logo

జగనూ.. చెరువులను మింగేస్తున్నారు

పూర్వీకులు ఎంతో ముందుచూపుతో చెరువులను ఏర్పాటుచేశారు. గొలుసుకట్టు విధానంలో ఉండడంతో వరద నివారణ సాధ్యమయ్యేది. భూగర్భ జలాలు పెరుగుతాయి. తాగునీటి అవసరాలు తీరడంతో పాటు సాగుకు ఆధారంగా ఉన్నాయి.

Updated : 29 Apr 2024 05:16 IST

చెరువుల్లో వైకాపా తిమింగలాలు
కావలి, న్యూస్‌టుడే

పూర్వీకులు ఎంతో ముందుచూపుతో చెరువులను ఏర్పాటుచేశారు. గొలుసుకట్టు విధానంలో ఉండడంతో వరద నివారణ సాధ్యమయ్యేది. భూగర్భ జలాలు పెరుగుతాయి. తాగునీటి అవసరాలు తీరడంతో పాటు సాగుకు ఆధారంగా ఉన్నాయి. వీటిని వైకాపా నాయకులు  చెరబడుతున్నారు. కొందరు ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. మరికొందరు మట్టి తవ్వకాలు చేస్తున్నారు. దీంతో ఇవి కనుమరుగవుతున్నాయి. ప్రజలకు నీటి కష్టాలు వస్తున్నాయి.

ధికారమే అండగా వైకాపా వర్గీయులు చెలరేగిపోతున్నారు. కొందరు ఏకంగా నిర్మాణాలు చేస్తున్నారు. తిమింగలాల్లా  పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న చెరువులు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికే ప్రధానమైన మందాటి చెరువు ఆచూకీ కోల్పోగా పాపిరెడ్డి, ముసునూరులో ఉన్న  వాటిలో పాగా వేస్తున్నారు. పట్టణంలోని మందాటి చెరువు ఎంతో కీలకం. దీన్ని రెండో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి గతంలో ప్రకటించారు. అంతకుముందే దీని పరిసరాలను గ్రీనరీ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు ప్రమాణపత్రం సమర్పించారు. రెండో సమ్మర్‌ స్టోరేజీ లేదు. మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు నోచుకోలేదు.

పాపిరెడ్డి చెరువు పోరంబోకు స్థలంలో భారీ భవనం


పౌరుల ఉద్యమం

ఆక్రమణలను అడ్డుకునేందుకు విశ్రాంత అధ్యాపకులు కనుమూరి బాపిరెడ్డి నేతృత్వంలో ఓ కమిటీ కొలువుదీరింది. చెరువుల పరిరక్షణ సమితి పేరిట ఉద్యమానికి సన్నద్ధమయ్యారు. గతంలోనే వివిధ అంశాలపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలను సేకరించి కలెక్టర్‌ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమాల్లో వినతులు అందజేశారు.


గొలుసుకట్టు విధానంలో..

వర్షాలొచ్చినప్పుడు ఓ చెరువు నిండగానే మరో దానికి ప్రవాహం వెళ్లేలా గొలుసుకట్టు విధానంలో తటాకాలను రూపొందించారు. పట్టణంలో బుడంగుంట చెరువు నిండితే మందాటి చెరువుకు దీని తరువాత పాపిరెడ్డి చెరువు, అటునుంచి తాళ్లపాళెంలోని వాటికి వెళ్లేలా ఏర్పాటుచేశారు.


చిన్ననీటి వనరు.. కనిపించని ఆదరువు

జలదంకి చెరువుకట్టపై ఏపుగా పెరిగిన చిల్లచెట్లు

దుత్తలూరు, న్యూస్‌టుడే: మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలోని చిన్ననీటి వనరులపై వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. వీటి అభివృద్ధికి పైసా ఖర్చు పెట్టిన దాఖలాల్లేవు. ఫలితంగా గ్రామాల్లోని చెరువుల రూపురేఖలు మారిపోయాయి. చెరువు లోతట్టు, కట్టలపై చిల్లచెట్లు విపరీతంగా పెరిగి విస్తరించాయి. గత ప్రభుత్వ హయాంలో రూపుకోల్పోతున్న చెరువులతోపాటు అధ్వానంగా ఉన్న వాటిని గుర్తించి వేసవి కాలంలోనే నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేసేవారు. వైకాపా ప్రభుత్వం దీనికి భిన్నంగా వ్యవహరిస్తుండటంతో వీటి పరిస్థితి దారుణంగా తయారైంది. ్య ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో 65 ప్రధాన, 137 సాధారణ చెరువులు ఉన్నాయి. మెట్ట ప్రాంతం అవడంతో రైతులు వర్షాలపై ఆధారపడి వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడు చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలలో ఉన్న నీటిని వినియోగించుకుంటున్నారు. ్య గత ప్రభుత్వ హయాంలో నీటి వనరులు పెంచేందుకు వివిధ రకాల చర్యలు చేపట్టేది. అవసరమైన చోట్ల చెక్‌డ్యాంల ఏర్పాటుతోపాటు ఉపాధిహామీ పథకం కింద చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు చేయించేవారు. దీంతో వాటిల్లో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండేవి. వైకాపా అయిదేళ్ల పాలనలో చెరువుల మరమ్మతులకు రూపాయి కూడా మంజూరు చేయలేదు. దీంతో వాటిల్లో పూడిక పేరుకుపోయింది. అవి నీటి సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి.


నిర్లక్ష్యం చూపుతోంది..
- శ్రీనివాసులు, రైతు

వైకాపా ప్రభుత్వం చెరువుల నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. చెరువుల కింద ఉన్న కాలువల పరిస్థితి దారుణంగా ఉంది. వాటిని రైతులే బాగు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతు ప్రభుత్వమని చెప్పుకోవడమే తప్ప అవసరమైన నీటి వనరుల సంరక్షణను పట్టించుకోకపోవడం దారుణం. గతంలో వర్షాలు రాక ముందే చెరువులకు మరమ్మతులు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేవారు.


రూపుకోల్పోయాయి
- వెంకట్రామిరెడ్డి, రైతు

గ్రామాల్లోని చాలా చెరువులు రూపుకోల్పోయాయి. చెరువులు, కాలువలు, కట్టలపై విపరీతంగా చిల్లచెట్లు మొలిచి చెరువు కట్టలు బలహీనంగా మారాయి. గతంలో ఉపాధి హామీ పథకం కింద వాటిల్లో పూడికతీత చేపట్టేవారు. ప్రస్తుతం ఆపనులు చేయడంలేదు. అలానే వదిలేస్తే చెరువుల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. పాలకులు, అధికారులు నీటి వనరులపై ప్రత్యేక దృష్టి పెడితేనే అవి బాగుపడే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని