logo

ద్వితీయ శ్రేణి.. గుంభనం వీడదేమీ!

అసెంబ్లీ ఎన్నికలకు.. లోక్‌సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అగ్రనాయకుల హడావుడి తప్ప కిందిస్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు.

Published : 29 Apr 2024 04:29 IST

నాంపల్లి, న్యూస్‌టుడే: అసెంబ్లీ ఎన్నికలకు.. లోక్‌సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అగ్రనాయకుల హడావుడి తప్ప కిందిస్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ ముగిసినప్పటికీ కార్యకర్తల్లో ఉత్తేజం, ఉత్సాహం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఆర్నెల్లకే ఈ ఎన్నికలు రావడంతో స్తబ్ధత నెలకొంది. అన్ని ప్రధాన పార్టీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మూడు ప్రధాన పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం బయటికి ఒకలా.. లోపల మరోలా వ్యవహరిస్తున్నారని ఆయా పార్టీల కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

ఎవరికెవరి మద్దతు..

లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు.. ఎవరికి మద్దతిస్తారో అర్థం కాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు రోడ్డు షోలు, ప్రచారాలు నిర్వహిస్తున్నప్పటికీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో స్తబ్ధత నెలకొనడంతో ప్రజల నుంచి ఆశించిన స్పందన రావడంలేదనే అభిప్రాయం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న సమావేశం నిర్వహించినా.. కార్యకర్తల సమీకరణ పోటీపడి చేసే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఒకరి పేరు చెప్పి మరొకరికి ఓట్లు వేయమనే సరళి కొనసాగుతోందా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్థిక భారం.. సంశయంగా..

లోక్‌సభ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలంటే ఎక్కడ ఆర్థిక భారం మీదపడుతుందనే ఉద్దేశంతో కొందరు నాయకులు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకుండా దూరం దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ద్వితీయ శ్రేణి నాయకులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ముఖ్య నాయకులూ పెద్దగా ఆసక్తి చూపడంలేదనే చర్చకు దారితీస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎక్కువ నియోజకవర్గాల్లో ద్విముఖ పోరు ఉండగా.. లోక్‌సభ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్యన పోరు ఆసక్తిగా మారనుందని ప్రధాన పార్టీల నాయకులే అంచనా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి ఓట్లు ఎవరికి నష్టం కలిగిస్తాయనేది అభ్యర్థులకూ, అంతరంగికులకూ అంతు చిక్కని అంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని