logo

విలీనం చేసి.. జగన్‌ నిలువునా ముంచి

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైతే ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లభిస్తుంది. అవసరమైన సదుపాయాలు సమకూరుతాయి. 

Published : 29 Apr 2024 02:40 IST

ప్రయోజనాలు కోల్పోయిన ఆర్టీసీ ఉద్యోగులు
బకాయిల చెల్లింపులోనూ నిర్లక్ష్యం

కర్నూలులో ఆందోళన చేస్తున్న కార్మికులు (పాత చిత్రం)

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైతే ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లభిస్తుంది. అవసరమైన సదుపాయాలు సమకూరుతాయి. 

ముఖ్యమంత్రి చెప్పిన మాటలు..

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : ఆర్టీసీ సంస్థ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. విలీనానికి ముందు కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు ఉండేవి. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారమయ్యేవి. విలీనం తర్వాత ఆర్థిక ప్రయోజనాలు ఆగిపోయాయి. జీతాలు సైతం సరిగా రాని పరిస్థితి ఏర్పడింది. చివరికి బకాయిల కోసం కార్మికులు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి మాటలు నమ్మి మోసపోయామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12 బస్సు డిపోలు ఉన్నాయి. 975 బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రతిరోజూ సుమారు 3 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సాగిస్తుంటారు. వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం విలీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. మేలు జరుగుతుందని భావించారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసిన తర్వాత ఉద్యోగులు, కార్మికులకు కష్టాలు తెలిసొచ్చాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేసినా ప్రయోజనం లేకపోయింది.

25 శాతం ఇచ్చి..

ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం వేతన సవరణ చేపట్టింది. ఇప్పటివరకు బకాయిలు పూర్తి చెల్లించకపోవడం గమనార్హం. ఒకేసారి చెల్లించలేమని.. నాలుగు విడతల్లో ఇస్తామని పేర్కొంది. మొదటి విడతతో 25 శాతం చెల్లింపులు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో సుమారు 3,500 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా కేవలం రూ.కోటి మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. ఇంకనూ రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు రావాల్సి ఉందని యూనియన్‌ నాయకులు పేర్కొంటున్నారు. కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడుతున్నారు.

  • కర్నూలు-1, కర్నూలు-2 నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, డోన్‌, కోవెలకుంట్ల, బనగానపల్లి, ఆళ్లగడ్డ, ఆత్మకూరు తదితర డిపోలకు చెందిన కార్మికులకు లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ రాక ఇబ్బందులు పడుతున్నారు.

భత్యాలు కనుమరుగు

2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు పలు ప్రతిపాదనలు పెట్టింది. విలీనమైతే ఎన్నో ప్రయోజనాలు వస్తాయని ఆశలు రేకెత్తించింది. ఇందులో భాగంగా 2020 జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రజారవాణా సంస్థగా మార్చి విలీనం చేసుకుంది. అప్పటినుంచి కార్మికులకు కష్టాలు అధికమయ్యాయి. ప్రభుత్వంలో విలీనం కాకముందు గ్యారేజీ ఉద్యోగులకు రాత్రి భత్యం, డీజిల్‌ పొదుపు చేసే కార్మికులకు ప్రతి నెలా ప్రోత్సాహకాలను అందరి సమక్షంలో అందించేవారు. అదనపు విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు అదనపు జీతం, గ్యారేజీలో పనిచేసేవారికి ప్రత్యేక అలవెన్స్‌, సాంకేతిక వేతనం, మహిళా కండక్టర్ల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక నిధులు మంజూరయ్యేవి. ప్రస్తుతం ఇవేమీ వర్తించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • గతంలో ప్రతి రెండేళ్లకోసారి కండక్టర్లు, డ్రైవర్లకు మూడు జతల ఖాకీ దుస్తులు ఇచ్చేవారు. దీంతోపాటు పాదరక్షల కోసం సంస్థ రూ.వెయ్యి ఇచ్చేది. విలీనం తర్వాత గ్యారేజీ కార్మికులు, ఉద్యోగులు తమ సొంత డబ్బులతో బూట్లు, ఖాకీ దుస్తులు కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది.
  • బస్సులు దూర ప్రాంతాలకు వెళ్లి మధ్యలో ఆగిపోతే వాటికి మరమ్మతులు చేయించేందుకు.. గ్యారేజీ నుంచి బస్సు మొరాయించిన ప్రదేశానికి వెళ్లేందుకు మెకానిక్‌లకు డబ్బులు ఇచ్చేవారు. వారి సమయానికంటే ఎక్కువగా పనిచేస్తే ఓటీ వచ్చేది. ప్రస్తుతం ఇవేమీ మంజూరు కావడం లేదు.

కేసుల పరిష్కారమెప్పుడో..

ఆర్టీసీ కార్మికులకు సంబంధించి వందల సంఖ్యలో కేసులు పెండింగ్‌ ఉన్నాయి. విధి నిర్వహణలో లోపాలు ఉన్న సమయంలో అధికారులు కేసులు నమోదు చేసేవారు. విలీనం కాకముందే డిపోలో ఉండే కార్మికుల కేసులు డిపో మేనేజర్‌స్థాయిలో పరిష్కారం అయ్యేవి. అక్కడ పరిష్కారంకాకుంటే డిప్యూటీ చీప్‌ మెకానికల్‌ ఇంజినీరు/డిప్యూటీ ట్రాఫిక్‌ మేనేజర్‌స్థాయిలో పరిష్కరించేవారు. రీజినల్‌ మేనేజర్‌దే తుది నిర్ణయం. 2020 తర్వాత పరిస్థితి దయనీయంగా మారింది. ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియని పరిస్థితి.

ఆరోగ్య సేవలు అంతంతే..

ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు వైద్యసేవలు అందించేందుకుగాను ఆర్టీసీ డిస్పెన్సరీ ఏర్పాటుచేశారు. ఇక్కడ అవసరమైనవారికి వైద్యసేవలు అందిస్తారు. ఆరోగ్య పరిస్థితులను బట్టి అక్కడ వైద్యుల సిఫారసు మేరకు కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరితే వైద్యానికయ్యే ఖర్చు మొత్త ఆర్టీసీ సంస్థ భరించేది. ఉద్యోగి తమ గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోయేది. విలీనం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంతో కష్టాలు ఎదురయ్యాయి. ఏటా ప్రభుత్వానికి రూ.1,200 చెల్లించినా పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని