logo

వారు ఆడిందే ఆట.. కాసుల వేట

కంచే చేను మేసినట్లుగా.. ఔషధ దుకాణాల్లో జరిగే అవినీతిని అరికట్టాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. తనిఖీల పేరుతో రూ.లక్షలు వసూళ్లు చేసుకుని రూ.కోట్ల విలువ చేసే భూములు కొనుగోలు చేసినట్లు ఇటీవల ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది.

Published : 28 Apr 2024 06:26 IST

జిల్లా ఔషధాల నియంత్రణ అధికారి కార్యాలయం

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: కంచే చేను మేసినట్లుగా.. ఔషధ దుకాణాల్లో జరిగే అవినీతిని అరికట్టాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. తనిఖీల పేరుతో రూ.లక్షలు వసూళ్లు చేసుకుని రూ.కోట్ల విలువ చేసే భూములు కొనుగోలు చేసినట్లు ఇటీవల ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. అక్రమాలకు పాల్పడిన వారిపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు నివేదికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. నల్గొండ జిల్లాలో 2018 నుంచి 2024 వరకు ఔషధ విక్రయ దుకాణాల తనిఖీల్లో నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేసినట్లు సమాచారం. కొవిడ్‌ విజృంభించిన సమయంలో ఇంజక్షన్ల అమ్మకాల్లో సైతం రూ.లక్షలు పక్కదారి పట్టించారు. ఓ  డీఐవో ప్రతి ఔషధాల సముదాయానికి రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు దరఖాస్తు దారుల స్థాయిని బట్టి వసూళ్లు చేసినట్లు సమాచారం. ఆయన ఆగడాలు తట్టుకోలేక మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన ఒకరు రూ.18 వేలు లంచం ఇస్తూ ఏసీబీ అధికారులకు పట్టించారు.

కాసులిస్తే తనిఖీల్లేవు..

జిల్లాలో 1,200 ఔషధ విక్రయ కేంద్రాలున్నాయి. వాటి నుంచి ప్రతి నెలా అమ్మకాలు జరిగే స్థాయిని బట్టి ప్రాంతాల వారీగా అధికారులకు రూ.15 వేల నుంచి రూ.20వేల వరకు మామూళ్లు ఇస్తున్నట్లు సమాచారం. దీని కోసం మధ్య వర్తులుగా కొందరు సంఘ నాయకులు వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అధికారుల చేతికి మట్టి అంటకుండా సదరు నాయకులు నెలవారీ వసూళ్లు చేసి ఇస్తున్నట్లు కొందరు ఔషధ విక్రయ నిర్వాహకులు చెబుతున్నారు. మామూళ్లు ఇవ్వని వారిపై దాడులు నిర్వహిస్తూ అక్రమ కేసులు పెడుతున్నట్లు తెలిపారు. తనిఖీల్లో సీజ్‌ చేసిన దుకాణాలను తిరిగి తెరుచుకోవాలంటే రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఇవ్వాల్సి ఉంటుందని ఇటీవల సీజ్‌ చేసిన ఔషధ దుకాణదారులు పేర్కొన్నారు. కొత్త దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వ చలానా రుసుం రూ.3వేలు ఉంటే, అధికారులకు రూ.10వేలకు పైగా చెల్లించాల్సి వస్తోందని పలువురు బాధితులు వాపోయారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లదే హవా సాగుతుంది.


మా దృష్టికి రాలేదు
దాసు, ఔషధ నియంత్రణ పరిపాలన అధికారి

ఔషధ దుకాణాల తనిఖీల పేరుతో అక్రమ వసూళ్లుకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి రాలేదు. వాస్తవాలు తెలుసుకుని ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. కొనుగోలు దారులకు ఇబ్బందులు కలిగిస్తే తమకు నేరుగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని