logo

అమ్మా.. నా ప్రాణం నీ చేతిలోనే..

శిశు మరణాలు లేకుండా చేయాలన్నది వైద్య ఆరోగ్య శాఖ నినాదం. కానీ పసికందులు గర్భంలో, పుట్టిన గంటల వ్యవధిలో, వారం, రెండు వారాల్లో వివిధ కారణాలు, అనారోగ్యంతో ఊపిరి వదిలేస్తున్నారు.

Published : 02 Jul 2023 04:55 IST

న్యూస్‌టుడే, విజయనగరం రింగురోడ్డు

ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స పొందుతున్న నవజాత శిశువులు గర్భం దాల్చింది  మొదలు పుట్టబోయే  బిడ్డ రూపం ఊహిస్తూ.. మురిసిపోతుంటుంది కాబోయే తల్లి.. తనలో ప్రాణం పోసుకుంటున్న శిశువును ముద్దాడటం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంది..


కలలు కన్న ఆ రూపం చేతికందేలోపే  శాశ్వతంగా దూరమైతే.. దానికి మించిన నరకం మరొకటి ఉంటుందా.. కానీ ఈ బాధను అనుభవిస్తున్నారు చాలా మంది తల్లులు.. ఉమ్మడి జిల్లాలో ఏటా నమోదు అవుతున్న శిశు మరణాలే దీనికి నిదర్శనం.  


శిశు మరణాలు లేకుండా చేయాలన్నది వైద్య ఆరోగ్య శాఖ నినాదం. కానీ పసికందులు గర్భంలో, పుట్టిన గంటల వ్యవధిలో, వారం, రెండు వారాల్లో వివిధ కారణాలు, అనారోగ్యంతో ఊపిరి వదిలేస్తున్నారు. బాల్య వివాహాలు, పౌష్టికాహార లోపం, గర్భిణులకు అవగాహన లేకపోవడం.. ప్రసవం సమయంలో క్షేత్రస్థాయిలో సరైన వైద్య సేవలు అందకపోవడం శిశు మరణాలకు ప్రధాన కారణాలని ప్రాథమికంగా నిర్ధారించారు. ఉమ్మడి జిల్లాలో గతేడాది అధికారిక గణాంకాల ప్రకారం 212 శిశు మరణాలు సంభవించాయి. గడిచిన నాలుగేళ్లలో అధికారికంగా 220 బాల్య వివాహాలు జరిగినట్లు గుర్తించారు. అధికారుల దృష్టికి రానివి ఎన్ని ఉంటాయో తెలియదు.

హెచ్‌బీ ఏడు గ్రాములే..!!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గర్భిణుల ఆరోగ్యం కోసం రూ.కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించడమే కాకుండా.. సుఖ ప్రసవం జరిగితే ఆర్థికంగా చేయూతనిస్తున్నాయి. అయినా పౌష్టికాహార లోపంతో  రక్తహీనత వల్ల ప్రసవ సమయంలో కష్టమవుతోంది. 35 నుంచి 45 శాతం మంది గర్భిణులు రక్తహీనతతో ఉంటున్నారు. 12 గ్రాముల హెచ్‌బీ కచ్చితంగా ఉండాలి. రక్తం తక్కువైతే.. ఒక్కోసారి మృత్యువాత పడే అవకాశాలూ ఉన్నాయి. 7, 8 గ్రాములతో ఆసుపత్రికి వస్తున్న రోగులు ఇటీవల పెరిగారని వైద్యులు చెబుతున్నారు.


* పీహెచ్‌సీల పరిధిలో గర్భిణుల ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ సరిగా లేకపోవడం.  

* 18వ ఏటలోనే గర్భం దాల్చడం, శిశువుకు తగ్గట్టు గర్భ సంచి తయారు కాకపోవడం, బాల్య వివాహాలు.

* తక్కువ బరువుతో పుట్టడం, శ్వాసకోశ సమస్యలు.

* శిశువుకు ముర్రుపాలు ఇవ్వలేని స్థితిలో తల్లులు ఉండటం. బయట పాలు పట్టడం వల్ల ఇన్ఫెక్షన్లు.

* తీవ్ర అనారోగ్య సమయంలో శిశువులను పెద్దాసుపత్రులకు తరలించడంలో జాప్యం.

* అంబులెన్సుల్లో వెళ్తుండగా మధ్యలోనే ప్రసవాలు, సాధారణ ప్రసవం కోసం పరిస్థితి చేయిదాటేంత వరకు ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడం.

* నెలకోసారి కచ్చితంగా వైద్య తనిఖీలు చేయించుకోకపోవడం. పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం.


మాతా, శిశు సంరక్షణే మా ప్రధాన నినాదం. హైరిస్కు కేసులను ముందుగానే గుర్తించి ఆసుపత్రుల్లో చేర్పించి తగు చికిత్సలు చేయిస్తున్నాం. చిన్న వయసులోనే వివాహాలు చేసుకోవడం, గర్భధారణ పట్ల అవగాహన లేకపోవడం, ఇతరత్రా ఆలోచనలతో మానసిక సంఘర్షణకు గురికావడం వల్ల తల్లీబిడ్డలపై ప్రభావం పడుతోంది. అయినప్పటికీ ఏ ఒక్కరూ చనిపోకూడదన్న లక్ష్యంతో వైద్య సేవలు అందిస్తున్నాం. మరణాలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం.

ఎస్‌.భాస్కరరావు, డీఎంహెచ్‌వో, విజయనగరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని