logo

రాజకీయాల్లో కుటుంబ కథా చిత్రం

రాజకీయపరంగా కుటుంబ కలహాలు సర్వ సాధారణమే. పలుచోట్ల ఒకే కుటుంబానికి చెందినవారు ప్రత్యర్థులుగా తలపడుతున్న విషయం తెలిసిందే.

Published : 28 Apr 2024 06:57 IST

ఖగుపతి ప్రధాని (పాత చిత్రం)

సిమిలిగుడ, న్యూస్‌టుడే: రాజకీయపరంగా కుటుంబ కలహాలు సర్వ సాధారణమే. పలుచోట్ల ఒకే కుటుంబానికి చెందినవారు ప్రత్యర్థులుగా తలపడుతున్న విషయం తెలిసిందే. నవరంగపూర్‌ నియోజకవర్గంలో ఒకే కుటుంబం నుంచి పిన్ని, కొడుకులు రెండు ప్రధాన పార్టీల తరఫున ఎన్నికల బరిలో పోటీ చేయడం చర్చనీయాంశమైంది. రాజకీయంలో చక్రం తిప్పిన ఖగుపతి ప్రధాని కుటుంబంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన 1967లో తొలిసారిగా కాంగ్రెస్‌ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత 1971, 1977, 1980, 1984, 1989, 1991, 1996, 1998ల్లో నవరంగపూర్‌ ఎంపీగా గెలుపొంది రికార్డు సృష్టించారు. అనంతరం ఆయన పోటీకి ఆసక్తి చూపలేదు. అనంతరం ఖగుపతి తమ్ముడు గోపీనాథ్‌ నవరంగపూర్‌ జిల్లా పరిషత్‌ మొదటి అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన కుమారుడు సదాశివ 2019లో బిజద తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఖగుపతి మనవడు దిలీప్‌ తాత పని చేసే కాంగ్రెస్‌లో ఉంటూ సర్పంచిగా, సమితి సభ్యుడిగా ఎన్నికయ్యారు. దిలీప్‌, సదాశివ కుటుంబ సభ్యులు ఇరుపార్టీల్లో చేరడంతో వారి మధ్య వైరం ఏర్పడింది.

కౌసల్య , దిలీప్‌ ప్రధాని

మళ్లీ తెరపైకి

రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు మళ్లీ ప్రధాని కుటుంబం తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. నవరంగపూర్‌ నుంచి బిజద అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే సదాశివ సతీమణి కౌసల్య రంగంలో దిగుతున్నారు. ఆమెకు గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ దిలీప్‌కు టికెట్‌ కేటాయించింది. దీంతో ఎన్నికల రంగంలో పిన్నితో కొడుకు తలపడనున్నాడు. దశాబ్దాల రాజకీయ చరిత్ర గల ప్రధాని కుటుంబంలో ప్రత్యర్థులుగా బరిలో ఉండడం విశేషం. కాంగ్రెస్‌ తరఫున నవరంగపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి భుజబల్‌ మాఝి, డాబుగావ్‌ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన కుమార్తె లిపికా మాఝి పోటీ చేయడం మరో ఆసక్తికర విషయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని