logo

వేలిముద్రలు కాజేసి... నిధులు దోచేసి!

నెల్లూరు నగరానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి.. తన ప్రమేయం లేకుండానే.. తన బ్యాంకు ఖాతా నుంచి మరో ఖాతాకు రూ. పదివేలు బదిలీ అయినట్లు గుర్తించారు. అదెలా సాధ్యమని చూస్తుండగానే.. ఆయనకే ఉన్న మరో బ్యాంకు ఖాతా నుంచి మరో రూ.పదివేలు బదిలీ అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఆయన.. సంబంధిత బ్యాంకు

Published : 23 Sep 2022 02:44 IST

ఖాతాదారుల ఖాతాల నుంచి రూ.లక్షలు మాయం

బ్యాంకులు, పోలీసుస్టేషన్లకు జనం పరుగులు

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: వెంకటాచలం, న్యూస్‌టుడే

నెల్లూరు నగరానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి.. తన ప్రమేయం లేకుండానే.. తన బ్యాంకు ఖాతా నుంచి మరో ఖాతాకు రూ. పదివేలు బదిలీ అయినట్లు గుర్తించారు. అదెలా సాధ్యమని చూస్తుండగానే.. ఆయనకే ఉన్న మరో బ్యాంకు ఖాతా నుంచి మరో రూ.పదివేలు బదిలీ అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఆయన.. సంబంధిత బ్యాంకు అధికారులను సంప్రదించారు. తమకేమీ సంబంధం లేదని, మీరు ఎక్కడో వేలిముద్ర వేయడం వల్లే నగదు విత్‌డ్రా అయిందని చెప్పారు. అలా ఆ మాటలు జరుగుతుండగానే.. మరో రూ. రెండు వేలు పోవడంతో కంగుతిన్నారు. తామేమీ చేయలేమని బ్యాంకు సిబ్బంది చెబుతుండటంతో.. తన ఖాతా లావాదేవీలను నిలుపుదల చేయాలని కోరారు.

కసుమూరు పంచాయతీ పరిధిలోని కాకర్ల నాగేశ్వరరావు బ్యాంకు ఖాతా నుంచి రూ. 12వేలు మాయమయ్యాయి. రూ. 6వేల చొప్పున రెండుసార్లు.. వేరే బ్యాంకు ఖాతాలకు బదిలీ అయ్యాయి. దుద్దుకూరు సురేంద్రబాబు ఖాతా నుంచి రూ. 20వేలు, అనిల్‌ అనే వ్యక్తి ఖాతా నుంచి రూ. 35వేలు వారి ప్రమేయం లేకుండానే పోయాయి. ఈ ఒక్క పంచాయతీలోనే ఈ విధంగా మరో ఏడుగురి బ్యాంకు ఖాతాల నుంచి రూ. రెండు లక్షల వరకు నగదు మాయమైంది. కంటేపల్లిలోనూ ఇదే రీతిలో ఓ వ్యక్తికి చెందిన రూ. 12వేలను కాజేశారు. ఇలా ఒకరిద్దరు కాదు.. జిల్లాలో వందలాది మందికి చెందిన మొత్తం రూ. లక్షల్లోనే కాజేసినట్లు సమాచారం.

రూ. లక్షలు కొల్లగొట్టేందుకు.. ప్రజలు, బాధితులను మోసం చేసేందుకు సైబర్‌ నేరగాళ్లు అత్యాధునిక సమాచారం వినియోగిస్తున్నారు. బ్యాంకు ఖాతాదారుల వేలిముద్రలు చోరీ చేసి.. వారి ఖాతాల్లోని నగదును సునాయాసంగా మాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా మోసాలు.. జిల్లాలో నిత్యం పదుల సంఖ్యలో వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. బ్యాంకు సిబ్బంది సైతం స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతుండటం.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే డబ్బు వెనక్కు వస్తాయని చెబుతుండటంతో బాధితులు ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి. ఈ సంఘటనలపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేసిన పోలీసులు.. సైబర్‌ నేరగాళ్లు నేరానికి పాల్పడిన తీరు చూసి విస్మయానికి గురవుతున్నారు.

ఎ.ఐ.పి.ఎస్‌. విధానమంటే..

ఏటీఎం కార్డుతో సంబంధం లేకుండా.. ఖాతాదారులు నగదు జమ, ఉపసంహరణలు చేసుకోవడానికి ఎ.ఇ.పి.ఎస్‌.(ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టం)ను అందుబాటులోకి తెచ్చారు. ప్రైవేటు వ్యక్తులకు కస్టమర్‌ సర్వీసు పాయింట్‌ (సీఎస్‌పీ)లు పెట్టుకునే అవకాశం కల్పించారు. వాటి నిర్వాహకులకు ప్రత్యేక ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు అందించారు. దీని ద్వారా ఖాతాదారులు ఆయా కేంద్రాలకు వెళ్లి వేలిముద్ర వేసి.. వారి ఖాతా నుంచి నిర్ణీత మొత్తం తీసుకోవచ్చు. బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అనుసంధానమై వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంది. ఈ సేవలకు గాను సీఎస్‌పీ నిర్వాహకుడికి బ్యాంకు అధికారులు కొంత కమిషన్‌ ఇస్తారు.

జరుగుతోందిలా..

సైబర్‌ నేరగాళ్లు సీఎస్‌పీల వ్యవస్థలోని లోపాలు పసిగట్టారు. వేలిముద్రల ఆధారంగా నగదు చెల్లించడాన్ని తమకు అనుకూలంగా మలచుకున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నుంచి పలువురి వేలిముద్రలను చోరీ చేసి.. ఆ యాప్‌/సాఫ్ట్‌వేర్‌లో ఆధార్‌ను నమోదు చేసి, నకిలీ రబ్బర్‌ వేలిముద్రను పెడుతున్నారు. ఆ ఆధార్‌ నంబరుకు బ్యాంకు ఖాతా నమోదై ఉంటే.. ప్రొసీడింగ్‌ అని వస్తుంది. లేకుంటే రాదు. ఇలా అన్ని బ్యాంకులను పరిశీలిస్తున్న కేటుగాళ్లు.. ప్రొసిడింగ్‌ అని రాగానే మీట నొక్కుతున్నారు. అలా ఆయా ఖాతాల నుంచి నగదు కాజేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆన్‌లైన్‌ బ్యాకింగ్‌ ద్వారా నగదు బదిలీకి ఓటీపీ, డబుల్‌ అథెంటికేషన్‌ ఉంటుంది. ఏఈపీఎస్‌లో అలా ఉండదు. అదే నిందితులకు వరమవుతోంది. ఖాతాదారులు స్పందించి బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసేలోపే.. వారి ఖాతాల్లోని నగదు మొత్తం ఖాళీ అవుతోంది.

లాక్‌ చేసుకుంటే...

బ్యాంకు ఖాతాతో ఆధార్‌ అనుసంధానం చేసుకున్న వారు.. బయోమెట్రిక్‌ లాక్‌ చేసుకుంటే.. సైబర్‌ నేరగాళ్ల బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. mAaadhar యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ‘బయోమెట్రిక్‌, ఆధార్‌’ అనే ఆప్షన్లు లాక్‌ చేసుకోవచ్చంటున్నారు. ఇలా లాక్‌ చేస్తే.. ఖాతాదారుల ఆధార్‌ ఆధారంగా ఇతరులు ఎలాంటి లావాదేవీలు చేయడానికి అవకాశం ఉండదని అంటున్నారు. ఏవైనా లావాదేవీలు నిర్వహించినా.. ముందస్తు సమాచారం వస్తుందన్నారు. చాలా మంది బ్యాంకు ఖాతాదారులు వారి ఆధార్‌ వివరాలు లాక్‌ చేయించుకోవడంలో విఫలమవుతుండటం సైబర్‌ నేరగాళ్లకు కలిసి వస్తోందని చెబుతున్నారు.


సైబర్‌ బృందాలతో దర్యాప్తు

- సీహెచ్‌ విజయరావు, ఎస్పీ

సైబర్‌ నేరగాళ్లు ఖాతాదారులకు సంబంధం లేకుండానే వేలిముద్రల సాయంతో నగదు కాజేస్తున్న విషయంపై ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖాతాదారుల వేలిముద్రలు ఉపయోగించి నగదు కాజేస్తున్నట్లు నిర్ధారణ అయింది. అవి వారికి ఎలా వెళ్లాయనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నాం. నగదు కోల్పోయిన ఖాతాదారులు వారి వారి బ్యాంకులకు దరఖాస్తు చేసుకుంటే.. వెనక్కు వస్తుంది. బ్యాంకు అధికారులు సహకరించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని