logo

గోరంత ఇచ్చి.. కొండంత బాదుడు

జగన్‌ ముఖ్యమంత్రి పీటమెక్కితే రూ. పది వేల ఆర్థిక సాయం చేస్తారని ఆశపడి ఓట్లేసిన ఆటో డ్రైవర్లు ప్రస్తుతం అల్లాడిపోతున్నారు.

Updated : 10 Apr 2024 09:13 IST

గతుకుల రోడ్లతో ఆటో‘పాట్లు’
ట్యాక్స్‌లు, జరిమానాలతో డ్రైవర్ల కుదేలు

జగన్‌ ముఖ్యమంత్రి పీటమెక్కితే రూ. పది వేల ఆర్థిక సాయం చేస్తారని ఆశపడి ఓట్లేసిన ఆటో డ్రైవర్లు ప్రస్తుతం అల్లాడిపోతున్నారు. అధికారంలోకి వచ్చాక ప్రతి ఆటో డ్రైవరుకూ రూ. పదివేలు ఇస్తామని.. వాటితో బీమా, రోడ్డు పన్ను కట్టుకోవచ్చని చెప్పిన మాటలు బాగానే ఉన్నా.. మరోవైపు పన్నులు, అపరాధ రుసుములు, ఇన్సూరెన్సుల రూపంలో లాగేస్తారన్న విషయం అప్పుడు వారికి తెలియలేదు.

ఈనాడు, నెల్లూరు

ఓ చేత్తో ఇస్తూ.. మరో చేత్తో పిండేస్తారని ఊహించలేకపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే డీజిల్‌, పెట్రోల్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయని పదేపదే జగన్‌ చెబుతుంటే.. అధికారంలోకి వస్తే వాటిని తగ్గిస్తారని ఆశపడిన వారికి నిరాశే మిగిలింది. సీఎం అయ్యాక పన్నులు పెంచడమే కాదు.. అధికారం చేపట్టిన తొలి ఏడాది నుంచే ఆటోడ్రైవర్లకు చుక్కలు చూపడం మొదలైంది. వాహనమిత్ర పథకాన్ని ప్రకటించిన తర్వాత.. ఆటో రోడ్డెక్కితే చాలు.. ఎడాపెడా కేసులతో బడుగుజీవుల ఆదాయానికి కత్తెర వేయడం ప్రారంభమైంది.

రోడ్డెక్కితే అంతే..

జగన్‌ పాలనలో పెనాల్టీల బాదుడూ ఎక్కువే. బీమా లేకపోతే రూ.అయిదు వేలు, కోటు వేసుకోకపోతే రూ. 235 చొప్పున వసూలు చేస్తున్నారు. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకపోతే రూ.అయిదువేలు జరిమానా విధిస్తున్నారు. వాహనమిత్ర కింద ఏడాదికి ఇచ్చే రూ. పదివేలతో పోల్చితే.. నెలకు నమోదయ్యే కేసులు, జరిమానాల చెల్లింపునకే ఎక్కువ అవుతోంది. ఒక్కో ఆటోకు రూ. 3వేలకుపైగా జరిమానాలు విధిస్తున్న సందర్భాలు ఉన్నాయి.వారం పాటు ఆటో తోలినా.. ఇంత రాదని డ్రైవర్లు వాపోతున్నారు.


నిర్వహణ ఖర్చు మూడింతలు

నెల్లూరు : రహదారి గోతుల్లో ముందుకుసాగుతున్న ఆటోలు

వాహనమిత్ర లబ్ధిదారుల్లో అత్యధికులు ఆటో డ్రైవర్లే ఉంటున్నారు. ఆయా వాహనాల బీమా, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, ఇతర అవసరాలకు సాయం అందిస్తూ.. వారికి అండగా నిలుస్తున్నామని వైకాపా నాయకులు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా... జిల్లాలో అధ్వానంగా ఉన్న రహదారుల కారణంగా ఆటోలు గుల్లవుతున్నాయి. గోతుల్లో పడి వెనుక చక్రాల బేరింగ్‌లు తరచూ దెబ్బతింటున్నాయి. మూడేళ్లపాటు మన్నికగా ఉండాల్సిన  క్లచ్‌ ప్లేట్లు ఏడాదికే పాడవుతున్నాయి. టైర్ల మన్నిక తగ్గిపోయి.. పంక్చర్లు నిత్యకృత్యమవుతున్నాయి. వాహన మైలేజీ తగ్గడంతో పాటు ఇంధన ఖర్చు పెరుగుతోంది. సాధారణంగా ఆటోలకు నెలకు రూ.వెయ్యికి మించి నిర్వహణ ఖర్చులు ఉండవని, గుంతల రోడ్ల కారణంగా నెలకు రూ. 3వేల నుంచి రూ. నాలుగు వేల వరకు ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. కొత్త రోడ్లు వేసే సంగతేమోగానీ, తొలుత గోతులైనా పూడ్చాలని డ్రైవర్లు వేడుకుంటున్నారు. ఈ సమస్యపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు పదేపదే చెప్పినా ప్రయోజనం ఉండటం లేదని మండిపడుతున్నారు.


ఖర్చులు రెట్టింపు అయ్యాయి

వాహనమిత్ర ద్వారా రూ. పదివేలు ఇస్తున్నారు సరే.. అంతకు మించి ఖర్చులు పెరిగాయి. ఒక్క వాహన బీమానే రూ. 12వేలు అవుతోంది. ప్రయాణికులను ఎక్కించుకుంటేనే మాకు రోజు గడిచేది. అందుకు రోడ్డుపై ఎక్కడైనా ఆపితే.. వెంటనే ఫొటో తీస్తున్నారు. ఆటోలో ఉన్న వారిని దింపేందుకు ఆపితే.. వెంటనే ఆటో వెనుక కొడుతున్నారు. వాహనమిత్ర ఇవ్వకపోయినా పర్వాలేదు.. పెరుగుతున్న ఖర్చులు తగ్గిస్తే చాలు.

 నర్సయ్య, ఆటోడ్రైవరు


కరెంటు బిల్లు వస్తోందని.. ఇవ్వడం లేదు

రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు మావి. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు డబ్బు ఇస్తోందని ఆశతో దరఖాస్తు చేసుకున్నా. 300 యూనిట్ల కరెంట్‌ బిల్లు వస్తోందని ఆపేశారు. నాకే కాదు.. మా స్టాండ్‌లో 50 మంది ఉంటే.. అయిదారుగురికే వస్తోంది. వారు కూడా అంత సంతోషంగా ఏం లేరు. విపరీతంగా చలానాలు విధిస్తున్నారు. ఆటోను పోలీసులు ఎప్పుడు ఆపుతారో తెలియదు. ఆ రోజు కట్టే డబ్బులు.. ఆ వారమంతా సంపాదించే దానికంటే ఎక్కువగా ఉంటోంది. 

తిరుపతయ్య, ఆటోడ్రైవరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని