logo

ఒక్కసారే గెలిచి.. ప్రజల మధ్యే నిలిచి

రాజకీయాల్లో అవకాశాలు, అదృష్టం కలిసి వస్తే ఒక్కసారిగా అందలమెక్కుతారు. ఆ తర్వాత పరిస్థితులు మారి కాలం కలిసిరాక పదవులు దక్కకపోవడంతో రాజకీయాల నుంచి కనుమరుగైపోతారు.

Published : 08 Nov 2023 04:19 IST

మాజీ ఎమ్మెల్యే కమలమ్మ జీవితం
నకిరేకల్‌, న్యూస్‌టుడే

రాజకీయాల్లో అవకాశాలు, అదృష్టం కలిసి వస్తే ఒక్కసారిగా అందలమెక్కుతారు. ఆ తర్వాత పరిస్థితులు మారి కాలం కలిసిరాక పదవులు దక్కకపోవడంతో రాజకీయాల నుంచి కనుమరుగైపోతారు. ఒక్కసారే ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినా.. ఆ తర్వాత ఎలాంటి పదవులు రాకున్నా.. నాలుగున్నర దశాబ్దాలపాటు ప్రజాక్షేత్రంలోనే ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పనిచేశారు నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే మూసపాటి కమలమ్మ. సాధారణ జీవితాన్ని కొనసాగిస్తూ .. చివరివరకు కాలినడకన, ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేసేవారు. అది ఏ వేదికైనా.. సొంత పార్టీ వారైనా.. ప్రతిపక్షాలైనా.. ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక విధానాలను కడిగిపారేయడం ఆమె మనస్తత్వం. ముఖ్యమంత్రులు, మంత్రులు ఉన్నతాధికారుల వద్దకు నేరుగా ప్రజా సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేశారు. పదవులు లేకున్నా..ప్రజల మధ్యే ఉంటూ ప్రజల కోసం ప్రశ్నిస్తూ ఆదర్శంగా నిలిచారు స్థానికులు కమలక్కగా పిలుచుకునే కమలమ్మ.

1972లో నకిరేకల్‌కు వచ్చిన నాటి ప్రధాని ఇందిరకు బొట్టుపెట్టి స్వాగతిస్తున్న కమలమ్మ

ఇదీ ప్రస్థానం..

1942లో హైదరాబాద్‌లో కమలమ్మ జన్మించారు. ఆమె తండ్రి నాగయ్యయాదవ్‌ నిజాం సంస్థానంలో పనిచేసేవారు. బీఏ వరకు చదివి 1960లో కమలమ్మ కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకున్నారు. కాంగ్రెస్‌ సేవాదళ్‌ కమాండర్‌గా పనిచేశారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నల్గొండ జైలుకు వెళ్లారు. 1962 నుంచి 1970 వరకు నల్గొండ జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యురాలుగా పనిచేశారు. 1970లో ఇందిరాగాంధీతో కలిసి సామాజిక కార్యకర్తల మహాసభల కోసం ఫిలిప్పీన్స్‌, జపాన్‌, బ్యాంకాక్‌, చైనా దేశాల్లో  పర్యటించారు.

యోధుడిని ఓడించిన చరిత్ర..

నకిరేకల్‌ నియోజకవర్గంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి వరుస విజయాల యోధుడిగా గుర్తింపు తెచ్చుకున్న మార్క్సిస్టు నేత నర్రా రాఘవరెడ్డిని ఓడించిన చరిత్ర కమలమ్మది. 1972లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన కమలమ్మ నర్రా రాఘవరెడ్డిపై 3,836 ఆధిక్యంతో విజయం సాధించారు. 1978 ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి మరణించేంత వరకు ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేశారు. నాలుగు దశబ్దాల క్రితమే మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటుచేసి ఉపాధి కల్పించారు. విద్యుత్తు సమస్యలు పరిష్కరించారు. నకిరేకల్‌లో తొలి ఆర్టీసీ బస్‌స్టేషన్‌ నిర్మాణానికి కృషిచేశారు.

  • తన 72వ ఏటా 2014 డిసెంబరు 18న కమలమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు.  

ఆ ఘనత ఆమెదే...

రాజకీయాల్లో నిలువెత్తు ఆదర్శంగా నిలిచారు. నకిరేకల్‌ శివాజీనగర్‌లోని సొంత ఇంట్లో సాధారణ జీవితాన్ని కొనసాగించారు. స్థానికంగా పలువురు నాయకులుగా ఎదిగేందుకు దోహదపడ్డారు. నకిరేకల్‌కు 1972 నవంబరులో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి పీవీ నరసింహరావును తీసుకొచ్చిన ఘనత కమలమ్మకే దక్కింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు