logo

జలం తీసుకొస్తాం.. జనాలను బాగు చేస్తాం

పశ్చిమ ప్రాంతం పూర్తిగా వెనుకబడింది.. మంత్రాలయం నియోజకవర్గంలో వలసలు ఎక్కువ.. అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా.. వలసలకు అడ్డుకట్ట వేస్తామని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

Published : 29 Apr 2024 02:55 IST

ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది
ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు

మంత్రాలయం గ్రామీణం, కోసిగి, పెద్దకడబూరు, మంత్రాలయం గ్రామీణం, పెద్దకడుబూరు, కోసిగి, న్యూస్‌టుడే: పశ్చిమ ప్రాంతం పూర్తిగా వెనుకబడింది.. మంత్రాలయం నియోజకవర్గంలో వలసలు ఎక్కువ.. అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా.. వలసలకు అడ్డుకట్ట వేస్తామని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం, కోడుమూరు నియోజకవర్గం గూడూరులో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు.. సభలకు జనం పోటెత్తారు.. గూడూరు పసుపుమయంగా మారింది. చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నంతసేపు సభలో చప్పట్లు మార్మోగాయి. మంత్రాలయంలో మార్పు వస్తోంది.. నియోజకవర్గానికి మంచి రోజులు రాబోతున్నాయి. గురురాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో రాష్ట్రానికి మంచి జరగాలన్నారు. ఖాదర్లింగ స్వామి, ఉరుకుంద ఈరన్న స్వామి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి.. గతంలో దేవాలయానికి రూ.8.50 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేశాం. సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించడానికి జనమంతా సిద్ధంగా ఉన్నారు.. తెదేపా సమావేశాలకు జనం పోటెత్తుతోంది.. జగన్‌ మీటింగ్‌లు వెలవెలబోతున్నాయి. దీనినిబట్టి గెలుపు కూటమిదేనని అర్థమవుతోందని చంద్రబాబు అన్నారు. కూటమితోనే అభివృద్ధి సాధ్యమన్నారు. జగన్‌ మాట్లాడితే క్లాస్‌వార్‌ అంటుంటారు.. జగన్‌ ప్యాలెస్‌ కొల్లగొడితేనే... పేదల పొట్ట నిండుతుందన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు రూ.200 వచ్చే విద్యుత్తు బిల్లు ప్రస్తుతం రూ.వెయ్యికి పెరిగిందన్నారు.  సైకో ముఖ్యమంత్రిని తరమికొట్టాలని పిలుపునిచ్చారు. గతంలో తెదేపా అధికారంలోకి ఉండగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు చేసిన అభివృద్ధి.. అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలను వివరించారు. తిక్కారెడ్డి మంచి మిత్రుడు, పార్టీకి బాగా పని చేసిన వ్యక్తి అని ప్రశంసించారు. కర్నూలు పార్లమెంట్‌ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, మంత్రాలయం, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థులు రాఘవేంద్రరెడ్డి, బొగ్గుల దస్తగిరి, సీనియర్‌ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి  పాల్గొన్నారు.

గూడూరులో మాట్లాడుతున్న తెదేపా అధినేత చంద్రబాబు, వేదికపై కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, కర్నూలు పార్లమెంట్‌ అభ్యర్థి బస్తిపాటి నాగారాజు,  సీనియర్‌ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు

కౌతాళంలో వంద పడకల ఆసుపత్రి

కౌతాళంలో వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని సభలో నిర్మిస్తాం.. గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకాలన్నింటినీ బాగు చేస్తాం.. ప్రగతిలో కౌతాళానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.

సామాజిక న్యాయాన్ని  గెలిపించాలి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనాభా ప్రాతిపదికన టికెట్లు కేటాయించాం.. కురుబలకు, బోయలకు పెద్దపీట వేశాం.. సామాజిక న్యాయాన్ని గెలిపించాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. కురవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, సాధారణ ఎంపీటీసీ సభ్యుడు నాగరాజును కర్నూలు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాం.. పార్లమెంట్‌ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నాం. మంత్రాలయంలో బోయ వర్గానికి చెందిన రాఘవేంద్రరెడ్డి, ఆదోనిలో వాల్మికి సామాజిక వర్గానికి చెందిన వైద్యుడు డా.పార్థసారథి, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో ఈడిగ కులస్థులు వీరభద్రగౌడ్‌, కేఈ శ్యాంబాబులకు అవకాశం ఇచ్చాం. కోడుమూరులో మాదిగ సామాజిక వర్గానికి చెందిన బొగ్గుల దస్తగిరిని బరిలో దింపాం. కర్నూలులో ఆర్య వైశ్యుడు టీజీ భరత్‌, నంద్యాలలో ముస్లిం వర్గానికి చెందిన ఫరూక్‌కు ఇచ్చాం. ఇది కదా నిజమైన సామాజిక న్యాయమన్నారు.

తుంగభద్రను కొల్లగొట్టారు

ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాలను అన్నదమ్ములు సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డిలు దోచుకుంటున్నారు.. పక్కనే తుంగభద్ర ఉన్నా.. తాగడానికి నీళ్లు లేవు. ఆ ఏటిని ఇసుక మాఫియా దోచుకుంటోంది. నదిలో ఇసుక దొంగిలించిన బాలనాగిరెడ్డి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా? ఒక్క కి.మీ. రోడ్డు వేశారా? ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించారా? బడుగు జీవుల రక్తం తాగే దుర్మార్గులు బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అని ధ్వజమెత్తారు. ఓట్లు మీవి దోపిడీ వాళ్లదని ఎండగట్టారు.

రాష్ట్రాభివృద్ధి కోసమే పొత్తులు

రాష్ట్రాభివృద్ధి కోసమే భాజపా, జనసేనతో పొత్తు పెట్టుకున్నాం... మూడు పార్టీలు త్యాగం చేశాయి.. మైనార్టీ రిజర్వేషన్లు తీసేస్తామని సైకో జగన్‌ విష ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మైనార్టీల రిజర్వేషన్లు తొలగించం.. వైకాపా అరాచకాలతో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది.. వేతనాలు పెంచాలంటే అంగన్‌వాడీ కార్యకర్తలపై దౌర్జన్యాలు దిగారు. ఉద్యోగులు వేతనాలు పెంచాల్సింది పోయి తగ్గించారన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే యువతలో నైపుణ్య గణన చేపడతామన్నారు.

బాలనాగిరెడ్డిని ఇంటికి పంపించాలి

తిక్కారెడ్డి, కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు  

మంత్రాలయం నియోజకవర్గానికి 15 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉండి తాగు, సాగునీరు అందించని బాలనాగిరెడ్డిని ఇంటికి సాగనంపుదాం. తాగు,సాగునీరు అందించడంలో ఘోరంగా విఫలమయ్యారు.

బీసీలకు పెద్దపీట

బస్తిపాటి నాగరాజు, కర్నూలు ఎంపీ అభ్యర్థి  

రాష్ట్రంలో తెదేపా అధినేత చంద్రబాబు బీసీలకు పెద్ద పీట వేశారు. వలసల సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాం. తెదేపా అధికారంలో రాగానే వలసలు పూర్తిగా నివారిస్తాం. పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం.

వలసల నివారణకు కృషి

రాఘవేంద్రరెడ్డి, మంత్రాలయం అభ్యర్థి  

కూటమి అభ్యర్థిగా నన్ను ఆదరిస్తే మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. పాడైన రహదారులపై దృష్టి సారిస్తా. తాగు, సాగునీటి కోసం కృషి చేస్తా. వలసల సమస్య చంద్రబాబు సహకారంతో తీరుస్తాం.

సాగునీరు తీసుకొస్తాం

బొగ్గుల దస్తగిరి, కోడుమూరు ఎమ్మెలే అభ్యర్థి

గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి కోడుమూరుకు గొట్టం మార్గం ఏర్పాటు చేసి ఇంటింటికి కుళాయిల ద్వారా శుద్ధజలం సరఫరా చేస్తాం. గుండ్రేవుల వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు పూర్తి చేస్తాం.

ఇసుక అక్రమాలపై విచారణ

విష్ణువర్దన్‌రెడ్డి, నియోజకవర్గ బాధ్యుడు

నియోజకవర్గంలో ఇసుక, మట్టి మాఫియాపై విజిలెన్స్‌ విచారణ జరిపించాలి. నాకు ఏ పదవి లేకపోయినా, కన్న కొడుకును కోల్పోయినా మీలో నా కొడుకును చూసుకుంటున్నాను. తెదేపాను గెలిపించి రాజవర్దన్‌రెడ్డి ఆశయాన్ని నెరవేర్చేందుకు సహాయం చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని