logo

‘పదేళ్లలో అభివృద్ధి శూన్యం’

పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌, ఎన్డీయే కూటమిని ఓడించాలని తెలంగాణ సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం (టీడీఎస్‌ఎఫ్‌) రాష్ట్ర కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వినాయక్‌రెడ్డి అన్నారు.

Published : 28 Apr 2024 05:48 IST

బహిరంగ సభలో ప్రసంగిస్తున్న టీడీఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వినాయక్‌రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌, ఎన్డీయే కూటమిని ఓడించాలని తెలంగాణ సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం (టీడీఎస్‌ఎఫ్‌) రాష్ట్ర కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వినాయక్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రం ప్రగతినగర్‌ మున్నూరుకాపు కల్యాణ మండపంలో శనివారం బహిరంగ సభ నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఈ పదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. భారత జాతీయవాదుల ఉద్యమం జాతీయ కన్వీనర్‌ కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. విద్య, వైద్య రంగాలను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ గాలిలో కలిసిపోయిందన్నారు. కార్పొరేట్‌ సంస్థల లాభాలు గరిష్ఠ స్థాయికి చేరాయని, భాజపాను ఓడించి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత విద్యార్థులు, యువత, కార్మికులు, రైతులపై ఉందని పేర్కొన్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌(ప్రజాపంథా) నాయకుడు చంద్రశేఖర్‌, న్యూడెమోక్రసీ నేత జేవీ.చలపతిరావు, ఆల్‌ ఇండియా ఫ్రీడం ఫైటర్స్‌ వెల్ఫేర్‌ జాతీయ అధ్యక్షుడు సర్దార్‌ భక్తావర్‌ సింగ్‌, టీడీఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సమన్వయకర్త గోవర్ధన్‌, జిల్లా నాయకులు వనమాల కృష్ణ, పాపయ్య, శ్రీనివాస్‌, సాయిబాబా, ప్రభాకర్‌, నరేందర్‌, దాస్‌, సుధాకర్‌, శివకుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని