logo

ఈ రోజు ఇలా.. రేపు అలా..

పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఓటూ ప్రాధాన్యమే. బూత్‌ స్థాయి నుంచి అన్ని పార్టీలు శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి.

Published : 03 May 2024 08:06 IST

ఎప్పటికప్పుడు ప్రచార వ్యూహంలో మార్పులు చేర్పులు

న్యూస్‌టుడే, గజ్వేల్‌: పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఓటూ ప్రాధాన్యమే. బూత్‌ స్థాయి నుంచి అన్ని పార్టీలు శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. ప్రచారానికి కొద్ది రోజుల సమయమే ఉండటంతో విస్తృతంగా నాయకులు, అభ్యర్థులు తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. పగలు ఎండలు మండుతుండటంతో ఉదయం, సాయంత్రం వేళలను సద్వినియోగం చేసుకుంటున్నారు. స్థానిక నేతలు తప్పకుండా ప్రతి ఓటరునూ కలవాలని చెబుతున్నారు. అభ్యర్థి, పార్టీ విధివిధానాలు, హామీల గురించి వివరించి కచ్చితంగా తమ పార్టీకే ఓటు వేసేలా ఒప్పించాలని తర్ఫీదు ఇస్తున్నారు. ప్రచారం సమయం ముగిశాక రాత్రి ఆరోజు జరిగిన తీరు.. మరుసటి రోజు అందిపుచ్చుకోవాల్సిన అంశంపై సమావేశమై చర్చిస్తున్నారు.

స్వతంత్రుల కార్యకర్తలతో సేకరణ.. మెదక్‌ పార్లమెంటు పరిధిలో 2,124 బూత్‌లు ఉన్నాయి. కాంగ్రెస్‌, భారాస, భాజపా నేతలు బూత్‌ స్థాయి బాధ్యులను నియమించారు. వారి పరిధిలో 100 ఓట్లకు ఒకరిని బాధ్యులుగా ఏర్పాటు చేశారు. మూడు పార్టీలకు కలిసి 6,372 మంది బూత్‌ బాధ్యులు, వంద ఓటర్లకు ఒకరు చొప్పున 54,384 మందితో సహా మొత్తం 60,756 మంది ముఖ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులకు ప్రచారం నిర్వహిస్తున్న ముఖ్య కార్యకర్తలు మరో 500 మంది వరకు ఉన్నారు. వారి ద్వారా సమాచార సేకరణ చేస్తున్నారు. నేతలు ఎక్కడ ప్రచారం చేశారు? ఎంత మంది ఓటర్లను కలిశారు? అనే విషయాలను వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి వాటిల్లో పంపించుకుంటున్నారు. కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఒక్కో సభ్యుడికి రోజుకు భోజనం, సెల్‌ రీఛార్జితో కలిపి దాదాపు రూ.1000 వరకు ఖర్చు చేస్తున్నారు.

వివాదాస్పద అంశం విస్తృతి.. ప్రధాన పార్టీలు సామాజిక మాధ్యమ బాధ్యులను ఏర్పాటు చేశారు. ప్రచారానికి వస్తున్న నేతల ప్రసంగాలను అనుకూలంగా చేస్తున్నారు. ప్రత్యర్థి నేతల ప్రసంగాల్లో వివాదాస్పదమైన అంశాన్ని వెతికి మరీ వ్యంగ్యంగా మలిచి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి వదులుతున్నారు. వీటి తయారీ కోసం ఒక్కో నియోజకవర్గంలో రూ.30 లక్షలు ఖర్చు చేసినట్లు అంచనా. ఓటర్లను ప్రభావితం చేసేలా అభిప్రాయాలు, స్పందనలు, చిత్రాలను పోటాపోటీగా సామాజిక మాధ్యమ వారియర్స్‌ ప్రచారం చేస్తున్నారు.

కరవు వచ్చింది: భారాస..  కాంగ్రెస్‌ రాగానే కరవు వచ్చిందని భారాస ప్రచారం చేస్తోంది. గ్యారంటీలు, రుణమాఫీ అమలు కాలేదని చెబుతోంది. అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి రూ.వంద కోట్ల ట్రస్టు పెట్టి పేదలను ఆదుకుంటారంటోంది. తెలంగాణ అభివృద్ధికి భాజపా ఏమీ ఇవ్వలేదని.. భాజపా అభ్యర్థివి మాటలే కానీ చేతలు లేవని విమర్శిస్తోంది.

అమలు చేశాం: కాంగ్రెస్‌.. వంద రోజుల పాలనే ఎన్నికలకు రెఫరెండం అని కాంగ్రెస్‌ స్పష్టం చేస్తోంది. ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామంటోంది. పంద్రాగస్టున రుణమాఫీ చేసి తీరుతామంటోంది. కాళేశ్వరం కుంగుపాటు, ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాలపై భారాసను విమర్శిస్తోంది. బీసీ బిడ్డ నీలం మధు అని నాయకులు ప్రచారం చేస్తున్నారు.

కల్లోలాలు లేని దేశం: భాజపా.. పదేళ్లపాటు దేశంలో ఎక్కడా కల్లోలాలు లేని పాలన సాగించిన ఘనత భాజపాదేనని.. ప్రధాని నరేంద్ర మోదీ రక్ష అని ప్రచారం చేస్తున్నారు. గ్రామీణ స్థాయి పురోగతి, శ్రీరాముడికి గుడి, మతపరమైన రిజర్వేషన్లపై వ్యతిరేకత, రాజ్యాంగమే పవిత్ర గ్రంథం అంశాలపై వివరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని