logo

హస్తంలోకి ఆహ్వానం..!

ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. రెండు  స్థానాలకు ఇన్‌ఛార్జులుగా మంత్రి ఉత్తమ్‌, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు.

Updated : 28 Apr 2024 06:36 IST

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను చేర్చుకోవడానికి సుముఖత

ఈనాడు, నల్గొండ : ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. రెండు  స్థానాలకు ఇన్‌ఛార్జులుగా మంత్రి ఉత్తమ్‌, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. వారు ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీల పదవీకాలం ఈ ఏడాది జులైతో ముగుస్తుంది. పురపాలికల పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామనో, లేదంటే భారాస, భాజపాలో అసంతృప్తితో ఉన్నవారిని స్థానిక నాయకులు పార్టీలో చేర్చుకుంటున్నారు. గత పదేళ్ల భారాస పాలనలో పార్టీ నుంచి వివిధ పార్టీల్లో చేరిన వారిని నాయకులు సంప్రదిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో చేరికలకు ప్రాధాన్యం ఇస్తూ ఏకంగా చేరికల కమిటీనే ఏర్పాటు చేశారు.దీంతో ఉమ్మడి జిల్లా స్థాయిలో చేరికలను మరింత వేగవంతం చేస్తున్నారు.

వరుస కడుతున్న ఎంపీపీ, జడ్పీటీసీలు

భారాస నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు వరుస కడుతున్నారు. వారికి వచ్చే ఎన్నికల్లో పార్టీ నుంచి టిక్కెట్‌ ఇస్తామని పలు చోట్ల ముఖ్య నాయకుల నుంచి హామీ సైతం లభించినట్లు తెలిసింది. ముఖ్యంగా మండలాలు, నియోజకవర్గ స్థాయిలో ప్రభావం చూపగల నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇటీవలి కాలంలో నాగార్జునసాగర్‌, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో చేరికలు ఎక్కువ సంఖ్యలో జరగగా..అందులో ఎక్కువ మంది ఎంపీపీలు, జడ్పీటీసీలు ఉండటం గమనార్హం. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని గుర్రంపోడు ఎంపీపీ, జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు, తిరుమలగిరి సాగర్‌ మండల ఎంపీపీ సైతం కాంగ్రెస్‌లో చేరారు. మునుగోడు ఎంపీపీ, మర్రిగూడ, నారాయణపూర్‌ జడ్పీటీసీలు కాంగ్రెస్‌లో చేరగా..తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి పురపాలిక ఛైర్మన్‌తో పాటూ పలువురు కౌన్సిలర్లు పార్టీలో చేరారు. పీఏసీఎస్‌ ఛైర్మన్‌లు, ఇతర పార్టీల గ్రామ స్థాయి అధ్యక్షులు సైతం కాంగ్రెస్‌లో చేరడానికే ఆసక్తి చూపుతున్నారు. హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లోని చాలా మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరగా..ఇప్పుడు పురపాలికల కౌన్సిలర్లు, క్షేత్రస్థాయిలో ఇతర పార్టీల్లో కీలకంగా వ్యవహరించే వారు సైతం అధికార పార్టీ కండువా కప్పుకుంటున్నారు.

పలు చోట్ల అభ్యంతరాలు

భారాస నుంచి కాంగ్రెస్‌లో పలువురు నాయకుల చేరికపై కాంగ్రెస్‌ శ్రేణుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మిర్యాలగూడ పురపాలిక ఛైర్మన్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌మున్షీ సమక్షంలో అధికార పార్టీలో చేరగా..డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌తో పాటూ, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు.దీంతో ఈ చేరిక ఆగిపోయినట్లు ఏకంగా పీసీసీ నుంచి ప్రకటన వెలువడింది. స్థానిక నేతలతో సంప్రదించకుండా ఎవరినీ చేర్చుకునేది లేదని పీసీసీ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని ఆరోపిస్తూ మిర్యాలగూడ పురపాలిక ఛైర్మన్‌పై భారాస ఒకట్రెండు రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఏకంగా ఆయనపై పట్టణంలో పలు చోట్ల ఫ్లకార్డులు ప్రదర్శించి కాంగ్రెస్‌లో చేరికపై నిరసన వ్యక్తం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మునుగోడు నియోజకవర్గంలోనూ ఇటీవల పలువురు నాయకులు చేరికపై స్థానిక నాయకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా రాజగోపాల్‌రెడ్డి వారించడంతో వారంతా వెనక్కి తగ్గారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని ఓ మండల ఎంపీపీ, జడ్పీటీసీ భారాస నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి సిద్ధమైనా ఆ పార్టీ శ్రేణులు వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని