logo

సర్కార్‌ తెచ్చిన నీటి కరవు

వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల లోపం.. ప్రజల పాలిట శాపంగా మారింది. నాలుగు రోజులకోసారి తాగునీరు సరఫరా చేయడంతో బొబ్బిలి పట్టణ వాసుల గొంతులు ఎండిపోతున్నాయి.

Published : 28 Apr 2024 04:34 IST

నాలుగు రోజులకోసారి సరఫరా 
నిర్వహణ లోపంతో ప్రజల పాట్లు

ఓంకార్‌ థియేటర్‌ కూడలిలో బిందెల వరుస

  • పురపాలక: బొబ్బిలి 
  • వార్డులు: 31
  • కుళాయిల సంఖ్య: 4 వేలు
  • జనాభా: 62 వేలు
  • అవసరమైన తాగునీరు: 9 ఎంఎల్‌డీ
  • ప్రస్తుతం ఇస్తున్నది: 3 ఎంఎల్‌డీ
  • నీటి ఎద్దడి ప్రాంతాలు: రాజామహల్‌, ప్రసాద్‌నగర్‌ కాలనీ, ఓంకార్‌ థియేటర్‌ సందు, బాలాజీ నగర్‌, కంచరవీధి, రెడ్డికవీధి, చినబజారు, గొల్లపల్లి, ఐటీఐ కాలనీ, ఇందిరమ్మకాలనీ, పాత బొబ్బిలి శివారు ప్రాంతాలు

ఇందిరమ్మ కాలనీలో ట్యాంకరు వద్ద పోటీ

బొబ్బిలి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల లోపం.. ప్రజల పాలిట శాపంగా మారింది. నాలుగు రోజులకోసారి తాగునీరు సరఫరా చేయడంతో బొబ్బిలి పట్టణ వాసుల గొంతులు ఎండిపోతున్నాయి. సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో మండుటెండలో మహిళలు పడిగాపులు కాస్తున్నారు. 31 వార్డుల్లోనూ సమస్య తీవ్ర రూపం దాల్చింది. తరచూ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, పైపులైన్ల లీకులు, పర్యవేక్షణ గాడితప్పడంతో ఉన్న నీరు కూడా సక్రమంగా రాక అవస్థలు తప్పడం లేదు.

పట్టణానికి తాగునీరు అందించే వేగావతి నదిలో నీటి లభ్యత తగ్గింది. ఈ తరుణంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పాలకులు మరింత నిర్లక్ష్యం చూపుతున్నారు. పైపులైన్ల లీకులను అరికట్టడంలో విఫలమయ్యారు. భోజరాజపురం హెడ్‌ వాటర్‌ వర్క్సు నుంచి పట్టణానికి వచ్చే ప్రధాన పైపులైను నుంచి రైల్వేస్టేషన్‌ కూడలి, చర్చిసెంటర్‌, కోరాడవీధి, దావాల వీధుల్లో లీకులు ఉన్నాయి. జనాభా నాలుగింతలు పెరిగినా తాగునీటి సరఫరా పునరుద్ధరణకు మాత్రం చర్యలు లేవు. రెండ్రోజులకోసారి కొన్ని వీధులకు రాగా, మరికొన్ని చోట్ల నాలుగు రోజులకోమారు వస్తోందని స్థానికులు వాపోతున్నారు. వారం రోజులుగా నిర్వహణ మరింత గాడితప్పిందని చెబుతున్నారు. ఇందిరమ్మ కాలనీలో ట్యాంకర్లు వస్తేనే ప్రజల గొంతు తడుస్తోంది. ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని పురపాలక కమిషనర్‌ రామలక్ష్మి ‘న్యూస్‌టుడే’తో పేర్కొన్నారు.

ఒక బిందె మాత్రమే..

ఓంకార్‌ థియేటర్‌ ప్రాంతంలో నాలుగు రోజుల తర్వాత కుళాయిల నుంచి నీరు వచ్చింది. అది కూడా ఎక్కువ సమయం ఇవ్వలేదు. సీరియల్‌లో బిందెలు పెడుతుంటే మనిషికి ఒక బిందె మాత్రమే వస్తోంది. అవి ఎటుకూ సరిపోవడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మున్సిపల్‌ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదు.

పార్వతి, ఓంకార్‌ థియేటర్‌ కూడలి

ధార రావడం లేదు

గొల్లపల్లిలో కుళాయిల నుంచి సన్నటి ధార వస్తోంది. వీధిలో కుళాయిల సంఖ్య తక్కువ. ఆపై పిట్ ట్యాపులు దిగువకు ఉన్నాయి. పట్టుకునేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. అయినా అందరికీ పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. సరఫరా సమయం పెంచాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది.  

రవణమ్మ, గొల్లపల్లి, బొబ్బిలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని