logo

ఆత్మకూరు ఉప ఎన్నికకు..ముహూర్తం ఖరారు

ఆత్మకూరు ఉప ఎన్నికకు నగరా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆత్మకూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో ఈ ఏడాది ఫిబ్రవరి 21న మృతిచెందారు. దాంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

Published : 26 May 2022 03:22 IST


బెజవాడ గోపాలరెడ్డి.. ఆనం సంజీవరెడ్డి(పాతచిత్రాలు)

ఈనాడు డిజిటల్, నెల్లూరు  ఆత్మకూరు ఉప ఎన్నికకు నగరా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆత్మకూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో ఈ ఏడాది ఫిబ్రవరి 21న మృతిచెందారు. దాంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2019లో వైకాపా అభ్యర్థిగా గౌతమ్‌రెడ్డి పోటీ చేసి ప్రత్యర్థి తెదేపా అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై దాదాపు 22,276 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గౌతమ్‌రెడ్డి మృతిచెందిన మూడు నెలల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ జారీ చేయడంతో ఆత్మకూరులో రాజకీయ సందడికి తెర లేచింది. అటు ఎన్నికలు.. ఇటు భద్రత యంత్రాంగం అప్రమత్తమైంది. 
ఎన్నికా.. ఏకగ్రీవమా!
వైకాపా అభ్యర్థిగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ద్వితీయ కుమారుడు, గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డి పేరును ఇప్పటికే పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. అప్పటినుంచి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కలిసి మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష తెదేపా దాదాపుగా పోటీలో ఉండే అవకాశం లేదు. మృతిచెందిన వారి కుటుంబసభ్యులు పోటీ చేస్తే తాము పోటీ చేయమని ఇప్పటికే ఆపార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. గతేడాది సెప్టెంబరులో జరిగిన బద్వేలు ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. ప్రస్తుతం కూడా అదే పంథా కొనసాగించే అవకాశముందని ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నెల్లూరులో పర్యటించినప్పుడు.. ఆత్మకూరు ఉపఎన్నిక బరిలో తమ పార్టీ ఉంటుందని ప్రకటించారు. గురువారం నెల్లూరులో జరిగే ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. మేకపాటి రాజమోహన్‌రెడ్డి మేనల్లుడు బిజువేముల రవీంద్రారెడ్డి పలుమార్లు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి తాను పోటీ చేస్తానని తెలిపారు. మరికొంత మంది ఆశావహులు బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. దాంతో ఎన్నిక అనివార్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
ఆరు దశాబ్దాల తర్వాత..
సంగం : ఆత్మకూరు నియోజకవర్గంలో ఆరు దశాబ్దాల తర్వాత రెండోసారి ఉప ఎన్నిక జరుగుతుండటం విశేషం. జిల్లాలో మరెక్కడా రెండుసార్లు ఉప ఎన్నిక జరిగిన దాఖలాల్లేవు. 
1958లో తొలిసారి : 1952లో ఆత్మకూరు నియోజకవర్గం ఏర్పడింది. 1955లో మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించిన బెజవాడ గోపాలరెడ్డి.. ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహించారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడటంతో ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి 1958 వరకు మంత్రిగా కొనసాగారు. 1958లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. దాంతో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో ఆనం సంజీవరెడ్డి కాంగ్రెస్‌ పక్షాన పోటీ చేసి ప్రత్యర్థి జి.సి.కొండయ్యపై 45 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడం విశేషం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని