logo

అక్రమాలకు పాల్పడిన ఏపీజీబీ మేనేజర్‌ అరెస్టు

అమడగూరు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో గతంలో మేనేజర్‌గా పని చేసిన కమతం పెంచల్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి ఆదివారం కదిరి జ్యూడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెసిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి మీనాక్షి సుందరి ఎదుట హాజరు పరిచినట్లు అమడగూరు ఎస్‌ఐ మగ్బూల్‌బాషా తెలిపారు.

Published : 29 Apr 2024 03:58 IST

ఖాతాదారుల సొమ్ము రూ.44 లక్షలు స్వాహా

మేనేజర్‌ పెంచల్‌రెడ్డి

అమడగూరు, న్యూస్‌టుడే : అమడగూరు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో గతంలో మేనేజర్‌గా పని చేసిన కమతం పెంచల్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి ఆదివారం కదిరి జ్యూడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెసిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి మీనాక్షి సుందరి ఎదుట హాజరు పరిచినట్లు అమడగూరు ఎస్‌ఐ మగ్బూల్‌బాషా తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు వివరాలు.. నెల్లూరు నగరంలో గౌడ్‌ హాస్టల్‌ సమీపంలో నివాసం ఉంటున్న కమతం పెంచల్‌రెడ్డి 2021-22 సంవత్సరంలో అమడగూరు గ్రామీణ బ్యాంకు మేనేజర్‌గా పని చేశారు. ఆ సమయంలో పథకం ప్రకారం తనకు అనుకూలమైన ఖాతాదారులను ఎంపిక చేసుకుని వారికి రుణాలు మంజూరు చేశారు. రుణాలు మంజూరు చేశాక.. తన సొంత అవసరాలకు అక్రమ పద్ధతుల్లో రూ.44,10,000ను ఖాతాదారుల నుంచి వాడుకున్నాడు. ఈ బాగోతం బహిర్గతం అయిన తరువాత ఆయన్ను బ్యాంకు ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. అప్పట్లో మేనేజర్‌ మాయమాటలకు మోసపోయిన ఖాతాదారులు వివిధ దశల్లో బ్యాంకు ఎదుట ఆందోళన చేశారు. ఆయన స్థానంలో వచ్చిన మేనేజర్‌ పెంచల్‌రెడ్డి చేసిన అక్రమంపై 2022లో అమడగూరు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఆయన్ను అరెస్టు చేసేందుకు అప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో నిఘా పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి ఇక్కడి పోలీసులు తీసుకెళ్లారు. దీంతో దేశంలోని అన్ని ఎయిర్‌ పోర్టులకు ఆయన గురించి సమాచారం చేరవేశారు. ఈ నేపథ్యంలో కౌలాలంపూర్‌ నుంచి ఇండియాకు తిరిగొస్తున్న పెంచల్‌రెడ్డిని శనివారం రాత్రి చెన్నై ఎయిర్‌పోర్ట్‌ అధికారుల సహాయంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను ఆదివారం ఉదయం కదిరిలో న్యాయమూర్తి మీనాక్షి సుందరి ఎదుట హాజరు పరచగా.. 13 రోజులు రిమాండ్‌ విధిస్తూ.. ఆదేశించారు దర్యాప్తులో భాగంగా నిందితుడిని కోర్టు అనుమతితో పోలీస్‌ కస్టడీలోకి తీసుకోనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని