య, రాయలసీమ సలాం, కలాం, బురానుద్దీన్‌, ఖాసీంబాబు, అల్తాప్‌, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

నిద్రపోయే ఎమ్మెల్యే కావాలా..ఆలోచించండి

Ëఓబులంపల్లె(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: నిద్రపోయే ఎమ్మెల్యే కావాలా...ప్రశాంతంగా ప్రజలు నిద్రపోయేలా చేసే ఎమ్మెల్యే కావాలో ఆలోచించాలని ఆళ్లగడ్డ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియ అన్నారు. మండలంలోని ఓబులంపల్లె, యాదవాడ, మిట్టపల్లె, బాచేపల్లె గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కిరాణా, కూరగాయల దుకాణాల వద్ద ధరల బోర్డు ఉన్నట్లు...ఎమ్మెల్యే ఇంటి వద్ద పంచాయతీలు చేయడానికి ధరల బోర్డు పెట్టారని ఆమె ఆరోపించారు. దంపతుల మధ్య పంచాయతీకి ఓ రేటు, రైతులకు నీరు వదలడానికి, చెరువులు నింపడానికి..ఇలా ప్రతి దానికీ రేట్లు నిర్ణయించి దోచుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో భార్గవ్‌రామ్‌నాయుడు, సి.పి శ్రీనివాసరెడ్డి, ఇరిగెల రాంపుల్లారెడ్డి, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

దోచుకునేందుకే 30 ఏళ్ల అనుభవం

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే : సహజ వనరులు, ప్రభుత్వ, ప్రజల ఆస్తులను దోచుకుని, దాచుకునేందుకే 30 ఏళ్ల అనుభవం సరిపోయిందని పాణ్యం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని కొణిదేడు, కందికాయపల్లె, పాణ్యం గ్రామాల్లో ఆదివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను ప్రజలు తట్టుకోలేక వైకాపాను ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఆక్రమనలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. ప్రభుత్వ పాఠశాల మైదానాన్ని ఆక్రమించి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో భాజపా నాయకుడు అభిరుచి మధు, జనసేన నాయకుడు జగదీశ్‌, తెదేపా మండల మాజీ అధ్యక్షుడు రాంపుల్లారెడ్డి, నాయకులు బాలసుబ్బయ్య, సుభాన్‌, రమణమూర్తి, ఎంపీటీసీ సభ్యుడు రంగా రమేష్‌, తిరుపాలు, గుజ్జల సుబ్బయ్య, ఈశ్వర్‌, నారాయణ, జయరామిరెడ్డి, లాయర్‌బాబు, అమరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పాలకమండళ్లలో వీరశైవుల నియామకానికి కృషి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : తెదేపాను గెలిపిస్తే శ్రీశైలం, మహానందితో పాటు వివిధ శైవక్షేత్రాల పాలకమండళ్ల ఛైర్మన్లుగా, బోర్డు సభ్యులుగా వీరశైవులను నియమించేలా చంద్రబాబుతో మాట్లాడి ఒప్పిస్తామని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి హామీ ఇచ్చారు. నంద్యాల పట్టణంలో వీరశైవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం వీరశైవులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా నంద్యాల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్‌ఎండీ ఫరూక్‌ మాట్లాడుతూ.. తమ కుటుంబానికి మొదటి నుంచి వెన్నంటి ఉంటున్న వీరశైవుల సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పారు. తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌, రాష్ట్ర కార్యదర్శులు తులసిరెడ్డి, ఏవీఆర్‌ ప్రసాద్‌, తెదేపా పట్టణ అధ్యక్షుడు మనియార్‌ ఖలీల్‌, వీరశైవ ఐక్యవేదిక నాయకులు ఎస్వీ శివరాజు, మల్లికార్జునప్ప, ఐక్య వేదిక అధ్యక్షుడు చంద్రశేఖరప్ప, ప్రధాన కార్యదర్శి శెట్టి వీరశేఖరప్ప, నాయకులు నాగరాజు, ప్రసాద్‌, మల్లికార్జున, కిశోర్‌, శ్రీనివాసులు, మల్లప్ప, చందు తదితరులు పాల్గొన్నారు.

జగన్‌ విధ్వంస పాలనకు చరమగీతం పాడుదాం

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే : వైకాపా విధ్వంస పాలనకు చరమగీతం పాడుదామని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, నంద్యాల పార్లమెంటు తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు.  వెలుగోడులో ఆదివారం వారు రోడ్‌షో, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారన్నారని వివరించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్‌ ఆ హామీని నెరవేర్చకపోగా రాష్ట్రంలో జే బాండ్ల తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నారన్నారు. జగన్‌ ముఠా సంపదను దోచుకోని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. మళ్లీ రాష్ట్రాభివృద్ధి జరగాలంటే ఈ ఎన్నికలలో తెదేపాను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అన్నారపు శేషిరెడ్డి, ఖళీలుల్లాఖాన్‌, కలాం, రాంనాయుడు, అమీర్‌హంజా, రఘుస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతుబిడ్డగా రైతుల కష్టాలు తెలుసు

డోన్‌, న్యూస్‌టుడే: కేంద్ర సహాయ మంత్రిగా పని చేసినా...తండ్రి ముఖ్యమంత్రిగా పని చేసినా...తనకు రైతుబిడ్డగా చెప్పుకోవడమే ఇష్టమని నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన డోన్‌ మండలంలోని మల్లెంపల్లెలో కాడిపట్టి అరకదున్ని మాట్లాడారు. రైతుబిడ్డగా తనకు రైతుల కష్టాలు తెలుసునని, రాజకీయాల్లో నీతి నిజాయతీ కోసం పాటు పడ్డామన్నారు. తనకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టమని, ఎన్నికల్లో తనను గెలిపిస్తే డోన్‌ నియోజకవర్గంలో రైతుల కష్టాలు తీర్చేందుకు పాటుపడతానని ఆయన పేర్కొన్నారు.

మంత్రి బుగ్గనకు ఓటమి భయం పుట్టించాం: కోట్ల

డోన్‌, న్యూస్‌టుడే: డోన్‌లో మంత్రి బుగ్గనకు ఇప్పటికే ఓటమి భయాన్ని పుట్టించామని, ఆయన ఓటమి ఖాయమని కేంద్ర మాజీ మంత్రి కోట్లసూర్యప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని దొరపల్లె, లక్ష్ముపల్లె, మల్లెంపల్లె, బొంతిరాళ్ల గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించి మాట్లాడారు. డోన్‌ నియోజకవర్గంలో కోట్ల, కేఈ కుటుంబాలు ఎంతో అభివృద్ధి చేశాయని, కానీ మంత్రి బుగ్గన తానే అభివృద్ధి చేసినట్లు గొప్పలు చెబుతూ గ్రామాల్లో బోర్డులు వేయించి ప్రచారం చేసుకుంటున్నారన్నారు.. తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరం సుబ్బారెడ్డి, రాష్ట్రకార్యదర్శి వలసల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని