logo

ఎల్లలు దాటిన నాట్యాభినయం

భారతీయ సంస్కృతిలో నృత్యానికి విశేష ఆదరణ ఉంది. దానిపై ఇందూరు కళాకారులు మక్కువ పెంచుకుని అంతర్జాతీయ వేదికల్లో నాట్యాభినయం చేస్తూ మురిపిస్తున్నారు.

Updated : 29 Apr 2024 05:51 IST

 ప్రపంచ వేదికల్లో ఇందూరు కళాకారుల ప్రతిభ
నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం

 భారతీయ సంస్కృతిలో నృత్యానికి విశేష ఆదరణ ఉంది. దానిపై ఇందూరు కళాకారులు మక్కువ పెంచుకుని అంతర్జాతీయ వేదికల్లో నాట్యాభినయం చేస్తూ మురిపిస్తున్నారు. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ, తల్లిదండ్రులకు, జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తెస్తూ అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్నారు. నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ కథనం.

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం

జిల్లా కేంద్రంలోని జ్ఞాన సరస్వతి ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలలో శాస్త్రీయ నృత్యంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 2016లో పేరిణి శాస్త్రీయ నృత్యంపై సర్టిఫికెట్‌ కోర్సు ప్రారంభమైంది. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చిన ప్రముఖ నాట్య కళాకారిణి జయప్రద పేరిణి అధ్యాపకురాలిగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 110 మంది విద్యార్థులు నృత్య పాఠాలు పూర్తి చేశారు. ప్రస్తుతం 90 మంది ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు.

కూచిపూడిలో సాయిరవళి

జిల్లా కేంద్రానికి చెందిన బి.సాయిరవళి ఉన్నత విద్యలో ఎమ్మెస్సీ పూర్తి చేసి గణితంలో బంగారు పతకం అందుకున్నారు. జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయుల్లో కూచిపూడిలో ప్రతిభ చాటారు. హైదరాబాద్‌లోని గోదాదేవి నాట్య సమ్మోహనం వేదికపై ప్రతిభ చాటి ఉత్తమ నాట్యకళాకారిణిగా సత్కారం అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కూచిపూడి డిప్లొమా, భరతనాట్యంలో ధ్రువీకరణ కోర్సు పూర్తి చేశారు. అందెల రవళి పేరిట నాట్యాలయాన్ని స్థాపించి చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు ముంబయి, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, బెంగళూరు, అండమాన్‌ నికోబార్‌తో పాటు మారిషస్‌, శ్రీలంక, బ్యాంకాక్‌, మలేషియాలోని అంతర్జాతీయ వేదికల్లో నృత్యాభినయంతో ఆకట్టుకున్నారు.

సాఫ్ట్‌వేర్‌ కొలువు వదిలి..  

జిల్లా కేంద్రానికి చెందిన దేవులపల్లి చందన ఎంసీఏ పూర్తి చేసి విప్రోలో సాఫ్ట్‌వేర్‌ కొలువు సాధించింది. నాట్యంపై మక్కువతో ఉద్యోగం వదిలి ఇదే రంగంలో రాణిస్తున్నారు. జానపదం, కూచిపూడి, భరతనాట్యంలో వైవిధ్యతను ప్రదర్శించారు. కూచిపూడి, ఆంధ్రనాట్యంలో డిప్లొమా, భరతనాట్యంలో సర్టిఫికెట్‌ కోర్సు, కర్ణాటక గాత్రంలో డిప్లొమా చేశారు. వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ (కూచిపూడి కళాక్షేత్రం) గుంటూరు, తిరుపతి(నాద నీరాజనం), ముంబయి, అండమాన్‌నికోబార్‌, హరియాణా వంటి ప్రాంతాల్లోని వేదికలపై నృత్యం చేసి శెభాష్‌ అనిపించుకున్నారు. హైదరాబాద్‌ ఎల్బీస్టేడియంలో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుకు ఏర్పాటు చేసిన జానపద మహాబృంద నాట్యంలో తన శిష్య బృందంతో ప్రదర్శన ఇచ్చారు. ఆస్ట్రేలియా తెలుగు సంఘం వారి వేదికపై శాస్త్రీయ నృత్యంపై అవగాహన సదస్సులో పాల్గొన్నారు. సిలికానాంధ్ర వారి కూచిపూడి మహా నాట్య సమ్మేళనంలో నాట్యం చేసి మూడు సార్లు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులను అందుకున్నారు.


ఉత్తమ అభిజ్ఞ

బోధన్‌ పట్టణానికి చెందిన భారతుల ఉత్తమ అభిజ్ఞ నాట్యంలో దిట్ట. విద్యార్థి దశ నుంచే అభినయంలో ప్రతిభ కనబరుస్తూ ఏకంగా 19 పురస్కారాలు అందుకొన్నారు. అందులో రెండు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో నమోదైన నృత్యాల్లో భాగస్వామ్యం ఉండటం విశేషం. అభిజ్ఞ ఐదేళ్ల వయసులోనే గిన్నిస్‌ రికార్డు ధ్రువపత్రం అందుకుంది. మొత్తం రెండు గిన్నిస్‌ రికార్డులు, మార్వలెస్‌ బుక్‌, ఇండియా, హైరేంజ్‌, ఫెంటాస్టిక్‌ తెలుగు, నోబుల్‌, ఏషియన్‌ వరల్డ్‌, ఛాంపియన్స్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. కీర్తి కిరణం, శ్రీతాళ్లపాక అన్నమాచార్య నృత్య పురస్కారంతోపాటు ప్రపంచ తెలుగు మహాసభలు, ఇస్కాన్‌ వంటి సంస్థల వేదికలపైనా నృత్య ప్రదర్శనలతో అనేక ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని