logo

మండుటెండల్లో.. చల్లచల్లగా!

ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్న నేపథ్యంలో బీరు విక్రయాలు జోరందుకున్నాయి. ఎండల నుంచి ఉపశమనం కోసం మందు బాబులు బీరు వైపు మొగ్గు చూపుతుండడంతో వీటి అమ్మకాలు అమాంతంగా పెరిగాయి.

Published : 29 Apr 2024 04:26 IST

గతేడాదితో పోలిస్తే 44.37 శాతానికిపైగా పెరిగిన బీరు విక్రయాలు
25 రోజుల్లో అమ్ముడుపోయిన 19.65 లక్షల పెట్టెలు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్న నేపథ్యంలో బీరు విక్రయాలు జోరందుకున్నాయి. ఎండల నుంచి ఉపశమనం కోసం మందు బాబులు బీరు వైపు మొగ్గు చూపుతుండడంతో వీటి అమ్మకాలు అమాంతంగా పెరిగాయి. కేవలం 25 రోజుల్లో 19 లక్షలకుపైగా పెట్టెల బీర్లు అమ్ముడుపోయాయంటే పరిస్థితి తీవ్రత ఎంతుందో అర్థమవుతోంది. గతేడాదితో పోలిస్తే వీటి విక్రయాలు 44 శాతానికిపైగా పెరగడం గమనార్హం. అబ్కారీ శాఖ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి 25 వరకు రాష్ట్రంలో 19.65 లక్షల పెట్టెల బీర్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 13.61 లక్షలు అమ్ముడుపోగా, ఈ ఏడాది బీరు విక్రయాలు 44.37 శాతం పెరిగాయి. ఒక్కో పెట్టెలో 24 బీరు సీసాలు లేదా క్యాన్లు ఉంటాయని పేర్కొన్న అబ్కారీశాఖ వర్గాలు గతంలో ఏప్రిల్‌ నెలలో వీటి విక్రయాలను 26 నుంచి 27 శాతం మాత్రమే పెరిగినట్లు వెల్లడించాయి. గతేడాది మార్చితో పోలిస్తే ఈసారి 23 శాతం మేర బీరు విక్రయాలు పెరిగాయని ఆశాఖ పేర్కొంది.
అరకొరగా పెరిగిన విదేశీ మద్యం విక్రయాలు: పెరిగిన ఎండల వల్లే బీరు విక్రయాలు పెరిగినట్లు భావిస్తోన్న అబ్కారీ శాఖ వర్గాలు విదేశీ మద్యం విక్రయాల్లో స్పల్ప తేడా కనిపించడాన్ని ఇందుకు ఉదహరిస్తున్నాయి. గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి 25 మధ్య 3.38 లక్షల విదేశీ మద్యం పెట్టెలు అమ్ముడు పోగా, ఈ ఏడాది ఇదే సమయంలో ఈ విక్రయాలు కేవలం 3.42 లక్షల పెట్టెలకు మాత్రమే పరిమితమైనట్లు ఆ శాఖ రికార్డులు వెల్లడిస్తున్నాయి. అదే మార్చి విషయానికొస్తే గతేడాది 9.47 లక్షల పెట్టెలు విక్రయించగా, ఈ ఏడాది 10.49 లక్షల పెట్టెలుగా నమోదు కావడం గమనార్హం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల ద్వారా రూ.10,160 కోట్ల ఆదాయం సమకూరినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని