logo

లోక్‌సభ నియోజకవర్గ ఓటర్లు @ 18.28 లక్షలు

మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 18.28 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

Updated : 28 Apr 2024 06:20 IST

రెండు నెలల్లో పెరిగింది 15,352 మంది

న్యూస్‌టుడే, మెదక్‌: మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 18.28 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషుల కంటే మహిళలు అధికంగా ఉన్నారు. ఈ జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో 16,04,947 మంది ఓటర్లు ఉండగా, ఐదేళ్లల్లో 2.23 లక్షల మంది ఓటర్లు పెరగడం గమనార్హం.

మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సంగారెడ్డి, పటాన్‌చెరు, మెదక్‌, నర్సాపూర్‌, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. గత ఫిబ్రవరి 8న ఓటర్ల తుది జాబితా వెలువరించారు. గత నెల 16న పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడంతో ఓటరు నమోదుకు అవకాశం కల్పించారు. ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించడంతో ఆయా నియోజకవర్గాల్లో అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 15 వరకు తుది గడువు విధించారు. దీంతో ఆయా జిల్లాల్లో స్వీప్‌ అధికారులు ప్రచారం నిర్వహించి ఓటర్లుగా నమోదయ్యేలా చర్యలు తీసుకున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో క్యాంపస్‌ అంబాసిడర్లను నియమించి, వారితో అవగాహన కల్పించారు. దీంతో పెద్దఎత్తున అర్జీలు సమర్పించారు.

ప్రస్తుతం ఇలా: పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో గత ఫిబ్రవరి 8నాటికి 18,12,858 మంది ఓటర్లు ఉండగా,  ప్రస్తుతం 18,28,210కి చేరుకుంది. రెండు నెలల్లో 15,352 మంది పెరిగారు. ఇందులో మహిళలు 9,015 మంది, పురుషులు 6,333.  పటాన్‌చెరులోనే 6,564 మంది పెరగడం గమనార్హం. సంగారెడ్డిలో 2,437, మెదక్‌లో 1,987, గజ్వేల్‌లో 1,424, సిద్దిపేటలో 1,117, నర్సాపూర్‌లో 934, దుబ్బాకలో 889 మంది పెరిగారు. పటాన్‌చెరులో 4.13 లక్షల మంది అత్యధిక ఓటర్లుండగా, దుబ్బాకలో అత్యల్పంగా 2 లక్షలుపైగా ఉన్నారు.

మహిళలే అత్యధికం.: లోక్‌సభ స్థానం పరిధిలో పటాన్‌చెరు సెగ్మెంట్‌ మినహా మిగిలిన వాటిల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. పురుషుల కంటే అతివల ఓటర్లు 23,781 మంది ఎక్కువ ఉన్నారు. మరో వైపు యువత సైతం పెద్దఎత్తున పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఈ రెండు వర్గాలు కీలకం కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని