logo

మడిగల్లోనే దశాబ్దాలుగా..!

దేవరకొండ రెవెన్యూ డివిజన్‌, నియోజకవర్గ కేంద్రం, పురపాలికలో ఏ దుకాణాలు అద్దెకు తీసుకోవాలన్నా.. రూ.వేలు అద్దె చెల్లించాల్సిన పరిస్థితి.

Published : 29 Apr 2024 04:33 IST

ప్రభుత్వ ఆస్పత్రి ముందున్న వాణిజ్య దుకాణాలు

దేవరకొండ, న్యూస్‌టుడే: దేవరకొండ రెవెన్యూ డివిజన్‌, నియోజకవర్గ కేంద్రం, పురపాలికలో ఏ దుకాణాలు అద్దెకు తీసుకోవాలన్నా.. రూ.వేలు అద్దె చెల్లించాల్సిన పరిస్థితి. అద్దెలు విపరీతంగా పెరిగాయి. చిన్న మడిగకు కూడా రూ.10వేలకు పైగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది.అయితే దేవరకొండ ఏరియా ఆసుపత్రి ముందు పురపాలికకు సంబంధించిన వాణిజ్య దుకాణాల్లో దశాబ్దాలుగా ఖాళీ చేయకుండా, లీజు చెల్లించకుండా వ్యాపారులు అలాగే ఉండిపోయారు. దేవరకొండ పురపాలక పరిధిలోని ఏరియా ఆస్పత్రి ముందు కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారిపై ఎనిమిది, పాత బజార్‌, మాయాబజార్‌లోని కొన్ని వాణిజ్య దుకాణాల్లో యజమానులు దశాబ్దాలుగా తిష్ఠ వేశారు. దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రి ముందు ఎనిమిది వాణిజ్య దుకాణాలను 1998 మార్చి 18న వ్యాపారస్తులకు అప్పటి గ్రామపంచాయతీ అధికారులు లీజుకు ఇచ్చారు. మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత సంబంధిత లీజును 2001లో రద్దు చేశారు. కానీ వ్యాపారస్తులు అలాగే దుకాణాలు నిర్వహించుకుంటున్నారు. 2012లో దేవరకొండ నగర పంచాయతీగా రూపుదిద్దుకున్న తర్వాత ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ప్రస్తుతం ఉన్న వాణిజ్య దుకాణాలు సైతం మరొకరికి లీజు పేరుతో విక్రయాలకు పాల్పడుతున్నారు. వాణిజ్య వ్యాపారుల నుంచి లీజు వసూలు చేయకపోవడంతో పాటు వాటిపై చర్యలు తీసుకోకపోవడం వెనుక పురపాలిక అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పురపాలిక అధికారులే ఆ మడిగలకు మిషన్‌ భగీరథ నల్లా కనెక్షన్లు ఇవ్వడం గమనార్హం.

ఏరియా ఆసుపత్రి ముందు కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై

మడిగల్లో హోటల్‌ ఏర్పాటుకు చేపడుతున్న నూతన నిర్మాణం

నోటీసులు ఇచ్చాం: భాస్కర్‌రెడ్డి, పురపాలిక కమిషనర్‌

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు ఉన్న ఎనిమిది వాణిజ్య దుకాణ వ్యాపారులకు నోటీసులు జారీ చేశాం. వారి నుంచి సమాధానం వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని