logo

పర్యాటక ధామం.. శిల్పకళా తోరణం

సిద్దిపేట పర్యాటక ధామంగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఎన్నో అందాలతో కోమటిచెరువు పర్యాటకులను ఆకర్షిస్తోంది. పట్టణానికి మణిహారంగా మారిన ఈ ప్రాంతం పర్యాటకానికి చిరునామాగా నిలుస్తోంది.

Published : 22 Apr 2023 02:47 IST

కోమటిచెరువు చెంతన రూ.25 కోట్లతో నిర్మాణం

శిల్పారామం నమూనా చిత్రాలు

న్యూస్‌టుడే, సిద్దిపేట: సిద్దిపేట పర్యాటక ధామంగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఎన్నో అందాలతో కోమటిచెరువు పర్యాటకులను ఆకర్షిస్తోంది. పట్టణానికి మణిహారంగా మారిన ఈ ప్రాంతం పర్యాటకానికి చిరునామాగా నిలుస్తోంది. జిల్లా వాసులతో పాటు ఇతర జిల్లాల వారు సందర్శిస్తూ.. అబ్బురపడుతున్నారు. దీనికి మరో తలమాణికమైన హంగు సమకూరనుంది. మంత్రి హరీశ్‌రావు చొరవతో చెరువు చెంతన (బైపాస్‌ మార్గంలో) రూ.25 కోట్లతో శిల్పారామం ఏర్పాటుకానుంది.

సుందర పట్టణం..

శిల్పారామం నమూనా చిత్రాలు

జిల్లా కేంద్రం.. అనేక నిర్మాణాలతో ఆదర్శ ఒరవడిని కొనసాగిస్తోంది. ఇదే తరుణంలో శిల్పారామం మరో నగగా మెరవనుంది. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ, తిరుపతి, విజయవాడ ప్రాంతాల్లో కనిపించే శిల్పారామం.. మన చెంతన సాక్షాత్కరించనుంది. హైదరాబాద్‌ తరహాలో తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. చెరువు వద్ద నెక్లెస్‌ రింగు రోడ్డులో (బైపాస్‌) నిర్మించనున్నారు. వృత్తి నైపుణ్య జీవన విధానాలు.. ఆకృతులు.. అనేక అంశాల్లో కనువిందు చేసేలా పనులు చేపట్టనున్నారు. నేడు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.


పల్లె వాతావరణం ప్రతిబింబించేలా..

శిల్పారామం.. 6 నుంచి 15 ఎకరాల్లో నిర్మాణం కానుంది. పల్లె వాతావరణం, సకల కళలకు నిలయంగా ప్రతిబింబించనుంది. అన్ని రకాల సంస్కృతులు, సంప్రదాయాలకు పెద్దపీట వేయనున్నారు. హస్తకళలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించనున్నారు. ప్రఖ్యాత కళలు, హస్తకళా వస్తువులు అందుబాటులోకి తేనున్నారు. పల్లె సోయగం, వైభవాన్ని చాటనున్నారు. క్రాఫ్ట్స్‌, కల్చరల్‌ మ్యూజియాలు, ఆర్ట్‌ గ్యాలరీ, గ్రంథాలయం, వర్క్‌షాప్స్‌, రీసెర్చ్‌-డిజైన్‌ కేంద్రాలు నిర్మిస్తారు. కళాకారులు, సందర్శకులకు వసతి సదుపాయాలు ఉంటాయి.


21 అంశాల సమాహారం..

పర్యాటక శోభను సంతరించుకునే శిల్పారామం.. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలువనుంది. వివిధ ఆటలు ఆడేందుకు వీలుగా సదుపాయాలు కల్పించనున్నారు. 21 అంశాలు విశేషంగా ఆకట్టుకోనున్నాయి. వాటర్‌ ఫౌంటెయిన్‌, ఫుడ్‌ కోర్టు, బజార్‌ స్టాల్స్‌, రాక్‌ గార్డెన్‌, బాంకెట్‌ హాల్‌, గోకార్టింగ్‌, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా, స్కల్ప్‌టర్స్‌, గజిబౌల్స్‌, కిడ్స్‌ పూల్‌ ఏరియా, కాటేజస్‌, డెక్‌, ఈత కొలను, బంపర్‌ కార్సు, జోర్బింగ్‌, ఫిష్‌ స్పా, గోల్ఫ్‌ కోర్టు, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, కబడ్డీ కోర్టు, ఆర్టిఫిషియల్‌ బీచ్‌ నిర్మాణాలు చేపట్టనున్నారు. తద్వారా మినీ బీచ్‌ను తలపించనుందని అధికారులు చెబుతున్నారు. 1500 మంది కూర్చునేలా భారీ ఆడిటోరియం ఏర్పాటు చేయనున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని