logo

పోలింగ్‌ నమోదుపై బెంగ

లోక్‌సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్‌ శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది.

Published : 30 Apr 2024 05:19 IST

పెరుగుతున్న ఎండల ప్రభావం

సూర్యాపేటలో ఓటు వేసేందుకు వరసలో నిల్చున్న ఓటర్లు(పాత చిత్రం)

భానుపురి, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్‌ శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రతలు 45 డ్రిగీల వరకు నమోదవుతున్నాయి. మే 13న జరిగే ఎన్నికల్లో పోలింగ్‌శాతం ఏ మేర నమోదవుతుందోనని అభ్యర్థులు బెంగపడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి, నల్గొండ లోక్‌సభ నియోజకవర్గాల్లో 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ శాతాల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈసారి వాటిని మించి పెంచడానికి అధికారులు స్విప్‌ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

మహిళా ఓటర్లే కీలకం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం ఎవరి ధీమాలో వారే ఉన్నారు. రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే కీలకం. ప్రస్తుతం ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండ వేడిమికి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇక పోలింగ్‌ కేంద్రాలకు ఎంత మంది వెళ్లి ఓటుహక్కు వినియోగించుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే వృద్ధులు ఎండలో వచ్చి ఓటు వేయడం కష్టమేనని పలువురు భావిస్తున్నారు.

అవగాహన కార్యక్రమాలు

పోలింగ్‌ శాతం పెంచడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే పోలింగ్‌ శాతం తక్కువగా నమోదైందో ఆయా బూత్‌లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అర్హులైన ప్రతి వయోజనుడు ఓటుహక్కు వినియోగించుకోవడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళా స్వయం సంఘాలను రంగంలోకి దింపారు. వారితో చైతన్య ర్యాలీలు తీయించారు. ప్రతి కళాశాలలో ఇద్దరు విద్యార్థులను అంబాసిడర్లుగా నియమించారు. 5కే పరుగు కార్యక్రమాల ద్వారా పోలింగ్‌పైన అవగాహన పెంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని